
రూ.4లక్షల యూనిట్లకు డిమాండ్!
సాక్షి, యాదాద్రి : రాజీవ్ యువ వికాసం పథకానికి దరఖాస్తులు వెల్లువెత్తుతున్నాయి. బుధవారం నాటికి 25,262 దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు తెలిపారు. దరఖాస్తు గడువు మరో ఐదు రోజులు ఉన్నందున 30 వేలు మించే అవకాశం ఉందని భావిస్తున్నారు. కాగా దరఖాస్తుల్లో అధికంగా రూ.2లక్షల నుంచి రూ.4లక్షల వరకు విలువ చేసే యూనిట్‌లకు సంబంధించినవే ఉండడం గమనార్హం. తక్కువ విలువ కలిగిన యూనిట్లకు వంద శాతం సబ్సిడీ ఉన్నప్పటికీ యువత పెద్దగా ఆసక్తి చూపడంలేదు.
ఎస్సీ కార్పొరేషన్‌కు వచ్చిన దరఖాస్తులు ఇలా..
ఎస్సీ కార్పొరేషన్ ద్వారా వివిధ యూనిట్‌ల కోసం మొత్తం 6,571 దరఖాస్తులు వచ్చాయి. ఇందులో రూ.లక్ష లోపు విలువ చేసే యూనిట్‌లు 1,007 ఉన్నాయి. వీటికి వంద శాతం సబ్సిడీ ఉన్నప్పటికీ కేవలం 34 దరఖాస్తులే వచ్చాయి. ఆలేరు, భూదాన్‌పోచంపల్లి, భువనగిరి, యాదగిరిగుట్ట మున్సిపాలిటీల్లో ఒక్క దరఖాస్తు రాలేదు. అలాగే ఆలేరు, భూదాన్‌పోచంపల్లి, బీబీనగర్, బొమ్మలరామారం, మోత్కూరు, సంస్థాన్‌నారాయణపురం, తుర్కపల్లి మండలాల్లోనూ ఒక్కరు కూడా దరఖాస్తు చేసుకోలేదు. ఇక రూ.2లక్షల వరకు విలువ చేసే యూనిట్‌లు 781 ఉండగా 411 మంది దరఖాస్తు చేసుకున్నారు. రూ.3 లక్షలకు సంబంధించి జిల్లాకు 496 యూనిట్‌లు కేటాయించగా 2,142, రూ.3నుంచి రూ.4 లక్షల వరకు 411 యూనిట్‌లు ఉండగా 2,967 దరఖాస్తులు వచ్చాయి. ఇక బ్యాంకు లింకేజీతో సంబంధం లేని మైనర్ ఇరిగేషన్‌లో బోర్లు, సోలార్, విద్యుత్ మోటార్ కనెక్షన్‌కు సంబంధించి 103 యూనిట్‌లకు గాను కేవలం ఐదు దరఖాస్తులే వచ్చాయి. ఎస్టీ, బీసీ, ఈబీసీ, మైనార్టీ, క్రిస్టియన్ మైనార్టీ కార్పొరేషన్లలోనూ ఎక్కువ మొత్తం విలువ చేసే యూనిట్‌లకే అధిక దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు చెబుతున్నారు.
రాజీవ్ యువ వికాసానికి భారీ స్పందన
ఫ 25,262 మంది దరఖాస్తు
ఫ ఎక్కువ విలువ చేసే యూనిట్లపైనే ఆసక్తి
ఫ రూ.లక్ష లోపు యూనిట్‌లకు
అంతంతమాత్రంగానే స్పందన
దళితబంధు లబ్ధిదారులకు నో చాన్స్
దళితబంధు లబ్ధిదారులు రాజీవ్ యువ వికాసం పథకానికి దరఖాస్తు చేసుకునేందుఅవకాశం లేదు. ప్రభుత్వం ద్వారా ఒకసారి లబ్ధిపొందిన తర్వాత మళ్లీ ఐదేళ్ల వరకు అనర్హులు. చాలా మంది దళితబంధు లబ్ధిదారులు మీసేవ కేంద్రాలకు వెళ్లి దరఖాస్తు చేసుకోగా రాజీవ్ యువ వికాసం పథకం సైట్‌లో అప్‌లోడ్ కావడం లేదు.
కార్పొరేషన్ల వారీగా
దరఖాస్తులు
ఎస్సీ 6,571
ఎస్టీ 1712
బీసీ 15,466
ఈబీసీ 451
మైనార్టీ 1,022
క్రిస్టియన్ మైనార్టీ 40
మొత్తం 25,262
హార్డు కాపీలు అందజేయాలి
రూ.లక్షలోపు విలువ చేసే యూనిట్‌లకు వంద శాతం సబ్సిడీ ఇస్తున్నప్పటికీ దరఖాస్తులు తక్కువగా వస్తున్నాయి. పెద్ద మొత్తంలో విలువ చేసే యూనిట్‌లకే డిమాండ్ ఎక్కువగా ఉంది. దరఖాస్తుదారులు మీసేవ కేంద్రాల్లో దరఖాస్తు చేసిన హార్డ్ కాపీలను అందజేయడం లేదు. పంచాయతీ కార్యదర్శులు, వార్డు అధికారులకు హార్డు కాపీలు తప్పనిసరిగా అప్పగించాలి. దరఖాస్తు గడువు ఈనెలో 14వరకు ఉంది. యువత సద్వినియోగం చేసుకోవాలి.
–జినుకల శ్యాంసుందర్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