అవిశ్వాస తీర్మానం సక్రమమే
మోత్కూరు : మోత్కూరు సింగిల్ విండో చైర్మన్‌పై పెట్టిన అవిశ్వాస తీర్మానం సక్రమమే అని కోఆపరేటివ్ ట్రిబ్యునల్ న్యాయమూర్తి తీర్పు ఇచ్చారు. వివరాలు.. మోత్కూరు నాగార్జున రైతు సేవా సహకార సంఘం మాజీ చైర్మన్ కంచర్ల అశోక్‌రెడ్డి తనపై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానాన్ని సవాల్ చేస్తూ కోఆపరేటీవ్ ట్రిబ్యునల్‌లో అప్పీల్ చేశారు. తనను పదవి నుంచి అక్రమంగా తొలగించారని అప్పీలు చేశారు. ఇరుపక్షాల వాదనలు విన్న కోఆపరేటివ్ ట్రిబ్యునల్ న్యాయమూర్తి.. అశోక్‌రెడ్డి వేసిన కేసును కొట్టివేశారు. డీసీఓ నిర్వహించిన ఎన్నికల్లో చైర్మన్‌గా పేలపూడి వెంకటేశ్వర్లు ఎన్నిక సక్రమమేనని న్యాయమూర్తి సోమవారం తీర్పునిచ్చారు.
ఆలేరు మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ తొలగింపు
యాదగిరిగుట్ట: ఆలేరు వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ పచ్చిమట్ల మదార్ గౌడ్‌ను పదవి నుంచి తొలగిస్తూ హైకోర్టు న్యాయమూర్తి టీ.మాధవిదేవి మంగళవారం తీర్పు వెల్లడించారు. ఆలేరు మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ మదార్‌గౌడ్ ఆలేరు మార్కెట్ కమిటీ పరిధిలోని గ్రామాల్లో నివసించకుండా, మోత్కూర్ మార్కెట్ కమిటీ పరిధిలోని, మోటకొండూర్ మండలం, కాటేపల్లి గ్రామంలో నివసిస్తుండడంతో, ఆయనపై తుర్కపల్లి బీఆర్‌ఎస్ పార్టీ సెక్రటరీ జనరల్, గంధమల్ల మాజీ సర్పంచ్ శాగర్ల పరమేశ్ కోర్టులో కేసు వేశారు. ఈ విషయమై హైకోర్టులో వాదోపవాదాలు నడిచాయి. మదార్ గౌడ్ ఆలేరు మార్కెట్ కమిటీ ప్రాంతానికి చెందిన వాడు కాదని, ఇది చట్ట విరుద్ధమని, అనర్హత వేటు వేస్తూ న్యాయమూర్తి తీర్పు ఇచ్చారు. మార్కెట్ కమిటీ పరిధిలోని గ్రామస్తులు మాత్రమే పదవికి అర్హులని, స్థానికేతరుడు కావడంతో వైస్ చైర్మన్ పదవి నుంచి తొలగిస్తున్నట్లు జడ్జి తీర్పు ఇచ్చారు.
సుదర్శన చక్రం చెంత పరంజా తొలగింపు
యాదగిరిగుట్ట : యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయ స్వర్ణ విమాన గోపురంపై ఉన్న సుదర్శన చక్రం చుట్టూ వేసిన పరంజా(ఎత్తుగా కట్టిన కర్రలు) సిబ్బంది బుధవారం తొలగించారు. మహా కుంభాభిషేక సంప్రోక్షణ పూజలు పూర్తయిన నేపథ్యంలో దీనిని తొలగించారు. అంతే కాకుండా స్వర్ణ విమాన గోపురానికి ఉత్తర దిశలో ఉన్న కర్రలను సైతం సిబ్బంది తొలగించే పనులు చేపట్టారు.
ఎస్టీ బాలికల హాస్టల్ వార్డెన్ సస్పెన్షన్
భువనగిరి : పట్టణంలోని సింగన్నగూడెం వద్ద ఉన్న ఎస్టీ బాలికల హాస్టల్‌ను మంగళవారం రాత్రి కలెక్టర్ హనుమంతరావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా హాస్టల్ వంట గదిని పరిశీలించారు. కాగా హాస్టల్‌లో మెనూ సక్రమంగా పాటించడం లేదని గతంలో వార్డెన్ విజయలక్ష్మికి షోకాజ్ నోటీసులు జారీ చేశారు. అయినప్పటికీ వార్డెన్ తీరు మారలేదు. తనిఖీ సమయంలో వార్డెన్ మెనూ పాటించడం లేదని గుర్తించిన కలెక్టర్.. వార్డెన్‌ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అనంతరం విద్యార్థులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
పంచాయతీ కార్యదర్శి..
భువనగిరిటౌన్, బొమ్మలరామారం : విధుల్లో నిర్లక్ష్యం వహించినందుకు బొమ్మలరామారం పంచాయతీ కార్యదర్శి పద్మను సస్పెండ్ చేస్తూ కలెక్టర్ ఎం.హనుమంతరావు మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. 2024–25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఇంటి యజమానులకు డిమాండ్ నోటీసులు జారీ చేయకపోవడం, తప్పుడు పన్ను రశీదులను ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయడంతోపాటు, గ్రామంలో పారిశుద్ధ్య నిర్వహణ లోపం, ఇంటి నిర్మాణ అనుమతులు నిబంధనలకు విరుద్ధంగా జారీ చేయడంతో సస్పెండ్ చేశారు.
హనుమంతుడికి
ఆకుపూజ
యాదగిరిగుట్ట: యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయానికి క్షేత్రపాలకుడిగా ఉన్న శ్రీఆంజనేయస్వామికి అర్చకులు మంగళవారం ఆకుపూజ విశేషంగా నిర్వహించారు. హనుమంతుడికి ఇష్టమైన రోజు కావడంతో ప్రధానాలయంతోపాటు విష్ణు పుష్కరిణి వద్ద, పాతగుట్ట ఆలయంలో ఆంజనేయస్వామిని సింధూరం, పాలతో అభిషేకించారు. తమలపాకులతో అర్చించి హనుమంతుడికి ఇష్టమైన నైవేద్యం సమర్పించారు.
Comments
Please login to add a commentAdd a comment