
కుక్కను తప్పించబోయి కూలీల ఆటో బోల్తా
ఆత్మకూర్(ఎస్): మహిళా కూలీలతో వెళ్తున్న ఆటో కుక్కను తప్పించబోయి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో ఒక కూలీ మృతిచెందగా.. పలువురికి తీవ్ర తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన ఆత్మకూర్(ఎస్) మండల పరిధిలోని కోటపహడ్ గ్రామంలో బుధవారం తెల్లవారుజామున జరిగింది. పోలీసులు, బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. సూర్యాపేట రూరల్ మండలం టేకుమట్ల గ్రామానికి చెందిన పది మంది మహిళలు అదే గ్రామానికి చెందిన కేశరాజుపల్లి శంకర్ ఆటోలో ఆత్మకూర్(ఎస్) మండలం శెట్టిగూడెంలో మిరప తోట ఏరడానికి బుదవారం తెల్లవారుజామున బయల్దేరారు. ఉదయం 4:30 సమయంలో కోటపహాడ్ గ్రామ పంచాయతీ సమీపంలో ఒక్కసారిగా కుక్క అడ్డు రావడంతో ఆటో డ్రైవర్ కుక్కను తప్పించబోగా.. అదుపుతప్పి ఆటో బోల్తా పడింది. దీంతో ఆటోలో ప్రయాణిస్తున్న మాదరబోయిన యాదమ్మ(50) అక్కడికక్కడే మృతిచెందింది. మిగతా కూలీలకు తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని 108 వాహనంలో గాయపడిన వారిని సూర్యాపేట ఏరియా ఆస్పత్రికి తరలించారు. యాదమ్మ మృతదేహానికి సూర్యాపేట ఏరియా ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించి బంధువులకు అప్పగించారు. మృతురాలి కుమారుడు లింగరాజు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ శ్రీకాంత్‌గౌడ్ తెలిపారు.
ఫ మహిళా కూలీ మృతి
ఫ పలువురికి గాయాలు