టీడీపీ శిబిరంలో ఆందోళన! | - | Sakshi
Sakshi News home page

టీడీపీ శిబిరంలో ఆందోళన!

Published Thu, May 30 2024 2:15 AM | Last Updated on Thu, May 30 2024 12:01 PM

-

అతి విశ్వాసం దెబ్బతీసిందంటున్న శ్రేణులు

కడప, కమలాపురం, మైదుకూరులో సెల్ఫ్‌ గోల్‌

మరోమారు ఓటమి తప్పదంటున్న పుట్టా, పుత్తా వర్గీయులు

సాక్షి ప్రతినిధి, కడప: ప్రజాసేవ, విశ్వసనీయత ఇవన్నీ ఒక ఎత్తయితే, ఎన్నికల్లో పోల్‌ మేనేజ్‌మెంట్‌, సమీకరణలు మరో ఎత్తు. వర్గ రాజకీయాలకు పేరున్న రాయలసీమ.. అందులో కడప జిల్లాలో ఆ పాళ్లు మరింత ఎక్కువ. ఇలాంటి వర్గ సమీకరణలో టీడీపీ శిబిరం విఫలమైంది. మరోవైపు గెలుపు తథ్యమని అతి విశ్వాసంతో ఉన్న అవకాశాన్ని చేజార్చుకున్నారు. కడప, కమలాపురం, మైదుకూరు నియోజకవర్గాల్లో ఇలాంటి పరిస్థితి తెరపైకి వచ్చింది. దీంతో పోలింగ్‌ అనంతరం తెలుగుదేశం శిబిరంలో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.

👉 కడప, రాజంపేట పార్లమెంట్‌ స్థానాల్లో వైఎస్సార్‌సీపీ ఆధిపత్యం ఎక్కువ. ఎన్నికలు ఏవైనా ఏకపక్షంగా ఫలితాలు ఉండేవి. ఇప్పటికీ వైఎస్సార్‌సీపీకి ప్రజానీకం అండగా ఉన్నప్పటికీ ఈమారు కొన్ని ప్రాంతాల్లో కాస్త తేడా కన్పించింది. అందుకు కారణంగా ఆయా నేతల వ్యక్తిగత వ్యవహారశైలి, మరోవైపు టీడీపీ అభ్యర్థులు వరుసగా ఓటమి పాలవుతున్న నేపథ్యం, సామాజిక సమీకరణలు ఇలాంటి కారణాల రీత్యా కాస్త అనుకూల పవనాలు కన్పించాయి. కాగా, టీడీపీ అభ్యర్థులు ఒక్కో ఇటుక పేర్చుకుంటూ రావాల్సి ఉండగా, తిరోగమనంలో ఉన్న అవకాశాన్ని చేజార్చుకుంటూ వచ్చారని రాజకీయ విశ్లేషకులు వెల్లడిస్తున్నారు.

ఓటమికి కారణమవుతున్న అతి విశ్వాసం..
కడప అసెంబ్లీ పరిధిలో ఎన్నడూ లేనివిధంగా విద్వేషాలు తెరపైకి వచ్చాయి. ప్రశాంత వాతావరణంలో జీవిస్తున్న ప్రజానీకం మధ్యలో కలతలు సృష్టించారు. ఎన్నికల కోసం హిందూ–ముస్లిం ఫీలింగ్‌ తీసుకొచ్చారు. ఎలాగైనా గెలుస్తామన్నా ధీమా టీడీపీ శిబిరంలోకి వచ్చి చేరింది. ఈ పరిస్థితుల్లో టీడీపీ టికెట్‌ ఆశించిన కార్పొరేటర్‌ ఉమాదేవి కుటుంబ మద్దతు స్వీకరించడంలో విఫలమయ్యారు. మరోవైపు శాంతికి నిలయమైన కడపలో దుందుడుకు చర్యలను కొనసాగిస్తూ వచ్చారు. 

