వాటర్ ట్యాంకర్ టైరు పగిలి వృద్ధురాలికి గాయాలు
భువనగిరి టౌన్: వాటర్ ట్యాంకర్ టైరు పగిలి దాని నుంచి వేరుపడిన ఇనుప వస్తువు ఇంట్లో కూర్చొని ఉన్న వృద్ధురాలి కాలికి తాకడంతో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన బుధవారం భువనగిరి పట్టణంలో జరిగింది. బాధితురాలి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. భువనగిరి పట్టణంలోని అర్బన్ కాలనీకి చెందిన సత్యనారాయణరెడ్డి ఇటీవల మృతిచెందాడు. సత్యనారాయణరెడ్డి కుటుంబాన్ని పరామర్శించేందుకు అతడి సోదరి రామలక్ష్మి ములుగు జిల్లా వాజేడు మండలం జగన్నాథపురం గ్రామం నుంచి భువనగిరికి వచ్చింది. బుధవారం రామలక్ష్మి ఇంట్లో కూర్చొని ఉండగా.. నీటిని సరఫరా చేసే ప్రైవేట్ వాటర్ ట్యాంకర్ అటుగా వెళ్తుండగా దాని వెనుక టైరు పగిలింది. దీంతో టైరు నుంచి వేరుపడిన ఇనుప వస్తువు ఇంటి దర్వాజాను చీల్చుకొని లోపల మంచంపై కూర్చొని ఉన్న రామలక్ష్మికి వేగంగా తాకింది. దీంతో ఆమె కాలు విరగడంతో పాటు తీవ్ర గాయాలయ్యాయి. కుటుంబ సభ్యులు వెంటనే ఆమెను స్థానిక ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు తీసుకువెళ్లారు. వాటర్ ట్యాంకర్ ఫిట్‌నెస్ సరిగ్గా లేకపోవడంతోనే ప్రమాదం జరిగినట్లు స్థానికులు చర్చించుకుంటున్నారు. బాధితురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment