
చిన్నప్పటి నుంచే ఉన్నత లక్ష్యంతో చదవాలి
నకిరేకల్: విద్యార్థులు చిన్నప్పటి నుంచే ఉన్నత లక్ష్యంతో చదవాలని నల్లగొండ జిల్లా ఎస్పీ శరత్‌చంద్ర పవార్ అన్నారు. నకిరేకల్ పట్టణంలోని ఉద్దీపన(వీవీఎం ఎయిడెడ్) స్కూల్ ప్రథమ వార్షికోత్సవాన్ని గురువారం రాత్రి స్థానిక జెడ్పీహెచ్‌ఎస్ ఆవరణలో స్కూల్ చైర్మన్, ఎమ్మెల్యే వేముల వీరేశం ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ వేడుకలకు ఎస్పీ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. తాను కూడా చిన్నతనం నుంచే ఉన్నతమైన లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకుని మందుకు సాగానని గుర్తుచేశారు. తల్లిదండ్రులు తమ పిల్లలను తమకు ఇష్టమైన ఆటల్లో ప్రోత్సహించాలన్నారు. నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం సారథ్యంలో ఉద్దీపన స్కూల్‌లో కార్పొరేట్ స్థాయి విద్యను ఉచితంగా అందిస్తుండడం అభినందనీయమన్నారు. నకిరేకల్ జెడ్పీహెచ్‌ఎస్‌ను పోలీస్ శాఖ దత్తత తీసుకుని ఎన్‌రోల్‌మెంట్ కోసం కృషి చేస్తానని హమీ ఇచ్చారు. మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి మాట్లాడుతూ.. ఎమ్మెల్యే వీరేశం నకిరేకల్ నియోజకవర్గ అభివృద్ధితో పాటు విద్యకు ప్రాధాన్యత ఇవ్వడం హర్షించదగ్గ విషయమన్నారు. అనంతరం ఎమ్మెల్యే వేముల వీరేశం మాట్లాడుతూ.. పేద పిల్లలకు కార్పొరేట్ స్థాయి విద్య అందించాలన్న లక్ష్యంతో ముందుకు సాగుతున్నానని చెప్పారు. చిన్నారుల సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. హెచ్‌ఎం గంగాధర భద్రయ్య ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో స్కూల్ సలహాదారుడు డాక్టర్ ఆనందన్, బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ పూజర్ల శంభయ్య, ట్రస్మా గౌరవ అధ్యక్షుడు కందాల పాపిరెడ్డి, మార్కెట్, మున్సిపల్ చైర్‌పర్సన్లు మంజుల, రజితాశ్రీనివాస్‌గౌడ్, మాజీ ఎంపీపీలు చామల శ్రీనివాస్, బచ్చుపల్లి శ్రీదేవీగంగాధర్‌రావు, పీఏసీఎస్ చైర్మన్ నాగులంచ వెంకటేశ్వరరావు, ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ బెల్లి యాదయ్య, మున్సిపల్ కమిషనర్ బాలయ్య, వివిధ మండలాల ఎంఈఓలు మేకల నాగయ్య, అంబటి అంజయ్య, పాఠశాల ఉపాధ్యాయులు రామకృష్ణ, చెరుకు సతీష్, కౌన్సిలర్లు పాల్గొన్నారు.
ఫ నల్లగొండ జిల్లా ఎస్పీ శరత్‌చంద్ర పవార్

చిన్నప్పటి నుంచే ఉన్నత లక్ష్యంతో చదవాలి