
కంప్యూటర్ పరిజ్ఞానం తప్పనిసరి : డీఈఓ
చౌటుప్పల్ : కంప్యూటర్ పరిజ్ఞానం మనిషి జీవితంలో తప్పనిసరి అవసరంగా మారిపోయిందని, దానిపై ప్రతి ఒక్కరికీ అవగాహన ఉండాలని డీఈఓ సత్యనారాయణ సూచించారు. చౌటుప్పల్ పట్టణంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు హైదరాబాద్‌లోని కొండాపూర్‌కు చెందిన ఐడీబీఐ బ్యాంకు సమకూర్చిన కంప్యూటర్లను శుక్రవారం పాఠశాలకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దైనందిన జీవితంలో కంప్యూటర్ భాగమైందన్నారు. అదే విధంగా ఇంగ్లిష్ భాషపైనా ప్రావీ ణ్యం సంపాదించాలని విద్యార్థులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఐడీబీఐ బ్యాంకు మేనేజర్ స్పూర్తి, ప్రధానోపాధ్యాయుడు శివకుమార్, బ్యాంకు అధికారులు గీత, వేణు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
దరఖాస్తుల ఆహ్వానం
భువనగిరి టౌన్ : నెలసరి అద్దె చెల్లింపు ప్రాతిపదికన సొంతకారు కారు కలిగిన వ్యక్తులు దరఖాస్తు చేసుకోవాలని ఎస్సీ కార్పొరేషన్ ఈడీ శ్యాంసుందర్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. నెలకు 2, 500 కిలో మీటర్ల వరకు తిరగవలసి ఉంటుందని, నెలకు రూ.33,000 అద్దె చెల్లించనున్నట్లు పేర్కొన్నారు. ఆసక్తి కలిగినవారు ఈ నెల 10లోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
8న జాతీయ లోక్ అదాలత్
రామన్నపేట : మార్చి 8న జరిగే జాతీయ లోక్ అదాలత్‌ను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని రామన్నపేట సీనియర్ సివిల్ జడ్జి ఎస్.ఉషశ్రీ, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి శిరీష తెలిపారు. శుక్రవారం కోర్టు ఆవరణలో న్యాయవాదులు, పోలీసు అధికారులతో నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడారు. లోక్‌అదాలత్‌లో ఎక్కువ కేసులు పరిష్కారం అయ్యేలా చొరవ తీసుకోవాలని కోరారు. రాజీపడి కేసులను పరిష్కరించుకోవడం ద్వారా కలిగే ప్రయోజనాలను కక్షిదారులకు వివరించాలని కోరారు. అనంతరంపోలీస్‌స్టేషన్ల వారీగా రాజీకి అవకాశం ఉన్న కేసుల గురించి చర్చించారు. సమావేశంలో ఎస్‌ఐలు పి.మల్లయ్య, యుగేందర్, నాగరాజు న్యాయవాదులు ఎం. వెంకట్‌రెడ్డి, డి.సత్తయ్య, ఎన్.స్వామి తదితరులు పాల్గొన్నారు.
పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలి
యాదగిరిగుట్ట : రైతులు పండించిన పంటలకు కేంద్ర ప్రభుత్వం గిట్టుబాటు ధర కల్పించాలని సీపీఐ జిల్లా కార్యదర్శి గోద శ్రీరాములు డిమాండ్ చేశారు. శనివారం యాదగిరిగుట్ట మండలం ధర్మారెడ్డిగూడెం స్టేజీ వద్ద జరిగే అఖిలభారత తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం జిల్లా మహాసభల కరపత్రాలను యాదగిరిగుట్టలోని సీపీఐ కార్యాలయంలో శుక్రవారం పార్టీ నాయకులతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన వ్యవసాయ చట్టాలతో రైతులు తీవ్రంగా నష్టపోతారని, వాటిని రద్దు చేయాలన్నారు. మూసీ పునరుజ్జీవం, గంధమల్ల రిజర్వాయర్ నిర్మాణంపై రాష్ట్ర ప్రభుత్వం మాటకు కట్టుబడి ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీపీఐ, ఏఐటీయూసీ నాయకులు బండి జంగమ్మ, కల్లెపల్లి మహేందర్, పేరబోయిన మహేందర్, గోరేటి రాములు, పేరబోయిన బంగారు, గోపగాని రాజు, మాటూరు మల్లయ్య, పాకలపాటి రాజు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment