
ఏటీఎంను గ్యాస్‌కట్టర్‌తో కట్ చేసి నగదు చోరీ
చౌటుప్పల్ రూరల్: చౌటుప్పల్ మండలం అంకిరెడ్డిగూడెం గ్రామ స్టేజీ వద్ద ఉన్న ఎస్‌బీఐ ఏటీఎంను దొంగలు గ్యాస్ కట్టర్‌తో కట్ చేసి అందులో ఉన్న నగదును ఎత్తుకెళ్లారు. ఈ ఘటన బుధవారం తెల్లవారుజామున జరిగింది. అంకిరెడ్డిగూడెం ర్రామ స్టేజీ వద్ద దివీస్ పరిశ్రమ ఉండడంతో నల్లగొండ ఎస్‌బీఐ ఆధ్వర్యంలో ఏటీఎం ఏర్పాటు చేశారు. ఆ ఏటీఎంలో డబ్బులు నిల్వ చేయడం, దాని ఆపరేటింగ్ అంతా నల్లగొండలోని ఎస్‌బీఐ బ్రాంచ్ చూసుకుంటుంది. ఏటీఎం మానిటరింగ్‌ను ముంబైలోని బ్యాంకు ప్రధాన కార్యాలయం వారు చూస్తున్నారు. ఈ ఏటీఎంలో మంగళవారం సాయంత్రం సిబ్బంది నగదును నింపి వెళ్లారు. అయితే, బుధవారం తెల్లవారుజాము 5గంటల నుంచి సాయంత్రం వరకు ఈ ఏటీఎం నుంచి ఎలాంటి లావాదేవీలు జరగకపోవడాన్ని ముంబైలోని ప్రధాన కార్యాలయం వారు గుర్తించి.. చౌటుప్పల్ పోలీసులకు రాత్రి 7గంటలకు సమాచారం ఇచ్చారు. పోలీసులు అక్కడికి వెళ్లి చూడగా.. ఏటీఎం షెట్టర్ మూసివేసి ఉంది. షెట్టర్‌ను పైఎత్తి చూడగా గ్యాస్ కట్టర్‌తో కట్ చేసిన ఆనవాళ్లు కనిపించాయి. అందులో నగదు చోరీకి గురైందని నిర్ధారించుకొని నల్లగొండ ఎస్‌బీఐ బ్రాంచ్‌కి, పోలీసు ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు.
రూ.20లక్షలకు పైగా చోరీ?
ఆ ఏటీఎం నుంచి వినియోగదారుల చివరి లావాదేవీ బుధవారం తెల్లవారు జామున 4:25 గంటలకు జరిగింది. తర్వాత దుండగులు ఏటీఎంనుంచి నగదు ఎత్తుకెళ్లడంతో.. సుమారు రూ.20 లక్షలకు పైగా నగదు చోరీకి గురైనట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. బ్యాంకు అధికారులు ఎంత నగదు పోయిందన్న విషయాన్ని నిర్ధారించలేదు.
ఏటీఎంను పరిశీలించిన భువనగిరి డీసీపీ
చోరీ జరిగిన విషయం తెలుసుకున్న భువనగిరి డీసీపీ అక్షాంశ్‌యాదవ్, రాచకొండ క్రైం డీసీపీ అరవింద్ బాబు, చౌటుప్పల్ ఏసీపీ మధుసూదన్‌రెడి, సీఐ మన్మథకుమార్ ఘటన స్థలానికి చేరుకొని చుట్టుపక్కల సీపీ కెమెరాలను పరిశీలించారు. క్లూస్ టీంను రప్పించి ఆధారాలు సేకరించారు.
ఇదే ఏటీఎంలో మూడేళ్ల క్రితం చోరీకి యత్నం
గతంలో 2022లో ఇదే ఏటీఎంలో చోరీ చేయడానికి గుర్తుతెలియని దుండగులు ప్రయత్నించారు. అప్పుడు కూడా ఏటీఎంను పగులగొట్టి అందులో ఉన్న నగదును ఎత్తుకెళ్లడానికి ప్రయత్నించి విఫలమయ్యారు. అప్పట్లో ఈ ఘటనపై చౌటుప్పల్ పోలీసులు కేసు నమోదు చేశారు. కానీ ఇప్పటివరకు దుండగులను గుర్తించలేదు.