కడప అర్బన్: కడప నగరం తాలూకా పోలీస్‌స్టేషన్ పరిధిలోని విజయదుర్గాకాలనీ ఎదురుగా వున్న మల్లికార్జున నగర్‌లో నివాసం వుంటున్న టీడీపీ నేత, కడప మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ జయసుబ్బారెడ్డి, ఆయన అనుచరులైన పీరుబాష, రియాజ్‌ఖాన్, పీరులపై శుక్రవారం కేసు నమోదు చేశారు. ఈ కేసు వివరాలిలా వున్నాయి. కడప నగరంలోని హనుమప్పవీధిలో కోట విజయలక్ష్మి తన తల్లి వద్ద నివాసం వుంటోంది. ఆమె కుమారుడు వెంకట సురేష్ ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌లో పని చేస్తున్నాడు. వెంకటసురేష్ వృత్తిరీత్యా తన భార్య ఇద్దరు కుమారులతో పూణేలో వుంటాడు.
వెంకట సురేష్ పెద్ద కుమారుడికి చిన్నప్పటి నుంచే తీవ్ర అనారోగ్య సమస్యలున్నాయి. పిల్లవాడికి వైద్యం, ఇతరత్రా కారణాలతో రూ.40 లక్షలు అప్పులు చేశాడు. దీంతో గత ఏడాది మార్చిలో తన తల్లితో తనకు రూ.40 లక్షలు డబ్బులు కావాలని అడిగాడు. ఈక్రమంలో విజయలక్ష్మి విడతల వారీగా దాదాపు 39 లక్షలను తన కుమారుడికి, జయసుబ్బారెడ్డి సిఫారసు మేరకు అనుచరుడు పీరు ద్వారా ‘వెస్ట్రన్ మనీ’ ద్వారా వెంకటసురేష్ బ్యాంక్ ఖాతాకు పంపించారు. అదే స్లిప్‌లను తీసుకుని జయసుబ్బారెడ్డి, తన అనుచరులైన పీరుబాష, రియాజ్‌ఖాన్, పీరులు విజయలక్ష్మిని ఈ నెల 21న ఇంటికి వెళ్లి బెదించారు.
ఈక్రమంలో జయసుబ్బారెడ్డికి డబ్బులు బాకీ వున్నారని పదేపదే అర్ధరాత్రి సమయంలో పీరుబాష.. విజయలక్ష్మికి ఫోన్ చేసి డబ్బులు కట్టాల్సిందేనని బెదిరించారు. దీంతో మరుసటి రోజున విజయలక్ష్మి.. జయసుబ్బారెడ్డి ఇంటికి వెళ్లి తాను డబ్బులు ఎందుకు బాకీ అని ప్రశ్నించింది. దీంతో జయసుబ్బారెడ్డి, ‘నీవు చచ్చిపోతే వచ్చిన డబ్బులు’ వసూలు చేసుకుంటామని విజయలక్ష్మిని బెదిరించాడు.
దీంతో విజయలక్ష్మి తీవ్ర మనస్థాపానికి గురై జయ సుబ్బారెడ్డి ఇంటి మెట్లపై పురుగుల నివారణ మందు తాగి ఆత్మహత్యకు ప్రయత్నించింది. వెంటనే ఆమెను 108లో కడప రిమ్స్‌కు వైద్య సేవల కోసం తీసుకుని వెళ్లారు. బాధితురాలి అన్న శ్రీనివాసులరెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పై నలుగురిపై కేసు నమోదు చేశారు. ఈ సంఘటనపై కడప తాలూకా సీఐ ఉలసయ్య మాట్లాడుతూ బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసును నమోదు చేశామన్నారు. చట్ట పరిధిలో నిందితులకు పోలీసులు శుక్రవారం 41 నోటీసులు జారీ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment