
‘భూ భారతితో’ భూ సమస్యలకు చెక్
ఆత్మకూరు(ఎం) : రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన భూ భారతి పోర్టల్ ద్వారా భూ సమస్యలన్నీ పరిష్కారం అవుతాయని ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య పేర్కొన్నారు. గురువారం ఆత్మకూర్(ఎం) మండల కేంద్రంలోని నిర్వహించిన భూ భారతి చట్టం అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. గత ప్రభుత్వం తీసుకువచ్చిన ధరణి పోర్టల్ ద్వారా భూ సమస్యలు పరిష్కారానికి నోచుకోక రైతులు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారని పేర్కొన్నారు. ఏళ్ల తరబడి రెవెన్యూ కార్యాలయాలు, కోర్టుల చుట్టూ తిరిగినా న్యాయం జరగలేదన్నారు. రైతుల మధ్య ఘర్షణలు కూడా చోటు చేసుకున్నాయన్నారు. లోపభూయిష్టంగా ఉన్న ధరణిని రద్దు చేస్తామని ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు భూభారతి చట్టం తీసుకువచ్చిందన్నారు. ఇకపై భూ సమస్యలకు సత్వర పరిష్కారం లభించనుందన్నారు.
ప్రతి రైతుకూ భూధార్ కార్డు :
కలెక్టర్ హనుమంతరావు
ఆధార్ కార్డు తరహాలోనే ప్రతి రైతుకు భూధార్ కార్డు ప్రభుత్వం అందజేస్తుందని కలెక్టర్ హనుమంతరావు తెలిపారు. భూభారతి చట్టం 36 ఆప్షన్లతో రైతులకు సులభంగా అర్థమయ్యేలా తెలుగు భాషలో ఉంటుందన్నారు. అదనపు కలెక్టర్ వీరారెడ్డి భూభారతి చట్టంపై అవగాహన కల్పించారు. అనంతరం ఎస్సీ కాలనీలో కూరెళ్ల అనిల్ ఇంట్లో సన్నబియ్యంతో ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య, కలెక్టర్, డీసీసీబీ చైర్మన్ కుంభం శ్రీనివాస్‌రెడ్డి, ఆర్డీఓ కృష్ణారెడ్డి, అధికారులు భోజనం చేశారు. కార్యక్రమంలో ప్రత్యేకాధికారి రాజారాం, పీఏసీఎస్ చైర్మన్ జిల్లాల శేఖర్‌రెడ్డి, వైస్ చైర్మన్ గంధమల్ల జహంగీర్, తహసీల్దార్ లావణ్య, ఎంపీడీఓ రాములునాయక్, మార్కెట్ డైరెక్టర్ పాశం వినోద, డీసీసీ అధ్యక్షుడు అండెం సంజీవరెడ్డి, మండల అధ్యక్షుడు యాస లక్ష్మారెడ్డి, మాజీ ఎంపీపీ మంగమ్మ, మాజీ జెడ్పీటీసీ కొడిత్యాల నరేందర్ గుప్తా పాల్గొన్నారు.
ఫ ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య