
వైభవంగా శ్రీరాముడి పట్టాభిషేకం
యాదగిరిగుట్ట: యాదగిరి లక్ష్మీనరసింహస్వామి క్షేత్రానికి అనుబంధంగా కొనసాగుతున్న శ్రీపర్వతవర్థిని సమేత రామలింగేశ్వరస్వామి ఆలయంలో శ్రీరామనవమి వేడుకలు వైభవంగా కొనసాగుతున్నాయి. సోమవారం ఉదయం శివాలయంలో నిత్యారాధనలు నిర్వహించిన అర్చకులు మూలమంత్ర జపములు, దశ శాంతి పంచసూక్త పారాయణములతో అభిషేకములు, ఆధ్యాత్మిక రామాయణ పారాయణం, అష్టోత్తర శతనామార్చనలు జరిపించారు. అనంతరం శ్రీసీతారామచంద్రస్వామికి పట్టాభిషేకం వేడుకను ఆలయ సిద్దాంతి, ప్రధానార్చకులు చేపట్టారు. సాయంత్రం నిత్యారాధనలు జరిపించిన అనంతరం రాత్రి 7గంటల నుంచి 8.30గంటల వరకు శివాలయ యాగ మండపంలో సహస్రనామార్చనలు, నివేదన, నీరాజన, మంత్ర పుష్పములు, కార్యక్రమాలు జరిగాయి. ఆయా వేడుకల్లో ఆలయ అనువంశిక ధర్మకర్త బి. నర్సింహమూర్తి, పూజారులు, భక్తులు పాల్గొన్నారు.