
21న భువనగిరి మీదుగా టూరిస్టు రైలు
భువనగిరి : జిల్లా కేంద్రం భువనగిరి మీదుగా ఈ నెల 21న భారత్ గౌరవ స్పెషల్ టూరిస్టు రైలు వెళ్తుందని సౌత్ సెంట్రల్ జోన్ టూరిజం జాయింట్ జనరల్ మేనేజర్ కిషోర్ సత్య శనివారం ఒక ప్రకటలో తెలిపారు. భువనగిరి స్టేషన్‌లో మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభమై జనగాం, కాజీపేట్, వరంగల్, ఖమ్మం మీదుగా విజయవాడుకు చేరుకుంటుందన్నారు. ప్యాకేజీ రూ.14,250తో ప్రారంభమై కేటగిరీని బట్టి అత్యధికంగా రూ.28,440 వరకు ఉంటుందన్నారు. భారత్ స్పెషల్ టూరిస్టు రైలు ద్వారా రామేశ్వరం, మధురై, కన్యాకుమారి, త్రివేండ్రం, శ్రీరంగం, తంజావూర్ ప్రదేశాలకు వెళ్లవచ్చన్నారు. ప్రతి కోచ్‌లో అన్ని సౌకర్యాలు ఉంటాయని, ఈ అవకాశాన్ని జిల్లావాసులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. మరిన్ని వివరాలకు 97013 60701, 92810 30711 నంబర్లను సంప్రదించాలని కోరారు.
టీఎన్జీఓ అధ్యక్ష,
కార్యదర్శుల నియామకం
భువనగిరి : వైద్యారోగ్యశాఖ టీఎన్జీఓ(తెలంగాణ నాన్ గెజిటెడ్ ఉద్యోగుల సంఘం) జిల్లా నూతన అధ్యక్ష, ప్రధాన కార్యదర్శుల నియామకం జరిగింది. హైదరాబాద్‌లో డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ సమావేశ మందిరంలో శనివారం ఏర్పాటు చేసిన తెలంగాణ వైద్యారోగ్యశాఖ ఉద్యోగుల ఫోరం సెంట్రల్ కమిటీ సమావేశంలో వారిని ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా కొనిరెడ్డి వెంకటరమణారెడ్డి, జనరల్ సెక్రటరీగా బోనగిరి సత్యనారాయణను నియమిస్తూ రాష్ట్ర అధ్యక్షుడు మానం జగదీశ్వర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా నూతన అధ్యక్షుడు, జనరల్ సెక్రటరీ మాట్లాడుతూ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తామన్నారు. తమ నియామకానికి సహకరించిన సంఘం పెద్దలకు కృతజ్ఞతలు తెలిపారు.
సూపరింటెండెంట్‌గా
చిన్నానాయక్
రామన్నపేట : రామన్నపేట ప్రభుత్వ ఆస్పత్రి సూపరింటెండెంట్‌గా జిల్లా ప్రభుత్వ ఆస్పత్రుల సమన్వయకర్త (డీసీహెచ్‌ఎస్) డాక్టర్ చిన్నానాయక్ అదనపు బాధ్యతలు చేపట్టారు. ఇప్పటి వరకు ఇక్కడ సూపరింటెండెంట్‌గా పనిచేసిన డాక్టర్ ఈశ్వర్ ఉన్నత చదువుల నిమిత్తం గాంధీ ఆస్పత్రికి వెళ్లారు. డాక్టర్ ఈశ్వర్‌ను వైద్యసిబ్బంది సన్మానించారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు కృషి చేస్తానని చిన్నానాయక్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వైద్యులు బి.వీరన్న, శ్రీనివాస్, విజయలక్ష్మి, మాధవాచారి పాల్గొన్నారు.
ఎన్‌హెచ్‌ఆర్‌సీ
జిల్లా చైర్మన్‌గా భిక్షపతి
మోత్కూరు : జాతీయ మానవ హక్కుల కమిటీ (ఎన్‌హెచ్‌ఆర్‌సీ) జిల్లా చైర్మన్‌గా మోత్కూరు మండలం దత్తప్పగూడేనికి చెందిన ముక్కెర్ల భిక్షపతి నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ మొగుళ్ల భద్రయ్య శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. అదే విధంగా జిల్లా ప్రధాన కార్యదర్శిగా అడ్డగూడూరుకు మందుల శ్రీకాంత్, అధికార ప్రతినిధిగా భువనగిరికి చెందిన బొల్లెద్దు ప్రవీణ్‌ను నియమించారు.
Comments
Please login to add a commentAdd a comment