
సాగర్ మధ్యన
శివ నామస్మరణ
నాగార్జునసాగర్: మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని నాగార్జునసాగర్ జలాశయం మధ్యన గల సింహపురి కొండపై శివ నామస్మరణ మార్మోగింది. బుధవారం సింహపురి కొండపై గల జరిగిన ఏలేశ్వరస్వామి జాతరకు రెండు తెలుగు రాష్ట్రాల్లోని గుంటూరు, ప్రకాశం, ఉమ్మడి నల్లగొండ, మహబూబ్‌నగర్ జిల్లాల నుంచి భక్తులు అత్యధిక సంఖ్యలో వచ్చారు. భక్తులు ఏలేశ్వరం చేరుకునేందుకు తెలంగాణ పర్యాటక అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో నాగార్జునసాగర్‌లోని హిల్‌కాలనీ నుంచి లాంచీలను నడిపారు. చందంపేట, నేరెడుగొమ్ము, దేవరకొండతో పాటు వైజాగ్ కాలనీ నుంచి మరబోట్లలో చాలామంది భక్తులు సింహపురి కొండకు చేరుకున్నారు. చందంపేట, దేవరకొండ, నేరెడుగొమ్ము పోలీసులు కొండపై బందోబస్తు నిర్వహించారు. హిల్‌కాలనీ నుంచి లాంచీల్లో వెళ్లే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కల్గకుండా సాగర్ ఎస్‌ఐ సంపత్‌గౌడ్, పోలీసులు పలు సూచనలు చేశారు. సాగర్ జలాశయం తీరాన్ని ఆనుకొని ఉన్న గ్రామాలు, తండాలవాసులు మరబోట్లు, పుట్టీలలో జాతరకు వచ్చారు. జాతరకు వచ్చిన పెద్దలు పలువురికి స్థల పురాణం గురించి వివరించారు. సంతానం లేనివారు కొండ దిగువన సాగర్ జలాశయంలో స్నానమాచరించి నోట్లో నువ్వులు వేసుకుని కొండ పైకి ఎక్కి అక్కడ బండపై ఉమ్మివేస్తే.. అందులో ఎన్ని మొలకలు వస్తే అంతమంది సంతానం కల్గుతారని శివసత్తులు చెప్పడంతో పలువురు భక్తులు వారు చెప్పిన విధంగా చేశారు. సంతానం కల్గిన వారు మొక్కులు చెల్లించుకున్నారు. సాగర్ జలాశయంలో ముంపునకు గురైన గ్రామాలకు చెందిన వారు తమ బంధువులను ఏలేశ్వరం గుట్టపై కలుసుకోవడం ఆనవాయితీగా వస్తుంది. కంబాలపల్లి గ్రామానికి చెందిన వారు మహాశివరాత్రి రోజున ఈ జాతర నిర్వహిస్తున్నారు. జాతరకు వచ్చిన భక్తులకు ఉచిత భోజన సౌకర్యంతో పాటు తాగునీరు అందుబాటులో ఉంచారు.

సాగర్ మధ్యన
Comments
Please login to add a commentAdd a comment