మొదటి ప్రాధాన్యతలో తేలని ఫలితం | - | Sakshi
Sakshi News home page

మొదటి ప్రాధాన్యతలో తేలని ఫలితం

Published Tue, Mar 4 2025 1:25 AM | Last Updated on Tue, Mar 4 2025 1:25 AM

-

సాక్షి ప్రతినిధి, నల్లగొండ : వరంగల్‌–ఖమ్మం–నల్లగొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపులో మొదటి ప్రాధాన్యత ఓట్లలో ఏ అభ్యర్థి కూడా గెలుపు కోటా సాధించలేకపోయారు. 25,797 ఓట్లకుగాను 24,135 ఓట్లు పోలయ్యాయి. అందులో 494 ఓట్లు చెల్లలేదు. 23,641 ఓట్లు చెల్లుబాటు అయ్యాయి. అందులో సగానికంటే ఒక ఓటు ఎక్కువగా పరిగణనలోకి తీసుకొని 11,821 ఓట్లను గెలుపు కోటా ఓటుగా నిర్ణయించారు. పోటీలో ఉన్న19 అభ్యర్థుల్లో ఎవరూ మొదటి ప్రాధాన్యతలో గెలుపు కోటా ఓట్లను సాధించలేకపోయారు. మొదటి ప్రాధాన్యత ఓట్లలో ప్రధాన అభ్యర్థులైన పింగిళి శ్రీపాల్‌రెడ్డికి 6,035 ఓట్లు రాగా, అలుగుబెల్లి నర్సిరెడ్డికి 4,820 ఓట్లు, గాల్‌రెడ్డి హర్షవర్ధన్‌రెడ్డికి 4,437 ఓట్లు రాగా, బీసీ సంఘాలు, ఎస్టీయూ బలపరిచిన పూల రవీందర్‌కు 3,115 ఓట్లు, టీపీయూఎస్‌ బలపరిచిన బీజేపీ అభ్యర్థి పులి సరోత్తంరెడ్డికి 2,289 ఓట్లు, ప్రైవేట్‌ విద్యా సంస్థల యజమాని ఎస్‌.సుందర్‌రాజు 2,040 ఓట్లు లభించాయి. మిగిలిన అభ్యర్థులకు ఒక్క ఓటు మొదలుకొని వేయిలోపే ఓట్లు రావడం గమనార్హం.

మధ్యాహ్నం తరువాత ఎలిమినేషన్‌ ప్రక్రియ

మొదటి ప్రాధాన్యతలో ఎవరికి గెలుపు కోటా ఓట్లు రాకపోవడంతో సోమవారం మధ్యాహ్నం రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు ప్రారంభించారు. 3.30 గంటల సమయంలో ఎలిమినేషన్‌ ప్రక్రియ ప్రారంభించారు. 19 మందిలో అతి తక్కువగా ఓట్లు వచ్చిన అభ్యర్థిని ఎలిమినేట్‌ చేసి ఆ అభ్యర్థికి వచ్చిన ఓట్లలో రెండో ప్రాధాన్యత ఓట్లను లెక్కించారు. రాత్రి 7 గంటల వరకు 14 మంది ఎలిమినేషన్‌ తరువాత 15వ రౌండ్‌ ఫలితాలను అధికారులు ప్రకటించారు. అప్పటి వరకు ఎవరికీ కోటా ఓట్లు రాలేదు. దీంతో ఎలిమినేషన్‌ ప్రక్రియతో కౌంటింగ్‌ కొనసాగించారు. ఇలా రాత్రి 11 గంటల వరకు కౌంటింగ్‌ కొనసాగింది. చివరకు పీఆర్‌టీయూటీ–టీఎస్‌ బలపరచిన అభ్యర్థి పింగిళి శ్రీపాల్‌రెడ్డి విజయం సాధించారు. శ్రీపాల్‌రెడ్డి తన సమీప ప్రత్యర్థి నర్సిరెడ్డిపై 5,521 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.

గెలుపు కోటాగా 11,821 ఓట్లు

మధ్యాహ్నం తర్వాత రెండో ప్రాధాన్యత

ఓట్ల లెక్కింపు

5,521 ఓట్ల మెజార్టీతో గెలుపొందిన

శ్రీపాల్‌రెడ్డి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement