ఈ ఏడాది ఫిబ్రవరిలో స్టీల్ ప్లాంట్ భూమి పూజ సందర్భంగా నమూనా పరిశీలిస్తున్న సీఎం. వైఎస్ జగన్ (ఫైల్)
సాక్షి ప్రతినిధి, కడప: అధికారంలో ఉన్నన్నాళ్లు మాటల మాయాజాలంతో పబ్బం గడపడం. అధికారం కోల్పోతే ప్రజల చెంతకు వెళ్లి బీరాలు పలకడం. ఇదీ టీడీపీ అధినేత చంద్రబాబు వ్యవహార శైలి. ఇప్పుడు అదేబాటలో ఆయన తనయుడు నారా లోకేష్ పయనిస్తున్నారు. ఆచరణలో చిత్తశుద్ధి లోపించి ప్రజలు ఛీత్కరించినా.. మరోమారు మేమైతే అంటూ బీరాలు పలుకుతూ గ్రామాల్లో తిరుగుతున్నారు. బుధవారం జిల్లాలోని జమ్మలమడుగు నియోజకవర్గంలో నారా లోకేష్ పాదయాత్ర ప్రవేశించనుంది. ఆ నియోజకవర్గంలో ప్రధానంగా స్టీల్ ప్లాంట్ నిర్మాణం టీడీపీ వైఖరికి నిదర్శంగా నిలుస్తోంది.
రాష్ట్ర విభజన చట్టంలో కడపలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. 2014లో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు సర్కార్ చిత్తశుద్ధి ప్రదర్శించి ఉక్కు పరిశ్రమ కోసం తపించింటే చరిత్ర మాటగట్టుకునేది. ఎన్నికలు సమీపించే కొద్దీ హడావుడి కార్యక్రమాలు చేపట్టడం, అధికారంలో ఉంటే మాటల గారడీతో ఊదరగొట్టడం ఇదే చంద్రబాబుకు తెలిసిన విద్యగా రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. అచ్చం అదేవిధంగా ఉక్కు పరిశ్రమ పట్ల టీడీపీ సర్కార్ వైఖరి ప్రస్ఫుటమైంది. కేంద్ర ప్రభుత్వ భాగస్వామ్య పార్టీగా టీడీపీ ఉంటూ విభజన చట్టానికి తూట్లు పొడిచింది. వెనుకబడిన రాయలసీమ ప్రాంతంలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయాలని చట్టంలో పొందుపర్చినా అమలు చేయడంలో అత్యంత నిర్లక్ష్యం ప్రదర్శించిందని పలువురు ఎత్తిచూపుతున్నారు.
ఎన్నికలకు ముందు శంకుస్థాపనతో సరి....
2019 ఏప్రెల్ 11న జనరల్ ఎలెక్షన్స్ రాష్ట్రంలో నెలకొన్నాయి. 2018 డిసెంబర్ 27న కడప స్టీల్ ప్లాంట్ నిర్మాణం కోసం మైలవరం మండలం కంబాలదిన్నె గ్రామం వద్ద సీఎం హోదాలో చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేశారు. అంటే ఎన్నికలకు 3 నెలలు ముందుగా శంకుస్థాపన చేపట్టారు. ఐదేళ్ల కాలం కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నా ఉక్కు పరిశ్రమ పట్ల చిత్తశుద్ధి చూపెట్టలేదు. కాగా ఎన్నికల గడువు సమీపించే కొద్ది ఆ పరిశ్రమ ఆవశ్యకత టీడీపీకి గుర్తుకు వచ్చింది. టీడీపీ అనుకూలురు అదే రాజకీయం అంటే అని చెప్పుకొస్తుంటే, యదార్థవాదులు పచ్చి అవకాశవాద రాజకీయంగా చెప్పుకొస్తున్నారు.
చిత్తశుద్ధితో వ్యవహరించిన వైఎస్ జగన్ ప్రభుత్వం
వెనుకబడిన రాయలసీమలో ఉక్కు పరిశ్రమ నెలకొల్పడం ద్వారా ఉపాధి, ఉద్యోగ అవకాశాలు మెరుగుపడతాయని వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం నమ్మింది. అధికారంలోకి వచ్చిన 6 నెలలకు 2019, డిసెంబర్ 23న ఉక్కు పరిశ్రమ నిర్మాణం కోసం సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి శంకుస్థాపన చేశారు. ఏపీ హైగ్రేడ్ స్టీల్స్ లిమిటెడ్ పేరిట నిర్వహణకు సన్నాహాలు చేపట్టారు. రెండు నెలలు తిరక్కమునుపే 2020 ఫిబ్రవరి నుంచి కరోనా వైరస్ యావత్తు ప్రపంచాన్ని గడగడలాడించింది. మానవజీవనం అస్తవ్యస్థ్యంగా మారింది. బతుకు జీవుడా అంటూ తలదాచుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. రెండేళ్లు పాటు ఇలాంటి పరిస్థితి కొనసాగుతూ రావడంతో స్టీల్ ప్లాంట్ నిర్మాణానికి ప్రతిబంధకంగా మారిందని పరిశీలకులు వివరిస్తున్నారు.
