
వార్షికోత్సవానికి ‘శుభవార్త’ ముస్తాబు
మఠంపల్లి: మఠంపల్లిలోని శుభవార్త చర్చి వార్షికోత్సవానికి సిద్ధమైంది. ఈ నెల 24, 25 తేదీల్లో వేడుకలు నిర్వహించేందుకు చర్చిని విద్యుద్దీపాలతో అందంగా తీర్చిదిద్దారు. మఠంపల్లిలో శుభవార్త చర్చిని 1908 నుంచి 1915 మధ్యకాలంలో నిర్మించారు. దీనిని 110 ఏళ్ల క్రితం మొదటి రెవరెండ్ ఫాదర్ ఫాస్కలీ స్థానిక క్రైస్తవుల సహకారంతో ప్రారంభించారు. చర్చి ప్రాంగణంలోని కొలనులో ఆరోగ్యమాత(మేరీమాత) విగ్రహం ఉంది. శిథిలావస్థకు చేరిన ఈ చర్చిని 1984లో స్థానిక క్రైస్తవ పెద్దలు సుమారు రూ.50లక్షలతో 100 అడుగుల ఎత్తు గల రెండు గోపురాలతో అద్భుతంగా పునఃనిర్మించారు. మొదటి ఫాదర్ ఫాస్కలీ అనాథలు, వృద్ధులకు ఆశ్రయమిచ్చేందుకు స్థానికంగా అన్నమ్మ(మేరీమాత) పేరుతో మఠం స్థాపించారు. దీంతో అనేక మంది సిస్టర్స్ ఇక్కడికి వచ్చి పేదలు, వృద్ధులకు సేవలందిస్తున్నారు. అన్నమ్మ మఠం ద్వారా వైద్యశాల, సెయింట్ మేరీస్ పేరుతో ఉన్నత పాఠశాలను స్థాపించడంతో పేద విద్యార్థులు చదువుకుంటున్నారు. శుభవార్త చర్చి ద్వారా మఠంపల్లి నుంచి వెళ్లిన అనేక మంది మత గురువులు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న చర్చిల్లో సేవలందిస్తున్నారు. ప్రతి ఏడాది చర్చి వార్షికోత్సవంలో భాగంగా ఏప్రిల్ 25న నిర్వహించే శుభవార్త చర్చి జాతరకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన మత గురువులు, బిషప్‌లతో పాటు దేశవిదేశాల్లోని క్రైస్తవులు కూడా హాజరవుతుంటారు.
మంగళవార్త దేవాలయం నుంచి
శుభవార్త చర్చిగా..
మఠంపల్లిలోని శుభవార్త చర్చికి గతంలో మంగళవార్త దేవాలయంగా పేరుండేది. అయితే కన్య మరియమాత గర్భంలో బాలయేసు జన్మించనున్నాడని గాబ్రియేల్(దేవదూత) దూత పలికిన శుభసూచికమైన వార్తనే శుభవార్తగా భావించి ఈ చర్చికి శుభవార్త చర్చిగా నామకరణం చేసినట్లు క్రైస్తవులు చెబుతున్నారు.
26నుంచి ఎద్దుల పందేలు..
చర్చి వార్షికోత్సవం సందర్భంగా స్థానిక శుభోదయ యువజన సంఘం ఆధ్వర్యంలో చర్చి కమిటీ సహకారంతో ఈ నెల 26 నుంచి 29 వరకు మాంట్‌ఫోర్డ్ హైస్కూల్ మైదానంలో రోజూ రాత్రి 10గంటల వరకు ఫ్లడ్ లైట్ల వెలుతురులో ఎద్దుల పందేలు నిర్వహించనున్నారు. ఈ పోటీల్లో గెలుపొందిన ఎద్దులకు అన్నివిభాగాల్లో కలిపి రూ.8.78లక్షల నగదు బహుమతులతో పాటు షీల్డ్‌లు కూడా అందజేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
24, 25 తేదీల్లో వేడుకలు