
రాజంపేట: నందలూరు–ఆడపూరు మధ్య ఉన్న కొండల్లో రాయలసీమలో తొలిసారిగా బౌద్ధారామాలు బయల్పడ్డాయి. వీటి వద్ద ఉన్న సొరంగ మార్గంలో జరిపిన తవ్వకాలకు నాలుగు దశాబ్దాలుగా బ్రేక్ పడింది. 1979 సెప్టెంబర్‌లో జరిపిన తవ్వకాల్లోనే సొరంగమార్గం బయటపడింది. తర్వాత తవ్వకాల ప్రయత్నాలు ముందుకుసాగలేదు. ఫలితంగా గుహల చరిత్ర వెలుగులోకి రాలేకపోయింది. ఇప్పటికై నా కేంద్ర, రాష్ట్ర, పురావస్తు శాఖలు సంయుక్తంగా తవ్వకాలు జరపాలని చరిత్రకారులు కోరుతున్నారు.
రాజరికాలను ప్రతిబింబిస్తూ...
నందలూరును కేంద్రంగా చేసుకుని చోళ, పాండ్య, పల్లవ రాజులే కాకుండా, కాకతీయ, విజయనగర రాజులు పాలించారు. వారు ఈ సొరంగమార్గం ఏర్పాటు చేసుకున్నారని చెబుతున్నారు. నాటి రాజుల రాజరికాలను ప్రతిబింబిస్తూ ఇది బయల్పడింది. ఈ ప్రవేశద్వారం నుంచి లోపలికి వెళ్లగానే విశాలమైన హాలు, మండపం ఉన్నాయి. లోపలిభాగంలో చీకటి నింపుకుని భూ మార్గం ఉంది. దీని గురించి పలు కథనాలు ప్రచారంలో ఉన్నాయి. సొరంగమార్గం నందలూరు నుంచి సిద్ధవటం రాజమహల్ వరకు ఉండవచ్చునని చరిత్రకారుల అంచనా..
► బౌద్ధారామాలు భద్రత పేరుతో ప్రభుత్వం, పురావస్తుశాఖ అధికార్లు తవ్వకాలను అర్ధంతరంగా ఆపివేశారు. తవ్వకాలు నిలిపివేసి నాలుగు దశాబ్దాలవుతున్నా ప్రభుత్వాలు పట్టించుకోకపోవడం గమనార్హం. కాగా దివంగత సీఎం వైఎస్‌రాజశేఖరరెడ్డి పాలనలో బౌద్ధారామాలను పునరుద్ధరించారు. కొంతమేర అభివృద్ధి పనులు చేపట్టారు. అమరావతి ఆంద్రప్రదేశ్‌గా రూపుదిద్దుకున్న క్రమంలో రాజరికానికి రూపంగా నిలిచిన బైరాగి గుట్ట ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా గుర్తించి అభివృద్ధి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని చరిత్రకారులు అంటున్నారు.
► బౌద్ధమత ఔన్నత్యానికి సజీవ తార్కాణాలుగా రాయలసీమలోనే తొలిసారిగా బయల్పడిన నందలూరు బౌద్ధరామాలు నిలిచాయి. బౌద్ధమతానికి పెద్దపీట వేసే దేశాలు రాజధాని నిర్మాణంలో కీలకపాత్ర పోషిస్తున్న క్రమంలో ఆ మతానికి సంబంధించిన ప్రాంతాల అభివృద్ధికి బీజం వేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముందుకువెళుతోంది.
► నందలూరు మండలం బహుదా(చెయ్యేరు)నదీ తీరాన ఉన్న బౌద్ధారామాల వల్ల రాయలసీమతో కూడా బౌద్ధుల జీవనం ముడిపడిఉందని ఇక్కడి ఆరామాలు స్పష్టీకరిస్తున్నాయి. నందలూరు గ్రామశివార్లలో బైరాగిగుట్ట వద్ద క్రీస్తు పూర్వం మూడో శతాబ్ధానికి సంబంధించిన బౌద్ధరామాలు, బౌద్ధమత అవశేషాలు, రాచరికపు చిహ్నాలు బయల్పడ్డాయి.
లభ్యమైన ఆధారాలు ఇవే..
పురావస్తుశాఖ జరిపిన తవ్వకాల్లో 17 చిన్నబౌద్ధరామాలు, 30 వెండినాణేలు, 24 రాగినాణేలు, 116 చిన్న చిన్న మట్టిపాత్రలు, రాతి చెక్కడపు బొమ్మలు, పెంకులు, 13వ కాలంనాటి స్థూపాలు లభ్యమయ్యాయి. బౌద్ధమత ప్రాముఖ్యానికి నిదర్శనంగా ఒక బౌద్ధారామ మంటపానికి సంబంఽధించిన అవశేషాలు బయల్పడ్డాయి. వీటిని కడపలోని భగవాన్‌మహావీర్ పురావస్తుశాఖ మ్యూజియంలో భద్రపరిచారు.
ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళతాం
1978లో జరిపిన తవ్వకాల్లో అనేక ఆధారాలు లభ్యమయ్యాయి. అవి కడప మహావీర్ మ్యూజియంలో ఉన్నాయి. మళ్లీ తవ్వకాలు చేయాలనే ప్రతిపాదన ఇప్పటి వరకు పురావస్తుశాఖ పరిగణలో లేదు. అయితే నందలూరు బౌద్ధారామాల వద్ద తవ్వకాలు చేపట్టాలనే అంశం ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళతాం.
–శివకుమార్, ఏడీ, రాష్ట్ర పురావస్తుశాఖ, తిరుపతి
తవ్వకాలు జరిపించాలి
బౌద్ధారామాలు రాయలసీమలో తొలిసారిగా బయల్పడింది నందలూరులోనే. 1978లో తవ్వకాల విషయం తానే అప్పటి పురావస్తుశాఖ అధికారులు డా.రామచంద్రమూర్తి, వెంకటేశుల దృష్టికి తీసుకెళ్లాను. తవ్వకాలు జరిపారు. తర్వాత ఆగిపోయాయి. ప్రస్తుతం మళ్లీ చేపట్టాల్సిన అవసరం ఉంది. భావితరాలకు పురావస్తు, వారసత్వ సంపదను అందించాల్సిన బాధ్యత ప్రభుత్వం, పాలకులపై ఉంది.
– విద్వాన్ గానుగపెంట హనుమంతరావు, చరిత్రపరిశోధకుడు, కడప

బౌద్ధారామాల వద్ద ఉన్న గుహ(రహస్యదారి)
Comments
Please login to add a commentAdd a comment