జెఎస్‌డబ్ల్యు స్టీల్స్ లిమిటెడ్‌తో నిర్మాణం
ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి జెఎస్‌డబ్ల్యు స్టీల్స్ లిమిటెడ్ ద్వారా స్టీల్ ప్లాంట్ నిర్మాణానికి 2023 ఫిబ్రవరి 15న భూమి పూజ చేశారు. ఎకరం రూ.1.65 లక్షలతో 3,148.68 ఎకరాలు కేటాయిస్తూ 2022 డిసెంబర్ 16 ఉత్తర్వులు జారీ చేశారు. తొలివిడతలో ఏడాదికి 1 మిలియన్ టన్నులు ఉత్పత్తి సామర్థ్యంతో నిర్మాణం తలపెట్టారు. ఫేజ్–1లో రూ.3,300 కోట్లుతో వైర్ రాడ్స్ , బార్‌మిల్స్ ఉత్పత్తి చేసేందుకు పనులు చేపట్టారు. ఫేజ్–2లో మరో రూ.5,500 కోట్లుతో మార్చి 31, 2029 నాటికి పూర్తి చేసేందుకు 3 మిలియన్ టన్నులు ఉత్పత్తి సామర్థ్యంతో ప్రణాళికలు రూపొందించారు. ఆమేరకు రాష్ట్ర ప్రభుత్వం సుమారు రూ.750 కోట్లుతో మౌళిక వసతులు, కనెక్టివిటీ, నీటి పైపులైన్, నిల్వ చేసుకునే సంప్, విద్యుత్, రైల్వేలైన్ వసతి సైతం ఏర్పాటు చేసి ఆచరణలో చిత్తశుద్ధి ప్రదర్శించింది. క్షేత్రస్థాయిలో నిర్మాణ పనులు చురుగ్గా సాగుతున్నాయి. రెండేళ్లకు ఉత్పత్తి చేపట్టాలనే లక్ష్యంతో నిర్మాణ పనులు వేగవంతంగా నడుస్తుండడం విశేషం.
నాడు నాటకీయ పరిణామం
కేంద్ర ప్రభుత్వంలో అధికారాన్ని పంచుకుంటూనే రాష్ట్రంలో టీడీపీ స్టీల్ ప్లాంట్ కోసం నాటకీయ పరిణామాలకు తెరలేపింది. 2018 జూన్ 25న కడప జడ్పీ ప్రాంగణం వేదికగా అప్పటి టీడీపీ రాజ్యసభ సభ్యుడు సిఎం రమేష్‌నాయుడు, అప్పటి ఎమ్మెల్సీ బీటెక్ రవిలచే నిరశన దీక్ష చేయించారు. ఆ దీక్ష ఫోకస్ కోసం చంద్రబాబు సర్కార్ తాపత్రయం పడింది. అప్పటి సిఎంఓ అదేశాల మేరకు కలెక్టరేట్‌కు డైరెక్షన్ చేస్తూ సక్సెస్ కోసం జిల్లా కేంద్రంలోని కళాశాల ల విద్యార్థులను దీక్ష ప్రాంగణానికి వంతులవారిగా తరలించేవారు. వారం రోజులు నాటకీయ దీక్ష చేపట్టిన తర్వాత విరమింపజేశారు. వెంటనే చంద్రబాబు సర్కార్ ఆచరణలోకి వెళ్లిందా అంటే, అదీ లేదని పరిశీలకులు అంటున్నారు.
శిలాఫలకంతో సరిపెట్టారు
టీడీపీ ప్రభుత్వం ఉండగా చంద్రబాబు అనేక పర్యాయాలు ఉక్కు పరిశ్రమ కోసం ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చారు. తుదకు ఎన్నికలకు ముందు శిలాఫలకంతో సరిపెట్టారు. సీఎం వైఎస్ జగన్‌కు చిత్తశుద్ధి ఉండడంతోనే పరిశ్రమ భూమిపూజ నాటికే మౌళిక వసతులు కల్పించారు. – వి హృషికేశవరెడ్డి, జమ్మలమడుగు
లోకేష్‌కు పర్యటించే అర్హత లేదు...
జమ్మలమడుగు నియోజకవర్గంలో నారా లోకేష్‌కు పాదయాత్ర చేసే అర్హతే లేదు. విభజన చట్టంలో పొందుపర్చిన ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకు టీడీపీ అధికారంలో ఉన్నన్నాళ్లు కనీస చొరవ చూపలేదు. ప్రజల్ని మభ్యపెట్టి తద్వారా రాజకీయ లబ్ధి పొందాలనే ఉద్దేశ్యంతోనే పాదయాత్ర చేస్తున్నారు. – ఎం హనుమంతురెడ్డి, జమ్మలమడుగు
Comments
Please login to add a commentAdd a comment