స్కాన్‌ చేయ్‌.. మార్కులు వేయ్‌! | - | Sakshi
Sakshi News home page

స్కాన్‌ చేయ్‌.. మార్కులు వేయ్‌!

Published Mon, Mar 3 2025 1:13 AM | Last Updated on Mon, Mar 3 2025 1:13 AM

స్కాన్‌ చేయ్‌.. మార్కులు వేయ్‌!

స్కాన్‌ చేయ్‌.. మార్కులు వేయ్‌!

భువనగిరిటౌన్‌ : జిల్లాలో స్వచ్ఛ సర్వేక్షణ్‌ 2024–25 సర్వే మొదలైంది. స్వచ్ఛ భారత్‌ మిషన్‌, కేంద్ర పట్టణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఏటా మున్సిపాలిటీల్లో స్వచ్ఛ సర్వేక్షణ్‌ పేరుతో సర్వే నిర్వహిస్తారు. మున్సిపాలిటీలో పారిశుద్ధ్య నిర్వహణ చర్యలపై ప్రత్యేక బృందాలు సర్వే నిర్వహించి ప్రజాభిప్రాయ సేకరణ చేసేవి. కానీ, కేంద్ర పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఈసారి ప్రజాభిప్రాయ సేకరణను సులభతరం చేశారు.ఇందుకోసం ఆన్‌న్‌లైన్‌ విధానం తీసుకువచ్చింది.జిల్లావ్యాప్తంగా ఆరు మున్సిపాలిటీలకు క్యూ ఆర్‌ కోడ్‌లను జారీ చేసింది. క్యూఆర్‌ కోడ్‌ స్కాన్‌ చేసి తమ అభిప్రాయాలను తెలియజేయాల్సి ఉంటుంది. క్యూఆర్‌ కోడ్‌ద్వారా అభిప్రాయం తెలియజేసేందుకు మున్సిపల్‌ యంత్రాంగం వివిధ మాధ్యమాల ద్వారా ప్రచారం చేస్తోంది.

ఓటీపీ ద్వారా రిజిస్ట్రేషన్‌

నివాసికి పది ప్రశ్నలు ఉంటాయి. అన్ని ప్రశ్నలు శుభ్రతపై ఉంటాయి. అభిప్రాయాన్ని తెలియజేయడానికి ఎవరైనా క్యూ ఆర్‌ కోడ్‌ స్కాన్‌ చేయవచ్చు.అప్పుడు స్వచ్ఛ సర్వేక్షణ్‌ 2024 ప్రారంభించండి అని చెప్పే మొదటి పేజీ ద్వారా ఒకరు పలకరిస్తారు. నివాసి తర్వాత ఓటీపీ పంపబడే ఫోన్‌ నంబర్‌ అడుగుతారు. నమోదు చేసుకున్న తర్వాత రిజిస్ట్రేషన్‌ అవుతుంది. నివాసి ఇష్టపడే భాషను ఎంచుకుని కొనసాగించవచ్చు.

సర్వేలో అడిగే ప్రశ్నలు ఇవీ..

రాష్ట్రం, జిల్లా, తాము నివాసం ఉండే మున్సిపాలిటీని ఎంచుకోవాలి. మీరు ఈ పట్టణ సంస్థ, నగరంలో నివాసిగా ఉన్నారా.. లింగం, వయస్సు కూడా అడుగుతుంది. ఆపై ‘సర్వే ప్రారంభించు’ అని వస్తుంది. దానిపై క్లిక్‌ చేయాలి. పది ప్రశ్నలు అప్పుడు మొదలవుతాయి.

● రోజూ చెత్త సేకరణకు మీ ఇంటికి, దుకాణానికి పారిశుద్ధ్య సిబ్బంది వస్తున్నారా..

● మీ ప్రాంతాన్ని రోజూ ఊడ్చి పరిశుభ్రంగా ఉంచుతున్నారా

● మీ ప్రాంతానికి దగ్గర చెత్త కుప్పలు పేరుకుపోయాయా

● ఇంట్లోని చెత్తను తడి, పొడిగా వేరు చేసి బుట్టల్లో అందేస్తున్నారా

● స్వచ్ఛ ఆటో, ట్రాక్టర్‌ వారు తడి, పొడి చెత్తను వేర్వేరుగా సేకరిస్తున్నారా..

కలిపి తీసుకెళ్తున్నారా..

● మార్కెట్లు, బజార్లు, పార్కులు, ఉద్యానవనాలు, బహిరంగ ప్రదేశాల్లో పారిశుద్ధ్య నిర్వహణలో అధికారులు ఎంత ప్రభావవంతంగా ఉన్నారని మీరు అనుకుంటున్నారు

● మీ పట్టణంలో రెడ్యూస్‌, రీయూజ్‌, రీసైకిల్‌(ఆర్‌ఆర్‌ఆర్‌) చెత్త కేంద్రాల గురించి మీకు తెలుసా

● మున్సిపాలిటీ పరిధిలో మురుగు కాలువలు, సెప్టిక్‌ ట్యాంకులను శుభ్రం చేయడానికి లైసెన్స్‌ పొందిన ఆపరేటర్లను మాత్రమే నియమించుకోవాలని మీకు తెలుసా

● మీ ప్రాంతాల్లోని పబ్లిక్‌ టాయిలెట్ల శుభ్రత, నిర్వహణపై ఎంత వరకు సంతృప్తి చెందారు

● మీరు ఎప్పుడైనా పారిశుద్ధ్య సమస్యను స్థానిక అధికారులకు రిపోర్టు

చేశారా.. దాన్ని ఎలా పరిష్కరించారు

ప్రజలు సహకరించాలి

స్వచ్ఛ సర్వేక్షణ్‌లో భాగంగా మున్సిపాలిటీలు అందజేస్తున్న సేవలపై ప్రజలు ఆన్‌లైన్‌ ద్వారా సర్వేలో పాల్గొనాలి. పలు రకాల సేవలపై ప్రజలిచ్చిన అభిప్రాయాల ప్రకారం కేంద్ర ప్రభుత్వం జాతీయ స్థాయిలో మున్సిపాలిటీకి ర్యాంకులు కేటాయిస్తుంది. మున్సిపాలిటీల్లో ప్రజలంతా పాల్గొంటేనే ఈ విభాగంలో మంచి మార్కులొస్తాయి. క్యూఆర్‌ కోడ్‌ విధానం ద్వారా అభిప్రాయాన్ని తెలియజేసే విధానంపై అవగాహన కల్పిస్తున్నాం. ప్రతి ఒక్కరూ క్యూఆర్‌ కోడ్‌ను స్కాన్‌ చేసి అభిప్రాయం తెలియజేసి ఉత్తమ ర్యాంకు సాధనకు సహకరించాలి.

–రామలింగం,

భువనగిరి మున్సిపల్‌ కమిషనర్‌

మున్సిపాలిటీల్లో పరిశుభ్రతపై సర్వే

ఫ మార్కుల ఆధారంగా ర్యాంకు

ఫ ప్రజాభిప్రాయ సేకరణకు ఈసారి నూతన విధానం

ఫ అందుబాటులోకి క్యూ ఆర్‌ కోడ్‌

ఫ స్కాన్‌ చేసి అభిప్రాయం తెలియజేయాలని మున్సిపల్‌ యంత్రాంగం ప్రచారం

మొత్తం మార్కులు 12,500

ఓడీఎఫ్‌, మంచినీరు 1,200

గార్బేజ్‌ ఫ్రీ సిటీ 1,300

మిగిలిన అంశాలకు 10,000

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement