
అనారోగ్య సమస్యలతో రైతు బలవన్మరణం
కేతేపల్లి: అనారోగ్య సమస్యలతో మనోవేదనకు గురైన రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్ప డ్డాడు. ఈ ఘటన కేతేపల్లి మండల కేంద్రంలో బుధవారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కేతేపల్లి మండల కేంద్రానికి చెందిన రైతు గుండిగ బాలరాజు(50) వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. బాలరాజు కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నాడు. ఈ క్రమంలో తీవ్ర మనోవేదనకు గురైన అతడు బుధవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో పురుగుల మందు తాగాడు. కొద్దిసేపటి తర్వాత గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే అతడిని చికిత్స నిమిత్తం నకిరేకల్‌కు తరలిస్తుండగా మార్గమధ్యలోనే మృతి చెందాడు. మృతుడికి భార్య, ఇద్దకు కుమారులు ఉన్నారు. మతుడి భార్య జోస్పిన్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు కేతేపల్లి ఎస్‌ఐ శివతేజ తెలిపారు.
వివాహిత అదృశ్యం
చౌటుప్పల్: చౌటుప్పల్ పట్టణ కేంద్రానికి చెందిన వివాహిత అదృశ్యమైనట్లు ఆమె భర్త బుధవారం స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. సీఐ మన్మథకుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. నల్లగొండ జిల్లా చిట్యాల మండలం వెలిమినేడు గ్రామానికి చెందిన దేశగోని మల్లేష్ పంచాయతీ కార్యదర్శిగా పనిచేసస్తున్నాడు. చౌటుప్పల్ పట్టణ కేంద్రంలోని వలిగొండ రోడ్డులో గల హెచ్‌ఎండీఏ వెంచర్‌లో కుటుంబ సభ్యులతో కలిసి నివాసముంటున్నాడు. అతడికి 16ఏళ్ల క్రితం లింగోజిగూడేనికి చెందిన యువతితో వివాహం జరిగింది. వీరికి ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఈ నెల 25వ తేదీ ఉదయం పని నిమిత్తం మల్లేష్ నల్లగొండకు వెళ్లాడు. మధ్యాహ్నం సమయంలో అతడు తన భార్యకు ఫోన్ చేయగా కుమారుడు అర్జున్ మాట్లాడాడు. అమ్మ తనను లింగోజిగూడెం గ్రామంలోని అమ్మమ్మ ఇంటి వద్ద దింపి బ్యాంక్‌కు వెళ్లిందని తండ్రికి చెప్పాడు. సాయంత్రం మల్లేష్ ఇంటికి చేరుకున్నాక కూడా భార్య తిరిగి రాలేదు. చుట్టుపక్కల ఎంత వెతికినా ఆమె ఆచూకీ లభించలేదు. దీంతో బుధవారం చౌటుప్పల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ పేర్కొన్నారు.
వంతెన పైనుంచి పడి
వ్యక్తి మృతి
రామన్నపేట: బైక్‌పై వెళ్తున్న వ్యక్తి వంతెన పైనుంచి పడి మృతిచెందాడు. ఈ ఘటన రామన్నపేట మండలం లక్ష్మాపురం గ్రామ సమీపంలోని వంతెన వద్ద జరగగా.. బుధవారం ఉదయం వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వలిగొండ మండలం వేములకొండ గ్రామానికి చెందిన కొలగాని వెంకటేష్(58) భవన నిర్మాణ కార్మికుడిగా పనిచేస్తున్నాడు. మంగళవారం మధ్యాహ్నం పని నిమిత్తం రామన్నపేట మండలం లక్ష్మాపురం గ్రామానికి వెళ్లాడు. రాత్రి అయినా ఇంటికి రాకపోవడంతో అతడి భార్య ఫోన్ చేయగా వస్తున్నానని చెప్పాడు. కానీ ఇంటికి చేరుకోలేదు. బుధవారం ఉదయం మార్నింగ్ వాకింగ్‌కు వెళ్లిన లక్ష్మాపురం గ్రామానికి చెందిన జోగుల నర్సింహ వంతెన కింద వ్యక్తి మృతదేహాన్ని గమనించాడు. బైక్‌పై ఉన్న ఫోన్ నంబర్ ఆధారంగా మృతుడి కుమారుడికి సమాచారం అందించాడు. వెంకటేష్ ప్రమాదవశాత్తు వంతెన పైనుంచి పడైనా లేదా ఏదైనా వాహనం ఢీకొట్టడం వల్ల గాని మృతిచెంది ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. మృతుడి కుమారుడు మహేష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ పి. మల్లయ్య తెలిపారు.

అనారోగ్య సమస్యలతో రైతు బలవన్మరణం
Comments
Please login to add a commentAdd a comment