రెండో ‘సారి’ అంతే..
● ఒకసారి గెలిపించిన వారిని తిరిగి గెలిపించని ఓటర్లు
● విలక్షణ తీర్పు ఇస్తున్న ఉపాధ్యాయులు
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: వరంగల్–ఖమ్మం–నల్లగొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా ఒకసారి గెలిచిన అభ్యర్థి మరోసారి ఇక్కడ గెలిచిన దాఖలాలు లేవు. అంతేకాదు గత నాలుగు పర్యాయాయలుగా ఒకసారి గెలిచిన అభ్యర్థిని/సంఘాన్ని వరుసగా రెండోసారి ఉపాధ్యాయులు గెలిపించడం లేదు.
2007 నుంచి నలుగురు
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి 2007లో శాసనమండలిని పునరుద్ధరించారు. అప్పుడు మొదటిసారి నిర్వహించిన వరంగల్–ఖమ్మం–నల్లగొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో విద్యావేత్త చుక్కా రామయ్య యూటీఎఫ్ తరఫున విజయం సాధించారు. ఆ తర్వాత 2013లో రెండోసారి ఎన్నికలు జరిగాయి. అప్పుడు పీఆర్‌టీయూ–టీఎస్ తరఫున పోటీ చేసిన పూల రవీందర్ గెలుపొందారు. 2019లో జరిగిన ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో యూటీఎఫ్ అభ్యర్థి అలుగుబెల్లి నర్సిరెడ్డి గెలిచారు. ప్రస్తుతం నాలుగోసారి నిర్వహించిన ఎన్నికల కౌంటింగ్ సోమవారం జరిగింది. ఈ ఎన్నికల్లో పీఆర్‌టీయూ–టీఎస్ బలపరిచిన అభ్యర్థి పింగిలి శ్రీపాల్‌రెడ్డి విజయం సాధించారు. ఇలా నాలుగుసార్లు వేర్వేరు అభ్యర్థులు ఇక్కడ విజయం సాధించారు.
ఉపాధ్యాయులకు ఓటేయడం తెలియలే !
● ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో 494 చెల్లని ఓట్లు
నల్లగొండ: కొంతమంది ఉపాధ్యాయులు, అధ్యాపకులకు ఓటు వేయడం తెలియలేదు. వరంగల్–ఖమ్మం–నల్లగొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ గత నెల 27న జరిగింది. బ్యాలెట్ పద్ధతిన నిర్వహించిన ఈ ఎన్నికల్లో ప్రాధాన్యత క్రమం ప్రకారం ఓటు వేయాల్సి ఉంటుంది. 19 మంది పోటీలో ఉంటే 19 మందికి కూడా ప్రాధాన్యత క్రమంలో ఓటు వేయవచ్చు. కానీ ఈ ఎన్నికల్లో కొందరు ఉపాధ్యాయులు, అధ్యాపకులకు ఓటు వేయడం తెలియక వారు వేసిన ఓట్లు చెల్లలేదు. మొత్తం 24,135 ఓట్లు పోలైతే 494 మంది ఓట్లు చెల్లకపోవడం గమనార్హం. విద్యార్థులకు విద్యాబోధన చేసి ప్రయోజకులను చేయాల్సిన ఉపాధ్యాయులు.. వారి సమస్యల పరిష్కారం ఎమ్మెల్సీకి వేసే ఓటు ఏవిధంగా వేయాలో కూడా తెలియకపోవడం విడ్డూరంగా ఉందని పలువురు పేర్కొంటున్నారు.
బ్యాలెట్ బాక్సుల్లో కవిత్వం
నల్లగొండ: ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు సందర్భంగా పలు చిత్ర విచిత్రాలు చోటు చేసుకున్నాయి. కొందరు బ్యాలెట్ పేపర్‌పై కవితలు రాయగా.. మరి కొందరు ఓటు వేసి పేపర్ మొత్తాన్ని కోట్టేశారు. బ్యాలెట్ పేపర్‌తోపాటు కవిత్వాన్ని కూడా బాక్సులో వేశారు. మరికొందరైతే అభ్యర్థుల ఫొటోలకు రౌండ్లు పెట్టారు. ఇలా బ్యాలెట్ బాక్సులో చిత్ర విచిత్రాలు వెలుగు చూశాయి.
‘ఏక్’ నిరంజన్!
● ఆ అభ్యర్థికి కేవలం ఒక్కటే ఓటు పడింది
నల్లగొండ: వరంగల్–ఖమ్మం–నల్లగొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓ అభ్యర్థి ఒక్కటే ఓటు సాధించాడు. ఈ ఎన్నికల్లో మొత్తం 19 మంది అభ్యర్థులు పోటీ చేయగా అందులో ముగ్గురు సింగిల్ డిజిట్ ఓట్లకే పరిమితం కాగా.. మరో ఆరుగురు డబుల్ డిజిట్లతో సరిపెట్టుకున్నారు. ఆ సింగిల్ డిజిట్ ఓట్లలో ఒక అభ్యర్థికి ఒకే ఒక్క ఓటు వచ్చింది. నామినేషన్ దాఖలు సమయంలో అభ్యర్థిని పది మంది ఉపాధ్యాయులు బలపరచాలి. అయితే, బలపర్చిన వారు సైతం ఆ అభ్యర్థికి ఓటు వేయకపోవడం గమనార్హం.
పీఆర్‌టీయూలో శ్రీపాల్‌రెడ్డి ప్రస్థానం ఇదీ..
విద్యారణ్యపురి(వరంగల్) : ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా విజయం సాధించిన పింగిలి శ్రీపాల్‌రెడ్డిది ప్రస్తుత మహబూబాబాద్ జిల్లా గూడూరు గ్రామం. శ్రీపాల్‌రెడ్డి 1996లో ఎస్‌జీటీగా నెక్కొండ మండలం గొల్లిపెల్లి యూపీఎస్‌లో పనిచేశారు. 2003 సంవత్సరంలో స్కూల్‌అసిస్టెంట్ (మ్యాథ్స్)గా నెక్కొండ మండలం అప్పల్‌రావుపేటలో యూపీఎస్‌లో చేరారు. ప్రస్తుతం వరంగల్ జిల్లా గీసుకొండ మండలం శాయంపేట జెడ్పీహెచ్‌ఎస్‌లో పనిచేస్తున్నారు. ఆయనకు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. పీఆర్‌టీయూలో సభ్యుడిగా చేరిన పింగిలి శ్రీపాల్‌రెడ్డి 2000 సంవత్సరంలో నెక్కొండ మండల జనరల్ సెక్రటరీగా ఆ తరువాత 2002లో నెక్కొండ మండల అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తించారు. 2008 నుంచి 2012వరకు ఉమ్మడి వరంగల్ జిల్లా జనరల్ సెక్రటరీగా, 2015లో ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షుడిగా పనిచేశారు. 2016, 2017లో వరంగల్ రూరల్ జిల్లా అధ్యక్షుడిగా పనిచేశారు. 2019లో పీఆర్‌టీయూ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. రెండోసారి ఎన్నికయ్యాక ఇప్పటివరకు కొనసాగుతున్నారు.
తొమ్మిది సంవత్సరాల సర్వీస్ ఉండగానే..
పీఆర్‌టీయూ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉంటూ ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం కృషిచేస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో శ్రీపాల్‌రెడ్డి కొంతకాలం క్రితమే ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా ఎన్నికల బరిలో ఉండేందుకు పావులు కదిపారు. తొమ్మిది సంవత్సరాల సర్వీస్‌ను వదులుకొని చివరికి పీఆర్‌టీయూ మద్దతుతో ఎన్నికల బరిలో నిలిచి ఉత్కంఠ పోరులో విజయం సాధించారు. ఆరేళ్ల తరువాత మళ్లీ పీఆర్‌టీయూ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాన్ని గెలుచుకుంది.
పేరు ఓట్లు
పులి సరోత్తంరెడ్డి 2,289
లింగిడి వెంకటేశ్వర్లు 15
అర్వ స్వాతి 19
అలుగుబెల్లి నర్సిరెడ్డి 4,820
కంటె సాయన్న 4
కొలిపాక వెంకటస్వామి 421
గాల్‌రెడ్డి హర్షవర్ధన్‌రెడ్డి 4,437
గోపాల్‌రెడ్డి పన్నాల 24
చంద్రమోహన్ ఏలె 100
చాలిక చంద్రశేఖర్ 1
జంగిటి కై లాసం 26
జె.శంకర్ 113
పురుషోత్తంరెడ్డి తలకోల 11
తాటికొండ వెంకటరాజయ్య 36
దామెర బాబురావు 128
శ్రీపాల్‌రెడ్డి పింగిలి 6,035
పూల రవీందర్ 3,115
బంకరాజు 7
ఎస్.సుందర్‌రాజు 2,040
Comments
Please login to add a commentAdd a comment