
ఎస్‌పీఎఫ్ కానిస్టేబుల్స్ బదిలీ
యాదగిరిగుట్ట : యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో విధులు నిర్వహిస్తున్న స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ (ఎస్‌పీఎఫ్) హెడ్ కాని స్టెబుల్స్, కానిస్టేబుల్స్ బదిలీ అయ్యారు. ఇందులో ఐదుగురు హెడ్ కానిస్టెబుల్స్, ముగ్గురు కానిస్టేబుల్స్ ఉన్నట్లు ఆర్‌ఎస్‌ఐ శేషగిరిరావు తెలిపారు. ఐదుగురు హెడ్ కానిస్టేబుల్స్, ఇద్దరు కానిస్టేబుల్స్‌ను వరంగల్, ఒక కానిస్టేబుల్‌ను హైదరాబాద్‌క బదిలీ చేసినట్లు వెల్లడించారు. వీరి స్థానంలో కొత్తవారు రానున్నారని, త్వరలో విధుల్లో చేరుతారని పేర్కొన్నారు.
యాదగిరి కొండపై తనిఖీలు
యాదగిరిగుట్ట: యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయం, ఆలయ పరిసరాల్లో శుక్రవారం బాంబ్, డాగ్ స్క్వాడ్ బృందాలు తనిఖీలు నిర్వహించాయి. క్యూలైన్లు, ఉచిత దర్శన మార్గం, ఆలయ పరిసరాల్లో తనిఖీలు చేశాయి. అనుమానితుల లగేజీ బ్యాగులను పరిశీలించాయి. జమ్మూకశ్మీర్‌లోని పహల్గామ్ ఘటన నేపథ్యంలో రాచకొండ సీపీ ఆదేశాల మేరకు తనిఖీలు నిర్వహించినట్లు తెలిపారు.
నేత్రపర్వంగా నిత్యకల్యాణం
భువనగిరి : పట్టణ శివారులోని స్వర్ణగిరి క్షేత్రంలో శుక్రవారం శ్రీవేంకటేశ్వరస్వామి నిత్యకల్యాణ వేడుక నేత్రపర్వంగా చేపట్టారు. ముందుగా వేకువజామున సుప్రభాత సేవల, తోమాల సేవ, సహస్రనామార్చన తదితర పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం స్వామి, అమ్మవారికి కల్యాణం జరిపించారు. మధ్యాహ్నం సుమారు 3వేల మందికి అన్నప్రసాద వితరణ, సాయంత్రం తిరువీధి ఉత్సవ సేవ, కుంకుమార్చన నిర్వహించారు.
ధాన్యం కొనుగోలు చేయాలని ఆందోళన
భువనగిరి : మండలంలోని బస్వాపురం ఐకేపీ ఆధ్వర్యంలో శుక్రవారం పలువురు రైతులు ఆందోళనకు దిగారు. కొనుగోలు కేంద్రానికి వడ్లు తెచ్చి నెల రోజులు కావస్తుందని, ఇప్పటి వరకు కాంటా వేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రాత్రి, పగలు వడ్లకుప్పల వద్ద పడిగాపులు కాయాల్సి వస్తుందని, త్వరగా కొనుగోళ్లు ప్రారంభించాలని కోరారు. కార్యక్రమంలో రైతులు విజయ్‌కుమార్, సత్యనారాయణ, మంగమ్మ తదితరులు ఉన్నారు.
పెండింగ్ బిల్లులు విడుదల చేయాలి
సూర్యాపేట అర్బన్ : ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు ఉద్యోగులకు పెండింగ్ బిల్లులను వెంటనే విడుదల చేయాలని ఆల్ ఎంప్లాయీస్ జేఏసీ రాష్ట్ర చైర్మన్ మారం జగదీశ్వర్ డిమాండ్ చేశారు. శుక్రవారం సూర్యాపేట పట్టణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సీపీఎస్ విధానాన్ని రద్దు పాత పెన్షన్ విధానాన్ని కొనసాగించాలన్నారు. ప్రభుత్వం ఏర్పడి 15 నెలలు అవుతున్నా ఇంతవరకు పట్టించుకోకపోవడం బాధాకరమన్నారు.