
వీడని వర్షం.. తీరని నష్టం
ఫ కొనుగోలు కేంద్రాల్లో తడిసిన ధాన్యం
ఫ ఈదురు గాలులకు నేలకొరిగిన వరి
ఫ మామిడి, సపోట తోటలకు నష్టం
ఫ పంట దక్కలేదని రైతుల ఆందోళన
ఫ పలు చోట్ల ఆస్తినష్టం
మోత్కూరు : రైతులను అకాల వర్షాలు వీడడం లేదు. ఆదివారం రాత్రి ఈదురుగాలుతో కూడిన వర్షానికి పంట, ఆస్తినష్టం వాటిల్లింది. పొడిచేడులో వడగండ్లు పడటంతో కప్ప మల్లేష్ వరి చేలో ధాన్యం పెద్ద ఎత్తున రాలిపోయింది. పైరు నేలకొరిగింది. దాచారంలో పది విద్యుత్ స్తంభాలు కూలిపోయాయి. ముంత లక్ష్మి ఇంటిపై చెట్టు విరిగి పడి రేకులు ధ్వంసమయ్యాయి. ఆ సమయంలో లక్ష్మి ఇంట్లోనే ఉండడంతో ఆమెకు గాయాలయ్యాయి. గాదె నర్సయ్య ఇంటి పైకప్పు రేకులు గాలికి లేచిపోయాయి. పెంకులు పగలడంతో నష్టం వాటిల్లింది. కొనుగోలు కేంద్రంలో ధాన్యం తడిసింది. కొంతమంది రైతుల వడ్లు వర్షపు నీటిలో కొట్టుకుపోయాయి. అనాజిపురంలో కొల్లు శంకర్ మామిడి తోటలో కాయలు రాలిపోయాయి.
వలిగొండ : పహిల్వాన్‌పురం, టేకులసోమారంలో ఆదివారం రాత్రి ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. ఈదురుగాలులకు దెబ్బతిన్న మామిడి తోటలను చౌటుప్పల్ డివిజన్ ఉద్యానవన శాఖ అధికారి కవిత సోమవారం పరిశీలించారు. రెండు గ్రామాల్లో ఎనిమిదిన్నర ఎకరాల్లో మామిడికి నష్టం జరిగినట్లు ప్రాథమికంగా అంచనా వేశారు. నివేదికను అధికారులకు పంపనున్నట్లు ఆమె తెలిపారు.
రాజాపేట : మండలంలోని మల్లగూడెంలో సోమవారం సాయంత్రం ఈదురుగాలులు, వడగండ్ల వర్షం కురిసింది. గంటపాటు కురిసిన వడగండ్ల వానకు వరి చేలలో ధాన్యం నేలరాలింది. ప్రభుత్వ పరంగా ఆదుకోవాలని రైతులు కోరారు.
గుండాల : మండలంలోని రామారంలో ఆదివారం రాత్రి వీచిన ఈదురుగాలులకు గ్రామానికి చెందిన మల్లెపాక శ్రీకాంత్, మల్లెపాక సాంబయ్య, బండారు ముత్తయ్యల రేకుల ఇళ్లు నేలమట్టం అయ్యాయి. నిరుపేద కుటుంబాలకు చెందిన తమను ఆదుకోవాలని బాధితులు అధికారులను కోరారు.
తుర్కపల్లి : మండలంలోని తిర్మలాపూర్, వీరారెడ్డిపల్లిలో వడగండ్ల వాన, ఈదురు గాలులకు వరి చేలు దెబ్బతిన్నాయి. పలు చోట్ల మామిడి కాయలు నేలరాలాయి. ఆస్తినష్టం వాటిల్లింది.

వీడని వర్షం.. తీరని నష్టం

వీడని వర్షం.. తీరని నష్టం

వీడని వర్షం.. తీరని నష్టం

వీడని వర్షం.. తీరని నష్టం