
అనుమానంతో భార్యను కొట్టిన భర్త
● ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి
తిప్పర్తి: భార్యపై అనుమానంతో భర్త ఆమెను తీవ్రంగా కొట్టాడు. దీంతో ఆమె చికిత్స పొందుతూ మృతిచెందింది. ఈ ఘటన తిప్పర్తి మండలం సర్వా రం గ్రామంలో సోమవారం జరిగింది. ఎస్‌ఐ సాయిప్రశాంత్ తెలిపిన వివరాల ప్రకారం.. సర్వారం గ్రామానికి చెందిన బండారి మహేశ్వరీ(23) కేతేపల్లి మండలం బండకిందిగూడెం గ్రామానికి చెందిన బండారి శ్రీకాంత్‌ను ఐదేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకుంది. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. కొంతకాలం నుంచి మహేశ్వరీపై అనుమానం పెంచుకున్న శ్రీకాంత్ ఆమెను వేధింపులకు గురిచేస్తున్నాడు. పెద్దమనుషుల సమక్షంలో పంచాయితీ పెట్టి సర్దిచెప్పడంతో ఏడాది క్రితం వారి కాపురాన్ని సర్వారం గ్రామానికి మార్చారు. అయినప్పటికీ శ్రీకాంత్‌లో ఎలాంటి మార్పురాలేదు. శనివారం శ్రీకాంత్ మహేశ్వరీతో గొడవపడి ఆమె తీవ్రంగా కొట్టాడు. ఇరుగుపొరుగు వారు గమనించి ఆమెను చికిత్స నిమిత్తం నల్లగొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో కుటుంబ సభ్యులు నల్లగొండలోనే ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లగా.. చికిత్స పొందుతూ సోమవారం మృతిచెందింది. మృతురాలి తల్లి మైనం లింగమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.
ఆర్థిక ఇబ్బందులతో
మహిళ ఆత్మహత్య
చింతపల్లి: ఆర్థిక ఇబ్బందులతో ఉరేసుకుని మహిళ ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన చింతపల్లి మండల పరిధిలోని మాల్ వెంకటేశ్వర్‌నగర్‌లో సోమవారం జరిగింది. స్థానికులు, బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. మర్రిగూడెం మండలం అజ్మాపురం గ్రామానికి చెందిన బాణాల స్వాతి(38) కుటుంబంతో కలిసి చింతపల్లి మండలం మాల్ వెంకటేశ్వర్‌నగర్‌లో నివాసం ఉంటోంది. గత కొన్ని రోజులుగా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో సోమవారం మధ్యాహ్నం ఇంట్లో ఎవరూ లేని సమయంలో స్వాతి ఫ్యానుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. చుట్టుపక్కల వారు గమనించి మాల్‌లోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా అప్పటికే ఆమె మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ ఘటనపై ఎలాంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు.
తాటిచెట్టు పైనుంచి పడి గీత కార్మికుడికి గాయాలు
ఆత్మకూర్(ఎస్): తాటిచెట్టు పైనుంచి పడి గీత కార్మికుడికి తీవ్రగాయాలయ్యాయి. ఈ ఘటన ఆత్మకూర్(ఎస్) మండలం పాతర్లపహాడ్ గ్రామంలో సోమవారం సాయంత్రం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. పాతర్లపహాడ్ గ్రామానికి చెందిన గీత కార్మికుడు బత్తుల రమేష్ రోజుమాదిరిగా సోమవారం సాయంత్రం గ్రామ పరిధిలో తాటిచెట్టు ఎక్కుతుండగా మోకు జారి కిందపడిపోయాడు. తీవ్రంగా గాయపడిన అతడిని స్థానికులు చికిత్స నిమిత్తం సూర్యాపేట ఏరియా ఆస్పత్రికి తరలించారు. రమేష్‌ను గీత కార్మిక సంఘం సూర్యాపేట జిల్లా ప్రధాన కార్యదర్శి మడ్డి అంజిబాబు తదితరులు ఆస్పత్రిలో పరామర్శించారు.
Comments
Please login to add a commentAdd a comment