
25 నుంచి కొంతేరులో నాటికల పోటీలు
యలమంచిలి: యూత్ క్లబ్ నాటక పరిషత్ ఆధ్వర్యంలో ఈ నెల 25 నుంచి 27 వరకు మూడు రోజులపాటు కొంతేరు పులపర్తి వీరాస్వామి యూత్ క్లబ్ కళామందిరంలో 43వ రాష్ట్ర స్థాయి నాటిక పోటీలు నిర్వహిస్తున్నట్లు క్లబ్ చైర్మన్ అంబటి మురళీకృష్ణ, పాలకవర్గ సభ్యులు తెలిపారు. స్థానిక కళామందిరంలో బుధవారం సమావేశమైన సభ్యులు నాటిక పోటీల బ్రోచర్ విడుదల చేశారు. కార్యక్రమంలో క్లబ్ కార్య దర్శి గంటా ముత్యాలరావు(నాయుడు), బోణం రవిబాబు, జక్కంశెట్టి సుబ్రహ్మణ్యం, అంబటి నవీన్‌చంద్ తదితరులు పాల్గొన్నారు.
పాలిసెట్‌కు ఉచిత శిక్షణ
పెంటపాడు: ఈ నెల 30న జరగనున్న పాలిసెట్ ప్రవేశపరీక్షకు ఆయా పాలిటెక్నిక్ కళాశాలల్లో ఉచిత శిక్షణ అందిస్తున్నట్లు గూడెం పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ డి. ఫణీంద్ర ప్రసాద్ ఒక ప్రకటనలో తెలిపారు. పూర్తి వివరాలకు 90102 22178, 94901 04336 ఫోన్ నెంబర్లలో సంప్రదించాలన్నారు.
పోలీసు సబ్ డివిజన్‌కు ఉత్తమ అవార్డు
భీమవరం: పశ్చిమగోదావరి జిల్లా ఉండి మండలం యండగండి గ్రామంలో శవాన్ని పార్శిల్ చేసిన కేసును ఛేదించిన భీమవరం సబ్ డివిజన్ పోలీసులకు డీజీపీ హరీష్‌కుమార్‌గుప్త అవార్డు అందించారు. గత డిసెంబర్ 17న కాళ్ల మండలం గాంధీనగర్‌కు చెందిన బర్రె పర్లయ్యను అదే మండలానికి చెందిన శ్రీధర్‌వర్మ హత్యచేసి పెట్టెలో పార్శిల్ చేసి యండగండి పంపించాడు. ఈ కేసు రాష్ట్రవ్యాప్తంగా సంచనం సృష్టించింది. ఈ కేసును సవాల్‌గా తీసుకున్న పోలీసులు ఎస్పీ అద్నాన్ నయీం ఆస్మి ఆదేశాలతో ఏఎస్పీ వి.భీమారావు, డీఎస్పీ రావూరి గణేష్ జయసూర్య, టూటౌన్ సీఐ జి.కాళీచరణ్, ఆకివీడు సీఐ వి.జగదీశ్వరరావు, భీమవరం, ఉండి, కాళ్ల, ఆచంట ఎస్సైలు ఛేదించి నిందితుడ్ని అరెస్టు చేశారు. నేర పరిశోధనలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన వారికిచ్చే ఏబీసీడీ (అవార్డు ఫర్ బెస్ట్ క్రైమ్ డిటెక్షన్) అవార్డులో భీమవరం డివిజన్ ప్రథమస్థానంలో నిలిచింది.
కార్పొరేషన్ రుణం కోసం దీక్ష
ఆకివీడు: కార్పొరేషన్ రుణాల మంజూరులో అవకతవకలు జరిగాయని, అర్హులకు రుణాలు మంజూరు చేయలేదని మండలంలోని అజ్జమూరుకు చెందిన వర్ధినీడి వరప్రసాద్ బుధవారం దీక్ష చేపట్టారు. కాపు కార్పొరేషన్ లోన్ తనకు మంజూరు చేయకుండా కొంతమందికి రికమండేషన్‌తో కేటాయించడం దారుణమన్నారు. చివరకు బ్యాంకు అధికారులు రుణం మంజూరుకు అనుమతి ఇవ్వడంతో ఆయన దీక్ష విరమించారు.
లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తే కఠిన చర్యలు
భీమవరం(ప్రకాశం చౌక్): స్కానింగ్ సెంటర్లలో లింగ నిర్ధారణ పరీక్షలు చేయకూడదని, చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారిణి జి.గీతాబాయి అన్నారు. బుధవారం జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ కార్యాలయంలో జిల్లా స్థాయి గర్భస్థ పిండ లింగ నిర్ధారణ కమిటీ సలహా సంఘం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లాలోని స్కానింగ్ కేంద్రాలను ఎప్పటికప్పుడు తనిఖీ చేయాలని ఆదేశించారు.

25 నుంచి కొంతేరులో నాటికల పోటీలు

25 నుంచి కొంతేరులో నాటికల పోటీలు