గట్టి ఇడ్లీలు... నూనె కారుతున్న పూరీలు
అన్నా క్యాంటీన్ టిఫిన్‌పై అసంతృప్తి వ్యక్తం చేసిన ప్రజలు
తొలిరోజే.. రుచిలేని ఆహారపదార్థాల వడ్డింపు
అన్నా క్యాంటీన్ టిఫిన్‌పై అసంతృప్తి వ్యక్తం చేసిన ప్రజలు
115 కి.మీ.లోని కుప్పం నుంచి మదనపల్లెకు ఆహారపదార్థాల రవాణా
మదనపల్లె: రాళ్ల లాంటి గట్టి ఇడ్లీలు... నూనె కారుతూ, పచ్చిగా ఉన్నటువంటి పూరీలు.. రుచి పచీ లేని సాంబార్. ఇదీ తొలిరోజు అన్నమయ్య జిల్లా మదనపల్లె అన్నా క్యాంటీన్‌లో వడ్డించిన టిఫిన్ మెనూలోని పదార్థాల నాణ్యత. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక..ఎన్నికల హామీ నిలబెట్టుకునే క్రమంలో ఆగస్టు 16 నుంచి ప్రారంభించిన అన్నా క్యాంటీన్‌లు తొలిరోజే ప్రజలను నిరాశపరిచాయి.
రూ.5కే ఇడ్లీ, పూరీ తినవచ్చని ఆశగా వెళ్లినవారు పదార్థాల నాణ్యత, రుచిని చూసి పెదవి విరిచారు. వడ్డించిన పదార్థాల్లో కేసరి స్వీట్ మాత్రమే బాగుందని, మిగిలిన పదార్థాలు చల్లగా ఉండటంతో ఎప్పుడు తయారుచేశారో అని అనుమానం వ్యక్తం చేశారు. ఈ విషయమై అన్నా క్యాంటీన్ సూపర్‌వైజర్‌ని అడిగితే...తమకు ఆహారపదార్థాలు 115 కిలోమీటర్ల దూరంలోని చిత్తూరుజిల్లా కుప్పం నుంచి వస్తున్నాయన్నారు.
అక్కడి నుంచి ఇక్కడకు వచ్చేందుకు కనీసం మూడు గంటల సమయమైనా పడుతుందని చెప్పుకొచ్చారు. భోజనం తినేందుకు ఎంతో ఆశగా, ఆకలితో వచ్చిన పేదలు...ఎర్రటి ఎండలో ముప్పావుగంటకు పైగా క్యూలో నిల్చుని ఎదురుచూశారు. తొలిరోజు అన్నా క్యాంటీన్‌లో ఆహారపదార్థాల నాణ్యతపై మున్సిపల్ ఆర్డీ పీ.వి.వి.ఎస్.మూర్తి, రాజంపేట పార్లమెంటరీ టీడీపీ అధ్యక్షులు చమర్తి జగన్మోహన్‌రాజు పరిశీలించారు.
అన్నమే రాలేదు
గతంలో 12 గంటలకే మధ్యాహ్న భోజనం పెట్టేవారు. ఇప్పుడు 1 గంట అయినా అన్నం రాలేదు. ఆకలిగా ఉంది. అందుకే వెళ్లిపోతున్నాం.
– కృష్ణానాయక్, అనంతపురం
Comments
Please login to add a commentAdd a comment