
ఖబరస్థాన్‌లో బయటపడ్డ పురాతన శాసనాలు
కోదాడరూరల్: కోదాడలోని రామాలయం పక్కన గల ఖబరస్థాన్‌లో మంగళవారం ఓ వ్యక్తిని ఖననం చేసేందుకు ముస్లింలు గొయ్యి తవ్వుతుండగా పురాతన శాసనాలు బయటపడ్డాయి. వక్ఫ్‌బోర్డు సభ్యులు, పోలీసులు, రెవెన్యూ అధికారులకు సమాచారం ఇవ్వడంతో వారు ఘటనా స్థలానికి చేరుకొని శాసనాలను స్వాధీనం చేసుకొని డీఎస్పీ కార్యాలయానికి తరలించారు. అనంతరం ఆర్డీఓ సూర్యనారాయణ, డీఎస్పీ శ్రీధర్‌రెడ్డి విలేకరులతో మాట్లాడుతూ.. తమిళంతో పాటు పలు భాషల్లో ఉన్న రాగి పలకలు బయటపడినట్లు తెలిపారు. కలెక్టర్ ఆదేశాల మేరకు వాటిని పురావస్తు శాఖ కార్యాలయానికి పంపనున్నట్లు పేర్కొన్నారు. ఈ విలేకరుల సమావేశంలో తహసీల్దార్ వాజిద్ అలీ, పట్టణ సీఐ శివశంకర్, ఎస్‌ఐ రంజిత్‌రెడ్డి, ఆర్‌ఐ రాజేష్ ఉన్నారు.