
నష్టం రూ.10 కోట్లపైనే!
అకాల వర్షాలకు దెబ్బతిన్న పంటలు
సాక్షి, యాదాద్రి : వరుస వర్షాలు అన్నదాతను కోలుకోకుండా చేస్తున్నాయి. ఏప్రిల్ ఒక్క నెలలోనే ఎనిమిది పర్యాయాలు కురిసిన వర్షాలకు వరి, ఉద్యాన తోటలకు తీవ్రనష్టం వాటిల్లింది. వందల ఎకరాల్లో వరి చేలు నేలకొరిగాయి. మామిడి రాలి పోయాయి. జిల్లా వ్యాప్తంగా 2,050 ఎకరాల్లో వరి, 250 ఎకరాల్లో మామిడి తోటలు దెబ్బతిన్నాయి. మొత్తంగా 1,525 మంది రైతులు అకాల వర్షాలతో నష్టపోయారు. మొత్తం రూ.10కోట్లకు పైనే నష్టం వాటిల్లినట్లు అధికారులు అంచనా వేశారు.
ఏటా ఇవే కష్టాలు
జిల్లాలో ఏటా ఇదే సమయంలో అకాల వర్షాలు కురువడం పరపాటిగా మారింది. ఈ ఏడు కూడా ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురిశాయి. ఈ ఒక్క నెలలోనే 3, 10,15, 18,19, 20,21,27 తేదీల్లో వర్షాలు కురిశాయి. వర్షాలకు తుర్కపల్లి, రాజాపేట, ఆలేరు, రామన్నపేట, మోటకొండూరు, భూదాన్‌పోచంపల్లి, బొమ్మలరామారం, అడ్డగూడూరు, అత్మకూర్(ఎం), గుండాల మండలాల్లో ఎక్కువగా నష్టం వాటిల్లింది.
నష్టంపై ప్రాథమిక అంచనా
వ్యవసాయ, ఉద్యానవన శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి వర్షాలకు దెబ్బతిన్న పంటలను పరిశీలించారు. సర్వే నంబర్ల వారీగా నష్టాన్ని అంచనా వేశారు. అత్యధికంగా వరి 2,050 ఎకరాల్లో రూ.8.50 కోట్లు, ఆ తరువాత మామిడికి 250 ఎకరాల్లో రూ.2.52 కోట్ల మేర నష్టం జరిగినట్లు లెక్కక ట్టారు. నష్టంపై నివేదిక రూపొందించి పరిహారం కోసం ప్రభుత్వానికి పంపించారు.
ప్రాణ, ఆస్తినష్టం
పిడుగు పాటుకు మూగజీవాలు మృత్యువాత పడి యజమానులు నష్టపోయారు. రాజాపేట మండలం రేణికుంటలో బండిమల్లయ్యకు చెందిన 40 మేకలు, 10 గొర్రెలు, చల్లూరులో ఎర్ర నర్సయ్యకు చెందిన పాడిగేదె, పాడి ఆవు, బీబీనగర్ మండలం పడమటి సోమారంలో రెండు పాడి అవులు మృత్యువాత పడ్డాయి.
మోటకొండూరు మండల తేర్యాలకు బాలగాని రాజు 18 ఎకరాల వరి సాగు చేశాడు. ఇదులో 12 ఎకరాలు సొత భూమి కాగా, ఆరు ఎకరాలు కౌలుకు తీసుకున్నాడు. సుమారు రూ.4లక్షలు పెట్టుబడి పెట్టాడు. మూడు రోజుల్లో కోతకు సిద్ధం అవుతుండగా వడగండ్ల వాన కురిసింది. దీంతో వరి కంకులు పెద్దెత్తున నేలరాలాయి. ఉన్న పంటను కోయగా ఎకరాకు 20 బస్తాల చొప్పున దిగుబడి వచ్చింది. పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి లేదని రైతు వాపోయాడు.
ఫ 2,050 ఎకరాల్లో వరి, 250 ఎకరాల్లో మామిడికి నష్టం
ఫ నష్టాన్ని అంచనా వేసిన అధికారులు
ఫ ప్రభుత్వానికి నివేదిక అందజేత
ట్రాక్టర్ వడ్లు రాలాయి
ఏడు ఎకరాల్లో వరి వేశాను. మూడెకరాలు నూర్పిడి చేసి కొనుగోలు కేంద్రంలో పోశాను. స్థలం లేదని మిగిలిన పొలం కోయలేదు. ఈనెల 15వ తేదీన కురిసిన వడగండ్ల వానకు కోయని పొలంలో దాదాపు ట్రాక్టర్ వడ్లు రాలిపోయాయి. ప్రభుత్వపరంగా ఆదుకోవాలి.
–ఆవుల లక్ష్మీనారాయణ, నీర్నెముల

నష్టం రూ.10 కోట్లపైనే!

నష్టం రూ.10 కోట్లపైనే!

నష్టం రూ.10 కోట్లపైనే!

నష్టం రూ.10 కోట్లపైనే!