
ప్రత్యేక తరగతులు.. పరీక్షలు
ఇంటర్‌లో ఫెయిల్ అయిన విద్యార్థుల కోసం కార్యాచరణ
భువనగిరి: ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల్లో తక్కువ ఉత్తీర్ణత నమోదైన ప్రభుత్వ కళాశాలలపై జిల్లా ఇంటర్మీడియట్ విద్యాశాఖ ప్రత్యేక దృష్టి సారించింది. మే 22నుంచి ప్రారంభంకానున్న అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలకు విద్యార్థులను సంసిద్ధులను చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. ఈ మేరకు కార్యాచరణ రూపొందించారు. దీన్ని ఈనెల 22వ తేదీనుంచి అమలు చేయనున్నారు.
అన్ని కాలేజీల్లో 82శాతం లోపే ఉత్తీర్ణత
జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ జూనియర్ కాలేజీలు 11 ఉన్నాయి. గత విద్యా సంవత్సరంతో పోలిస్తే ఫలితాలు మెరుగుపడినప్పటికీ.. ఏ ఒక్క కాలేజీలో 90 శాతం ఉత్తీర్ణత మించలేదు. ప్రథమ సంవత్సరం గత ఏడాది 34.8 శాతం, ఈ సారి 42.1 శాతం ఉత్తీర్ణత నమోదైంది. సెకండియర్ గత ఏడాది 52 శాతం, ఈసారి 63.11 మంది ఉత్తీర్ణులయ్యారు.
ఈ సబ్జెక్టుల్లో అధికంగా ఫెయిల్
ఎంపీసీ విభాగంలో గణితం, కెమిస్ట్రీ, బైపీసీ విభాగంలో కెమిస్ట్రీ, ఫిజిక్స్, సీఈసీ విభాగంలో ఎకానమిక్స్‌లో ఎక్కువగా ఫెయిల్ అయ్యారు. వీటితో పాటు ఇంగ్లిష్‌లో కూడా చాలా మంది తప్పినట్లు తెలుస్తోంది.
కళాశాలల వారీగా ఉత్తీర్ణత ఇలా..
కళాశాలప్రథమ సంవత్సరం ద్వితీయ సంవత్సరం
హాజరు/ఉత్తీర్ణత శాతం హాజరు/ఉత్తీర్ణత శాతం
రామన్నపేట 164/113 68.9 208/172 82.7
మోత్కూర్ 159/109 68.6 105/91 86.7
భువనగిరి 65/39 60.0 100/76 76.0
చౌటుప్పల్ 101/60 59.4 117/64 54.7
పోచంపల్లి 126/67 53.2 124/94 75.8
నారాయణపురం 135/59 43.7 127/79 62.2
భువనగిరి 145/54 37.2 126/62 49.2
యాదగిరిగుట్ట 80/19 23.8 109/67 61.5
వలిగొండ 111/26 23.4 124/49 39.5
బి.రామారం 34/06 17.7 40/12 30.0
ఆలేరు 115/19 16.5 116/52 44.8
కార్యాచరణ ఇదీ..
ఉత్తీర్ణత శాతం తక్కువగా నమోదైన కళాశాలల్లోని విద్యార్థులకు జిల్లా ఇంటర్మీడియట్ శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక తరగతులు నిర్వహించనున్నారు. ఇందుకోసం 20 రోజుల ప్రణాళిక సిద్ధం చేశారు.
● 30 శాతం కంటే తక్కువగా ఉత్తీర్ణత సాధించిన కళాశాలల్లో విద్యార్థులకు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తారు.
● ప్రత్యేక తరగతులకు హాజరుకాని విద్యార్థులకు జూమ్ ద్వారా తరగతులు నిర్వహించనున్నారు.
● రెండు లేదా మూడు రోజులకు ఒకసారి ఆయా టెస్టులు నిర్వహిస్తారు.
● ఉన్న సమయాన్ని సద్వినియోగం చేసుకునేలా ప్రధాన సబ్జెక్టులపై ఎక్కువగా దృష్టి సారిస్తారు.
● ముఖ్యమైన ప్రశ్నలు మాత్రమే చదివిస్తారు.
పరీక్ష ఫీజు చెల్లింపునకు
ఈనెల 30 వరకు గడువు
అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు మే 22నుంచి ప్రారంభంకానున్నాయి. ఫీజు చెల్లింపునకు ఈనెల 30వ తేదీ వరకు గడువు ఉంది.
తప్పనిసరిగా హాజరుకావాలి
ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో గతంతో పోలిస్తే ఫలితాలు మెరుగుపడ్డాయి. అయినప్పటికీ తక్కువ ఉత్తీర్ణత నమోదైన కళాశాలలపై ప్రత్యేక దృష్టి సారించాం. ఫెయిల్ అయిన విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. తరగతులతో పాటు టెస్ట్‌లు నిర్వహిస్తాం. విద్యార్థులు తప్పనిసరిగా హాజరుకావాలి.
–రమణి, డీఐఈఓ
ఫ 28వ తేదీ నుంచి అమలు
ఫ మే 22 నుంచి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ..