
వీడని తల్లి, కుమార్తె మరణం మిస్టరీ..?
మిర్యాలగూడ అర్బన్: మిర్యాలగూడ పట్టణంలోని హౌజింగ్‌బోర్డు కాలనీకి చెందిన తల్లి, కుమార్తె మరణ మిస్టరీ 11 రోజులవుతున్నా ఇంకా వీడలేదు. ఈ నెల 12వ తేదీన వారిద్దరు ఇంట్లో మృతిచెందగా.. ఈ కేసు ఇంకా ఓ కొలిక్కి రాలేదు. ఏపీలోని పల్నాడు జిల్లా మాచర్ల మండలం గన్నవరం గ్రామానికి చెందిన గుర్రం సీతారాంరెడ్డి, రాజేశ్వరి దంపతులకు ఇద్దరు కుమార్తెలు వేదశ్రీ, వేద సాయిశ్రీ ఉన్నారు. ఓ ప్రైవేట్ ఆగ్రో కెమికల్ సంస్థలో పనిచేస్తున్న సీతారాంరెడ్డి నల్లగొండ జిల్లా సేల్స్ మేనేజర్‌గా బదిలీపై 15 ఏళ్ల క్రితమే ఇక్కడికి వచ్చి మిర్యాలగూడలో నివాసముంటున్నారు. ఈ నెల 10వ తేదీన సీతారాంరెడ్డి కంపెనీ బడ్జెట్ ఆడిట్ సమావేశం ఉండటంతో హైదరాబాద్‌కు వెళ్లి.. రెండు రోజుల తర్వాత ఇంటికి వచ్చి చూసేసరికి చిన్న కుమార్తె వేద సాయిశ్రీ గొంతుపై కత్తిగాటుతో, భార్య రాజేశ్వరి బెడ్‌రూంలో ఉరేసుకుని విగతజీవులుగా కనిపించారు.
నాలుగు బృందాలతో దర్యాప్తు..
ఈ కేసును ఛేదించడానికి పోలీసులు నాలుగు బృందాలు ఏర్పడి దర్యాప్తు చేపట్టారు. ఒక బృందం ఏపీలోని జమ్మలమడుగు, రొంపిచెర్ల, కుంబంపాడు, దాచేపల్లి, నకిరేకల్ ప్రాంతాలలో పర్యటించి కేసుకు సంబంధించిన వివరాలు సేకరించినా.. మరో బృందం స్థానికంగా ఉన్న సీసీ కెమెరాల ఫుటేజీలు, సెల్‌ఫోన్స్ సిగ్నల్స్ వంటి అంశాలపై కూపీ లాగినా.. మరో బృందం మృతుల ఇంటిని క్షుణ్ణంగా పరిశీలించి ఆధారాలు సేకరించినప్పటికీ, ఘటన జరిగిన సమయంలో ఇంట్లోనే ఉన్న సీతారాంరెడ్డి పెద్ద కుమార్తె వేదశ్రీ తాను నిద్రలో ఉన్నానని, తనకు ఏమీ తెలియదని చెప్పడంతో కేసు మిస్టరీ వీడడంలేదు. పోస్టుమార్టం ప్రాథమిక నివేదికలోనూ ఎలాంటి క్లూ దొరకలేదా..? ఒకవేళ దొరికినా.. ఆ విషయాలను ఇన్ని రోజులు పోలీసులు ఎందుకు గోప్యంగా ఉంచుతున్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దర్యాప్తులో సేకరించిన విషయాలను పోల్చి చూసుకునేందుకు ఫోరెన్సిక్ నివేదిక కోసం పోలీసులు నిరీక్షిస్తున్నట్లు తెలుస్తోంది.
ఫ నాలుగు బృందాలుగా ఏర్పడి
దర్యాప్తు చేపట్టిన పోలీసులు
ఫ 11 రోజులవుతున్నా కొలిక్కి రాని కేసు

వీడని తల్లి, కుమార్తె మరణం మిస్టరీ..?