హాల్‌టికెట్‌పై క్యూఆర్‌ కోడ్‌ | - | Sakshi
Sakshi News home page

హాల్‌టికెట్‌పై క్యూఆర్‌ కోడ్‌

Published Fri, Feb 28 2025 1:21 AM | Last Updated on Fri, Feb 28 2025 1:21 AM

హాల్‌టికెట్‌పై క్యూఆర్‌ కోడ్‌

హాల్‌టికెట్‌పై క్యూఆర్‌ కోడ్‌

భువనగిరి : ఇంటర్‌ వార్షికపరీక్షలు రాయబోతున్నారా? పరీక్ష కేంద్రం అడ్రస్‌ తెలియకపోయినా, దారితప్పినా ఇబ్బంది పడవద్దు. సమస్యలు, సందేహాలు తీర్చేందుకు ఇంటర్‌బోర్డు క్యూఆర్‌కోడ్‌తో హాల్‌టికెట్లు జారీచేస్తోంది. క్యూఆర్‌ కోడ్‌ను స్కాన్‌చేయగానే పరీక్ష కేంద్రం అడ్రస్‌, మీరు ఉన్న ప్రాంతం నుంచి సెంటర్‌ ఎంత దూరం ఉంది.. ఎన్ని నిమిషాల్లో చేరుకోగలరో కూడా తెలిసిపోతోంది.

తొలిసారి నూతన విధానం

విద్యార్థుల కోసం ఇంటర్‌బోర్డు ఈ విద్యా సంవత్సరం పలు సంస్కరణలకు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా ఈ నెల 22వ తేదీ వరకు జరిగిన ప్రాక్టికల్‌ పరీక్షలను మొదటిసారిగా సీసీ కెమెరాల నిఘాలో నిర్వహించింది. తాజాగా మార్చి 5వ తేదీ నుంచి ప్రారంభంకానున్న వార్షిక పరీక్షల కోసం నూతన విధానం అమలు చేస్తోంది. హాల్‌టికెట్‌ను ఆన్‌లైన్‌లో డౌన్‌లోడ్‌ చేసుకోవాలని విద్యార్థుల సెల్‌ నంబర్లకు మెసేజ్‌లు పంపడం, పరీక్ష కేంద్రాల వివరాలను తెలుసుకునేందుకు క్యూఆర్‌ కోడ్‌, పరీక్షలకు సంబంధించిన సమస్యలు, సందేహాలు నివృత్తి చేసుకునేందుకు హాల్‌ టికెట్‌పై టోల్‌ ఫ్రీ, కంట్రోల్‌ రూం నంబర్‌ ఏర్పాటు చేశారు. నూతన విధానం వల్ల విద్యార్థులు కేంద్రాల అడ్రస్‌, హాల్‌టికెట్‌ విషయంలో ఇబ్బందులు పడవల్సిన పరిస్థితి ఉండదు.

12 వేల మంది విద్యార్థులు

జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలల్లో జనరల్‌, ఒకేషనల్‌ కోర్సుల్లో 12,371 మంది విద్యార్థులు ఉన్నారు. ఇందులో ప్రథమ సంవత్సరం 6,244. ద్వితీయ సంవత్సరం విద్యార్థులు 6,127 మంది ఉన్నారు. వీరంతా మార్చి 5నుంచి 22వ తేదీ వరకు జరిగే పరీక్షలకు హాజరుకానున్నారు.

పరీక్ష కేంద్రం అడ్రస్‌ సులువుగా తెలుసుకోవచ్చు

విద్యార్థుల సౌలభ్యం కోసం ఇంటర్‌బోర్డు తొలిసారిగా క్యూఆర్‌ కోడ్‌తో హాల్‌టికెట్‌లు జారీ చేస్తుంది. క్యూఆర్‌ కోడ్‌తో పాటు టోల్‌ ఫ్రీనంబర్‌, జిల్లా కంట్రోల్‌ రూం నంబర్‌ ఉంటుంది. విద్యార్థులకు ఎలాంటి సమస్య, సందేహాలు ఉన్నా కంట్రోల్‌ రూం నంబర్‌ను సంప్రదించాలి. విద్యార్థులు పరీక్ష కేంద్రం అడ్రస్‌ సులువుగా తెలుసుకుని, సమయానికి పరీక్షకు హాజరయ్యేందుకు క్యూఆర్‌ కోడ్‌ దోహదపడుతుంది.

–రమణి, డీఐఈఓ

విద్యార్థుల సౌలభ్యం కోసం ఇంటర్‌బోర్డు నూతన విధానం

ఫ పరీక్ష కేంద్రం అడ్రస్‌, దూరం, ఇతర వివరాలు క్యూఆర్‌ కోడ్‌లో నిక్షిప్తం

ఫ హాల్‌టికెట్‌పై టోల్‌ ఫ్రీ, కంట్రోల్‌ రూం నంబర్లు

ఫ విద్యార్థులకు తప్పనున్న ఇబ్బందులు

ఫ మార్చి 5 నుంచి వార్షిక పరీక్షలు

కంట్రోల్‌ రూం నంబర్‌: 98664 64361

టోల్‌ ఫ్రీ నంబర్‌: 914024 600110

మరికొన్ని ఉపయోగాలు..

హాల్‌ టికెట్‌పై ఉన్న క్యూఆర్‌ కోడ్‌ను స్కాన్‌ చేస్తే రూట్‌మ్యాప్‌ ఆధారంగా సులువుగా విద్యార్థులు పరీక్ష కేంద్రాలకు చేరుకోవచ్చు. అదే విధంగా గత కొన్నేళ్లుగా హాల్‌ టికెట్‌ను ఆన్‌లైన్‌లో డౌన్‌లోడ్‌ చేసుకునే సదుపాయం ఇంటర్‌బోర్డు కల్పించింది. కానీ, డౌన్‌లోడ్‌ చేసుకునే విధానంపై సరైన అవగాహన లేకపోవడతో విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. ఇకనుంచి ఆ సమస్య ఉండదు. హాల్‌ టికెట్‌ డౌన్‌లోడ్‌ అయ్యే తేదీ, హాల్‌ టికెట్‌ నంబర్లు విద్యార్థుల సెల్‌ఫోన్‌కు మెసేజ్‌ రూపంలో రానున్నాయి. దీంతో విద్యార్థులు సులువుగా హాల్‌టికెట్‌ పోందే అవకాశం ఏర్పడింది. నూతన విధానం ప్రభుత్వంతో పాటు ప్రైవేటు కళాశాలల విద్యార్థులకు వర్తించనుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement