
యాదాద్రి: కృష్ణానదిలో పడి ఓ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ మృతిచెందాడు. ఈ ఘటన మట్టపల్లిలో శనివారం జరిగింది. మఠంపల్లి ఎస్‌ఐ సీహెచ్ బాలకృష్ణ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. గుంటూరు (పల్నాడు) జిల్లా పిడుగురాళ్లకు చెందిన మాశెట్టి సుబ్బారావు, రాజేశ్వరి దంపతుల పెద్దకుమారుడైన మాశెట్టి సుబ్రహ్మణ్యం (31)మలేషియాలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నాడు. ఈతడి తండ్రి సుబ్బారావు గుంటూరు జిల్లాలోనే కృష్ణానదీతీరంలో గల దైదా పుణ్యక్షేత్రానికి వెళ్లి ప్రమాదవశాత్తు నది లోపడి మృతిచెందాడు.
అప్పటినుంచి సుబ్రహ్మణ్యం మానసికవ్యాధికి గురయ్యాడు. కుటుంబ సభ్యులు విజయవాడలోని కృష్ణాన్యూరో సెంటర్‌నందు మానసిక వైద్యుని పర్యవేక్షణలో చికిత్స నిర్వహిస్తూ పిడుగురాళ్లలోని ఇంటివద్దే ఉంచుతున్నారు.అయితే సుబ్రహ్మణ్యం మాత్రం మానసిక స్థితి మెరుగుపడక ఎప్పుడూ ఒంటరిగా ఉంటూ ఆలోచిస్తూండేవాడు.అదే మానసిక స్థితితో ఇంటినుంచి ఈనెల16న ఎవరికీ చెప్పకుండా వెళ్లిపోయి మట్టపల్లి వద్ద కృష్ణానదిలో శవమైతేలాడు. కాగా సమాచారం తెలుసుకున్న పోలీసులు నదిలోనుంచి మృతదేహాన్ని బయటకుతీశారు.
మృతదేహం ఫోటోలు సోషల్ మీడియాలో చూసిన కుటుంబసభ్యులు,బంధువులు మట్టపల్లికి చేరుకుని సుబ్రహ్మణ్యంగా గుర్తించారు. మృతుడు మానసిక స్థితి సరిగాలేకనే నదిలోపడి చనిపోయాడని అతని తమ్ముడు మాశెట్టి వెంకటశ్రీనివాసరావుమఠంపల్లి పోలీసులకు ఫిర్యాదుచేశారు. మృతుడు అవివాహితుడు తల్లి,తమ్ముడు ఉన్నారు. ఈమేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment