
ధాన్యం కొనే దిక్కేది?
కొనుగోలు కేంద్రాల ఏర్పాటులో జాప్యం
మోటకొండూరుకు చెందిన రైతు ఎగ్గిడి రాజు ఐదు ఎకరాల్లో వరి సాగు చేశాడు.
అందులో మూడు ఎకరాలు కోయగా 122 బస్తాల దిగుబడి వచ్చింది. స్థానికంగా కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించకపోవడం, సీరియల్ ప్రకారం అమ్మాలంటే ఆలస్యం అవుతుండడం, మరోవైపు వాతావరణం భయపెడుతుండడంతో ప్రైవేట్ వ్యాపారికి క్వింటా రూ.1880 చొప్పున విక్రయించాడు. కాగా వ్యాపారి బస్తా ధాన్యం 66 కిలోలు కాంటా వేసి 64 కిలోలకే లెక్కకట్టించాడు. బస్తా బరువు కిలో, తరుగు కింద కిలో కట్ చేశాడని, హమాలీ చార్జీ వందకు రెండు రూపాయల చొప్పున కట్ చేసి మిగతా డబ్బులు చెల్లించాడని రైతు వాపోయాడు.
సాక్షి,యాదాద్రి : కొనుగోలు కేంద్రాల ఏర్పాటులో జాప్యం.. అకాల వర్షాలు అన్నదాతను ఆందోళనకు గురి చేస్తున్నాయి. పంట చేతికొచ్చి రోజులు గడుస్తున్నా కొనే దిక్కులేక కర్షకులు ప్రైవేట్ వ్యాపారుల వైపు చూస్తున్నారు. జిల్లాలో వరికోతలు మొదలై పక్షం రోజులు గడిచినా కొనుగోలు కేంద్రాల ఏర్పా టు కొలిక్కి రావడం లేదు. గుండాల, అడ్డగూడూరు, ఆత్మకూర్(ఎం) మండలాల్లోనే 12 కేంద్రాలను ప్రారంభించారు.
లక్ష్యం 4.50లక్షల మెట్రిక్ టన్నులు
యాసంగిలో జిల్లా వ్యాప్తంగా 2,75,315 ఎకరాల్లో వరి సాగైంది. సుమారు 6 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తుందని వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేశారు. అందులో 4.50లక్ష మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించాలని లక్ష్యంగా నిర్దేశించారు. అందుకు అనుగుణంగా 372 కోనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈనెల మొదటి వారంలోనే కేంద్రాలన్నీ తెరుస్తామని అధికారులు ప్రకటించారు. కానీ కేవలం 12 చోట్ల మాత్రమే ప్రారంభించారు. ఇక్కడ కూడా ధాన్యం కాంటా వేయడం లేదు. ఓ వైపు కొనుగోళ్లు ప్రారంభించకపోవడం, మరోవైపు అకాల వర్షాలు భయంతో రైతులకు మరోదారి లేక ప్రైవేట్ వ్యాపారులకు అమ్ముకుంటున్నారు.ఇదే అదనుగా వ్యాపారులు ధర తగ్గిస్తున్నారు. ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర ఏ గ్రేడ్ క్వింటా రూ.2,320 ఉండగా రూ.1,800 నుంచి రూ.2,000 వరకు చెల్లిస్తున్నారు. అంతేకాకుండా 5 కిలోల వరకు తరుగు తీస్తున్నారు. అయినా ఎదురుచూడలేక వ్యాపారులకు అమ్ముకోవడానికి రైతులకు మొగ్గు చూపుతున్నారు.
తూకంలోనూ మోసం
గుండాల, అడ్డగూడూరు, ఆలేరు, మోత్కూరు, మోటకొండూరు. అత్మకూర్(ఎం), వలిగొండ, భువనగిరి, యాదగిరిగుట్ట మండలాల్లో ముందుగానే వరి కోతలు మొదలయ్యాయి. కొనుగోలు కేంద్రాలు ప్రారంభం కాకపోవడంతో ప్రైవేట్ వ్యాపారులు నేరుగా కళ్లాల వద్దకు వెళ్లి ధాన్యం కొనుగోలు చేస్తున్నారు. ఎలక్ట్రానిక్ కాంటాలకు బదులు తూకం కాంటాలు వేస్తూ రైతులను మోసం చేస్తున్నారు. అయినా మార్కెటింగ్, సివిల్‌సప్‌లై, తూనికలు కొలతల అధికారులు అటువైపు కన్నెత్తి చూడడం లేదు.
వరి సాగు 2,75,315 ఎకరాలు
దిగుబడి అంచనా 6.05 లక్షల మెట్రిక్ టన్నులు
సేకరణ లక్ష్యం 4.50 లక్షల మెట్రిక్ టన్నులు
ఫ కేవలం 12 చోట్లనే ప్రారంభం
ఫ ఎదురుచూడలేక ప్రైవేట్‌కు ధాన్యంఅమ్ముకుంటున్న రైతులు
ఫ అదునుగా తీసుకుని ధర తగ్గిస్తున్న వ్యాపారులు
ఫ క్వింటా రూ.1,880 నుంచి రూ.1,950 వరకు చెల్లింపు
ప్రారంభించినవి 12
కొనుగోలు కేంద్రాలు 372
క్వింటా రూ.1,850కే అమ్మిన
ఎకరం 20 గుంటల్లో వరి సాగు చేయగా 40 బస్తాల దిగుబడి వచ్చింది. పెద్ద కందుకూరుకు చెందిన వ్యాపారికి క్వింటా రూ.1,850 చొప్పున విక్రయించగా బస్తాకు రెండు కిలోల చొప్పున తరుగు తీశాడు. కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయకపోవడం వల్ల తక్కువ ధరకు విక్రయించాల్సి వచ్చింది.
–గాజుల శ్రీనివాస్, మహబూబ్‌పేట

ధాన్యం కొనే దిక్కేది?

ధాన్యం కొనే దిక్కేది?