
కారు ఢీకొని మహిళ మృతి
మోటకొండూర్: రోడ్డు దాటుతున్న మహిళను కారుతో ఢీకొనడంతో మృతిచెందింది. ఈ ఘటన మోటకొండూర్ మండలం కొండాపురం గ్రామంలో బుధవారం రాత్రి జరిగింది. గురువారం ఎస్‌ఐ నాగుల ఉపేందర్ తెలిపిన వివరాల ప్రకారం.. కొండాపురం గ్రామానికి చెందిన గుడేటి నర్సమ్మ(60) బుధవారం రాత్రి గ్రామ పరిధిలో రోడ్డు దాటుతుండగా మోత్కూర్ నుంచి భువనగిరి వైపు కారులో అతివేగంగా వెళ్తున్న ఎర్గుంట సూరజ్ ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో గుడేటి నర్సమ్మ అక్కడికక్కడే మృతిచెందింది. మృతురాలి కుమారుడు గుడేటి యాదయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.
మృతురాలి బంధువుల రాస్తారోకో..
గుడేటి నర్సమ్మ కుటుంబానికి న్యాయం చేయాలని కొండాపురం గ్రామంలోని మోత్కూర్–రాయిగిరి రహదారిపై గురువారం సాయంత్రం మృతురాలి బంధువులు రాస్తారోకో నిర్వహించారు. పోలీసులకు ఫిర్యాదు చేసినా ప్రమాదానికి కారకులైన వారిపై ఎలాంటి చర్యలు తీసుకోవడంలేదని ఆరోపించారు. రోడ్డుపై వాహనాలు పెద్దఎత్తున నిలిచిపోవడంతో ఏసీపీ రమేష్ ఘటనా స్థలానికి చేరుకుని మృతురాలి బంధువులకు సర్దిచెప్పి రాస్తారోకోను విరమింపజేశారు.