ఇప్పుడే ఇలా ఉంటే, ఎమ్మెల్యేగా ఎన్నికై తే పరిస్థితి ఎలా ఉంటుందోనన్న అంచనాకు తటస్తులు వచ్చారు. అదే టీడీపీకి శాపంగా మారిందని పరిశీలకులు అంచనా వేస్తున్నారు. పదేళ్లుగా ఎమ్మెల్యేగా కొనసాగు తున్న అంజద్‌బాషా మంచితనాన్ని గమనించిన ప్రజలు పోలింగ్‌లో ఆ ప్రభావం చూపారని పలువురు వివరిస్తున్నారు. ఇలాంటి స్థితి కమలాపురంలో కూడా తెరపైకి వచ్చింది. మాజీ ఎమ్మెల్యే వీరశివారెడ్డి చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరారు.

 అయినప్పటికీ స్థానికంగా ఆయన మద్దతు కోరలేదు, స్వగ్రామం కోగటంలో ప్రచారానికి వెళ్తూ, సమాచారం కూడా ఇవ్వలేదు. పైగా అవసరం లేదన్నట్లుగా టీడీపీ అభ్యర్థి పుత్తా కుటుంబం వ్యవహరించింది. మరోవైపు టీడీపీ నేత సాయినాథశర్మతో ఎన్నికలు సమీపించే కొద్ది గొడవలు పెట్టుకొని దూరం చేసుకున్నారు. ఈ ఇద్దరు నేతలను దూరం చేసుకోవడం టీడీపీకి ప్రతిబంధకంగా మారిందని విశ్లేషకులు వెల్లడిస్తున్నారు. ఈనేపథ్యంలో భారీ మెజార్టీ దక్కుతుందని భావిస్తున్న కమలాపురం మండలంలో టీడీపీకి ఊహించని స్థాయిలో లోటు ఏర్పడిందని విశ్లేషకులు వెల్లడిస్తున్నారు.

స్వయంకృతాపరాధమే..
మైదుకూరులో టీడీపీ అభ్యర్థి పుట్టా సుధాకర్‌యాదవ్‌ రెండుసార్లు వరుసగా ఓడిపోయారు. ఈమారు కొంత సానుభూతి వ్యక్తమైంది. ఇలాంటి స్థితిలో అనుకూలంగా మల్చుకోవాల్సి ఉండగా చేజార్చుకుంటూ వచ్చారని పలువురు వివరిస్తున్నారు. ముందే యాదవ ముద్ర వేసుకొని రెడ్డి సామాజిక వర్గాన్ని దూరం చేసుకున్నారనే అపప్రద ఉంది. కాగా.. టీడీపీ ఆవిర్భావం నుంచి ఆపార్టీలో కొనసాగుతున్న రెడ్యం వెంకటసుబ్బారెడ్డి కుటుంబాన్ని పొగబెట్టి బయటికి పంపించారు. దీంతో ఆ సామాజిక వర్గం ఆవేదనతో రగిలిపోయింది. 

ఉన్న ఒక్క నాయకున్ని కూడా నిలుపుకోలేదనే భావన వ్యక్తమైంది. ఎస్సీ, ముస్లీం మైనార్టీ వర్గీయులు ఏకపక్షంగా వైఎస్సార్‌సీపీకీ అండగా నిలిచారు. దీంతో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి ఎస్‌.రఘురామిరెడ్డి విజయం సునాయసమైందని విశ్లేషకుల భావన. గట్టి పోటీ ఇవ్వగలమని భావించినా ఆయా నియోజకవర్గాల్లో టీడీపీ వెనుకంజలో పడింది. మరోమారు ఓటమి తప్పదని పుట్టా, పుత్తా వర్గీయులు భావిస్తూనే, పైకి మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నారు. ఇలా ఆయా నియోజకవర్గాల్లో ఓవర్‌ కాన్ఫిడెన్స్‌తో సెల్ప్‌గోల్‌ కొట్టుకున్నారని పరిశీలకులు భావిస్తున్నారు. దీంతో కౌంటింగ్‌ సమీపించే కొద్ది టీడీపీ శిబిరంలో తీవ్ర ఉత్కంఠ నెలకొనడం గమనార్హం.

 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement