వైఎస్సార్ : మండలంలోని కొర్రపాడు గ్రామానికి చెందిన శ్రీపతి లిఖిత (15) అనే విద్యార్థిని సోమవారం అనారోగ్యంతో మృతి చెందింది. ఆ విద్యార్థిని రాజుపాళెంలోని శివప్రియ హైస్కూల్‌లో విద్యను అభ్యసిస్తోంది. రాజుపాళెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఉదయం పది పరీక్షలు రాసింది. పరీక్ష అనంతరం శివప్రియ హైస్కూల్‌కు వెళ్లి తోటి విద్యార్థులతో కలసి భోజనం చేసింది. అనంతరం రేపటి పరీక్షకు చదువుకునేందుకు క్లాసు రూంకు వెళుతున్న సమయంలో కళ్లు తిరిగి కుప్పకూలిపోయింది. వెంటనే ఆ విద్యార్థినిని ప్రథమ చికిత్స కోసం రాజుపాళెంలోని ప్రభుత్వాస్పత్రికి తరలించారు.
అప్పటికే కొన ఊపిరితో ఉన్న లిఖిత కొద్ది సేపటికి మృతి చెందిందని తెలిపారు. పోస్టుమార్టం నిమిత్తం మృతురాలిని ప్రొద్దుటూరు జిల్లా ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. ఆ విద్యార్థిని కొన్నేళ్లుగా గుండెకు సంబంధించిన వ్యాధితో బాధపడుతూ ఉండేదని ఆ పాఠశాల యాజమాన్యం తెలిపింది. అనురాధ, సుధాకర్ దంపతులకు ముగ్గురు కుమార్తెలు కాగా, మృతి చెందిన విద్యార్థిని లిఖిత రెండో సంతానం. మొదటి కుమార్తె పూణెలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తోంది. మూడో కుమార్తె శివప్రియ హైస్కూల్‌లో ఆరో తరగతి చదువుతోంది.
Comments
Please login to add a commentAdd a comment