సాక్షి ప్రతినిధి, కడప: ఐదేళ్లు మహిళామణులకు అన్నీ తానై అండదండగా నిలిచారు. మహిళల ఆర్థిక స్వావలంబన కోసం అహర్నిశలు తపించారు. ప్రతి పథకంలోనూ మహిళలకు ప్రాధాన్యత కల్పించారు. ఆ అభిమానం నారీలోకంలో గూడు కట్టుకుపోయింది. అయితే ఐదేళ్లకోసారి లభించే ప్రజా తీర్పులో ఆ అభిమాన నేత ఓటమిపాలయ్యారు. అయినా వారిలో ఉన్న మమతానురాగాలు చెక్కు చెదరలేదు. తామెంతో అభిమానించే జననేతను చూడగానే ఉబికి వస్తున్న కన్నీళ్లను పంటిబిగువన ఆపుకునే వారు కొందరైతే, బోరున ఏడ్చేవారు మరికొందరయ్యారు. ప్రతి ఒక్కరి హృదయాలను కదిలించే ఈ దృశ్యాలు శనివారం మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కడప నుంచి పులివెందులకు వెళ్లే మార్గంలోని ప్రధాన రహదారిపై కనిపించాయి.
👉 ఎన్నికల ఫలితాల తర్వాత మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తొలిసారిగా శనివారం పులివెందుల పర్యటనకు వచ్చారు. కడప విమానాశ్రయం నుంచి రోడ్డు మార్గాన పులివెందులకు బయలుదేరారు. జిల్లాలోని వైఎస్సార్‌సీపీ శ్రేణులు పెద్ద ఎత్తున కడపకు చేరుకున్నారు. వైఎస్ జగన్ కాన్వాయ్ వెంట అనుసరించారు. దాదాపు 2 కిలోమీటర్ల పొడవునా కార్ల కాన్వాయ్ కొనసాగింది. ప్రతి చోటా కాన్వాయ్ ఆపడం, తనను చూసేందుకు వచ్చిన ప్రజలకు అభివాదం చేస్తూ మాజీ సీఎం ముందుకు కదిలారు.
పులివెందుల చేరేందుకునాలుగు గంటల సమయం..
కడప నుంచి పులివెందుల చేరుకునేందుకు వీఐపీ కాన్వాయ్ గంట లేదా గంటన్నర సమ యం పడుతుంది. కాగా, శనివారం కడప నుంచి పులివెందుల చేరుకునేందుకు మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి 4 గంటల సమయం పట్టింది. కాన్వాయ్‌లో వాహనాలు సుమారు 2 కిలోమీటర్ల పొడువునా బారులు తీరాయి. రోడ్డుపైకి వచ్చిన గ్రామీణులకు అభివాదం చేస్తూ, మహిళలను ఓదారుస్తూ వైఎస్ జగన్ కదిలారు. బేస్తవారిపల్లెలో చిన్నారులను భుజానికెత్తుకుని లాలించారు. ఈ దృశ్యం అభిమానులకు కనువిందు చేసింది. ఇలా ప్రజల ప్రేమాభిమానాల మధ్య పులివెందుల చేరుకునేందుకు నాలుగు గంటలు పైగా సమయం పట్టడం విశేషం.
బోరున విలపించిన మహిళలు..
పులివెందుల రోడ్డు మార్గంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వెళ్తున్నారని తెలుసుకున్న గ్రామీణులు ఆయా గ్రామాల వద్ద రోడ్డుపైకి వచ్చి చేరారు. రాజకీయ పార్టీలతో నిమిత్తం లేకుండా మహిళలు జగన్‌ను చూసేందుకు ఎగబడ్డారు. ఈ క్రమంలో వైఎస్ జగన్‌ను చూడగానే మహిళలు బోరున విలపించారు. వెల్లటూరులో ఆరు పదుల వయస్సు దాటిన ఓ మహిళ అందరూ కూడబలుక్కుని అన్యాయం చేశారే కొడుకా అంటూ కన్నీళ్లు పెట్టుకుంది. ఇలా గ్రామ గ్రామాన మహిళలు తండోపతండాలుగా రోడ్డుపైకి వచ్చి, అభిమాన నాయకున్ని చూడగానే వారిలో ఉన్న ప్రేమాభిమానాలు గుప్పించారు.
గుర్రాలచింతలపల్లె, ఇందిరానగర్, కొత్తూరు, వేంపల్లె, తాళ్లపల్లె, వి.కొత్తపల్లె, వేముల, వేల్పుల, బేస్తవారిపల్లె ఇలా దారి వెంబడి మహిళలు ఉద్వేగానికి లోనయ్యారు. మహిళలు ఆయా జంక్షన్లలో పిట్టగోడలు ఎక్కి జగన్ కోసం ఎదురు చూశారు. వేంపల్లె హన్‌మాన్ జంక్షన్‌లో మస్తాన్‌బీ అనే మహిళ తన ఆవేదనను ఆపుకోలేక ఒక్కమారుగా కన్నీరు పెట్టుకున్నారు. నాయనా...నువ్వు బాగుండాలి.. మా పాలిట దేవుడివి అంటూ అభిమానాన్ని చాటుకున్నారు. వేల్పులలో మహిళలు మూకుమ్మడిగా రోడ్డుపైకి వచ్చి మేమంతా నీ వెంటే అంటూ నినాదాలు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment