
మరణంలోనూ వీడని భార్యాభర్తల బంధం
మునుగోడు: భర్త గుండెపోటుతో మృతిచెందడం తట్టుకోలేక ఒక్క రోజు వ్యవధిలోనే భార్య కూడా గుండెపోటుతో మృతి చెందింది. ఈ ఘటన నల్ల గొండ జిల్లా మునుగోడు మండలం పలివెల గ్రామంలో జరిగింది. గ్రామస్తులు, మృతుల కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. పలివెల గ్రామానికి చెందిన దుబ్బ శంకరయ్య(65), దుబ్బ లక్ష్మమ్మ(61) భార్యాభర్తలు. వీరికి ఒక కుమారుడు ఉన్నాడు. శంకరయ్య మేసీ్త్ర పనిచేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న శంకరయ్య ఇంటి వద్దే ఉంటున్నాడు. ఆదివారం శంకరయ్యకు గుండెలో నొప్పి రావడంతో కుటుంబ సభ్యులు హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందాడు. అంత్యక్రియలు నిర్వహించేందుకు సోమవారం శంకరయ్య మృతదేహాన్ని హైదరాబాద్ నుంచి ఇంటికి తీసుకొచ్చారు. భర్త మృతిని తట్టుకోలేక ఆయన మృతదేహంపై పడి బోరున విలపించినా లక్ష్మమ్మ కూడా గుండెపోటు రావడంతో కుటుంబ సభ్యులు ఆమెకు హైదరబాద్‌కు తరలించారు. అక్కడకి వెళ్లేసరికి ఆమె కూడా మృతిచెందింది. అన్యోన్యంగ జీవించిన భార్యాభర్తలు ఒక్క రోజు వ్యవధిలోనే మృతిచెందడంతో కుటుంబ సభ్యులు, గ్రామస్తులు కన్నీరుమున్నీరుగా విలపించారు. ఈ దంపతుల అంత్యక్రియలు సోమవారం పలివెల గ్రామంలో ఒకేసారి నిర్వహించారు.
ఒక్కరోజు వ్యవధిలో
గుండెపోటుతో ఇరువురు మృతి