
వేధింపులు తాళలేక బాలిక ఆత్మహత్య
మోత్కూరు: ప్రేమించిన యువకుడి వేధింపులు తాళలేక బాలిక ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన మోత్కూరు మండల కేంద్రంలో సోమవారం వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఏపీలోని విజయవాడకు చెందిన బాలిక ఇంటర్మీడియట్ ఫస్టియర్ చదువుతోంది. ఆమెకు సోషల్ మీడియా ద్వారా మోత్కూరుకు చెందిన కందుకూరి మున్నాతో పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం కాస్త ప్రేమగా మారింది. డిసెంబర్ 30వ తేదీన సదరు బాలిక కాలేజీకి వెళ్తున్నానని తల్లిదండ్రులకు చెప్పి మోత్కూరుకు చేరుకుంది. అప్పటి నుంచి ఓ ఇంటిని అద్దెకు తీసుకొని ఆ బాలిక, మున్నా సహజీవనం చేస్తున్నారు. బాలిక ఫోన్‌లో తన తల్లితో అప్పుడప్పుడు మాట్లాడుతూ తాను బాగానే ఉన్నానని, తాను మున్నా అనే యువకుడిని ప్రేమిస్తున్నానని, అతడిని వివాహం చేసుకునేందుకు వచ్చానని తెలియజేసేది. కానీ తాను ఉంటున్న చిరునామాను మాత్రం తల్లిదండ్రులకు వెల్లడించలేదు. ఆదివారం ఉదయం 10.30 గంటల ప్రాంతంలో సదరు బాలిక తన తల్లికి వీడియో కాల్ చేసి రూ.15వేలు కావాలని ఏడుస్తూ అడిగింది. ఎందుకమ్మా అని కూతురుని తల్లి ప్రశ్నించగా.. ‘మీ అమ్మ దగ్గర డబ్బులు తీసుకురావాలని మున్నా తనను కొట్టాడని తల్లికి వివరించింది’. ఈ క్రమంలో అదే రోజు రాత్రి 8గంటల సమయంలో తాము అద్దెకు ఉంటున్న ఇంట్లో సీలింగ్ ఫ్యాన్‌కు చున్నీతో ఉరేసుకుని బాలిక ఆత్మహత్య చేసుకుంది. తనను మున్నా వేధిస్తున్న విషయాలన్నీ బాలిక సూసైడ్ నోట్‌లో పేర్కొంది. మృతురాలి తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ డి. నాగరాజు తెలిపారు. మున్నా అనే యువకుడు తన కుమార్తెను ఆత్మహత్య చేసుకునేలా ప్రేరేపించాడని, ప్రేమ పేరుతో మోసం చేసి డబ్బుల కోసం తీవ్రంగా కొట్టి అఘాయిత్యానికి పాల్పడ్డాడని బాలిక తల్లిదండ్రులు ఆరోపించారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. మృతదేహానికి పంచనామా నిర్వహించి పోస్టుమార్టం నిమిత్తం రామన్నపేట ప్రభుత్వ ఆస్పత్రికి పోలీసులు తరలించారు.
వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరికి గాయాలు
చౌటుప్పల్: విజయవాడ–హైదరాబాద్ జాతీయ రహదారిపై చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధి లింగోజిగూడెం గ్రామ శివారులో ఆదివారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో లారీ డ్రైవర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. సీఐ మన్మథకుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. చిట్యాల మండలం బోయగుబ్బ గ్రామానికి చెందిన చీకూరు అనిల్‌కుమార్ లారీ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. భద్రాచలం నుంచి పేపర్ లోడ్‌తో హైదరాబాద్‌కు బయల్దేరాడు. మార్గమధ్యలో ఆదివారం అర్ధరాత్రి చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని లింగోజిగూడెం గ్రామ శివారులో గల వంశీ రబ్బర్ కంపెనీ వద్ద హైవేపై ఆగి ఉన్న లారీని వెనుక నుంచి ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన అనిల్‌కుమార్‌ను చికిత్స నిమిత్తం సికింద్రాబాద్‌లోని గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు.
బైక్‌ను కారు ఢీకొట్టడంతో..
చివ్వెంల(సూర్యాపేట): అతివేగంగా వస్తున్న కారు అదుపుతప్పి బైక్‌ను ఢీకొట్టడంతో వ్యక్తికి గాయాలయ్యాయి. ఈ ఘటన చివ్వెంల మండలం వట్టిఖమ్మంపహాడ్ గ్రామ శివారులో సూర్యాపేట–ఖమ్మం రహదారిపై సోమవారం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్ నుంచి భద్రాద్రి కొత్తగూడెంకు బైక్‌పై వెళ్తున్న వ్యక్తిని అదే మార్గంలో ఖమ్మం పట్టణానికి వెళ్తున్న కారు వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్‌పై వెళ్తున్న వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుడిని స్థానికులు చికిత్స నిమిత్తం సూర్యాపేటకు తరలించారు. బాధితుడి వివరాలు తెలియాల్సి ఉంది. అతివేగమే ప్రమదానికి కారణమని తెలుస్తోంది.
రైలు కింద పడి వ్యక్తి మృతి
బీబీనగర్: బీబీనగర్ రైల్వే స్టేషన్ సమీపంలో రైలు కింద పడి గుర్తుతెలియని వ్యక్తి మృతిచెందాడు. భువనగిరి రైల్వే హెడ్‌కానిస్టేబుల్ కృష్ణారావు తెలిపిన వివరాల ప్రకారం.. బీబీనగర్ రైల్వే స్టేషన్ నుంచి పగిడిపల్లి వెళ్లే రైల్వే మార్గంలో సోమవారం తెల్లవారుజామున రైలు కింద పడి సుమారు 35 ఏళ్ల గుర్తుతెలియని వ్యక్తి మృతిచెందినట్లు రైల్వే పోలీసులకు సమాచారం అందింది. ఈ మేరకు ఘటనా స్థలానికి వెళ్లి మృతదేహాన్ని రైల్వే పోలీసులు పరిశీలించారు. మృతుడు నలుపు రంగు టీషర్టు, తెలుపు రంగు ప్యాంట్ ధరించి ఉన్నాడని రైల్వే హెడ్‌కానిస్టేబుల్ పేర్కొన్నారు. మృతదేహాన్ని భువనగిరి ఏరియా ఆస్పత్రికి తరలించినట్లు తెలిపారు. మృతుడి వివరాలు తెలిసిన వారు 9848222169, 8712568454 నంబర్లను సంప్రదించాల ని సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment