దాల్మియా యాజమాన్యం వైఖరి దారుణం
–ఎమ్మెల్సీ పి. రామసుబ్బారెడ్డి
జమ్మలమడుగు : ఫ్యాక్టరీ నిర్మాణం కోసం భూములు ఇచ్చి సహకరించిన రైతుల పట్ల దాల్మియా యాజమాన్యం అన్యాయంగా వ్యవహరిస్తోందని ఎమ్మెల్సీ పి.రామసుబ్బారెడ్డి పేర్కొన్నారు. గురువారం స్థానిక వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. దాల్మియా యాజమాన్యం వంకలు, వాగులు ఆక్రమించి ఫ్యాక్టరీ నిర్మాణం చేపట్టడం వల్ల వర్షా కాలంలో వరదలు వచ్చిన ప్రతి సారి పంట పొలాలతో పాటు గ్రామాలను సైతం వరద ముంచెత్తుతోందన్నారు. దీనిపై నవాబుపేట, దుగ్గనపల్లి ఎస్సీకాలనీ ప్రజలతోపాటు చిన్నకొమెర్ల రైతులు అనేక సార్లు యాజమాన్యానికి మొరపెట్టుకున్నా వారు ఏమాత్రం పట్టించుకోలేదన్నారు. దీంతో మూడు గ్రామాల రైతులు లోకాయుక్తను ఆశ్రయించారన్నారు. ఇటీవల లోకాయుక్త కమిటీ ఈ ప్రాంతంలో పర్యటించి నష్టపోయిన రైతులకు, బ్లాస్టింగ్‌తో దెబ్బతిన్న నవాబుపేట గ్రామస్తులకు న్యాయం చేయాలని, దుగ్గనపల్లి గ్రామంలోని రైతుల పంట పొలాలకు పరిహారం ఇవ్వడంతోపాటు వారి గ్రామాన్ని వేరే చోటికి తరలించి శాశ్వతమైన పరిష్కారం చూపాలని లోకాయుక్త యాజమాన్యానికి సూచించిందన్నారు. అయితే యాజమాన్యం ఇవేమీ పట్టించుకోకుండా ఫ్యాక్టరీ విస్తరణ కోసం ప్రజాభిప్రాయ సేకరణకు వెళ్లడం ఏమిటని ప్రశ్నించారు. ప్రజల సమస్యలకు పరిష్కారం చూపకుండా రెండో ప్లాంట్ విస్తరణకు వెళితే రైతుల ఆగ్రహాన్ని చవిచూడాల్సి వస్తుందని హెచ్చరించారు. శుక్రవారం దాల్మియా చుట్టుపక్కల గ్రామాల్లో దెబ్బతిన్న పంట పొలాలను, దెబ్బతిన్న ఇళ్లను పరిశీలించనున్నట్లు రామసుబ్బారెడ్డి తెలిపారు. రైతుల పక్షాన తాము పోరాటం చేస్తామని చెప్పారు. ఈ సమావేశంలో వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి కొమెర్ల మోహన్‌రెడ్డి, మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ శివగురివిరెడ్డి, నవాబుపేట భాస్కర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
గాయపడిన మహిళ మృతి
లింగాల : లింగాల మండలం ఎగువ లింగాల గ్రామానికి చెందిన అలవలపాటి శోభ(40) అనే మహిళపై ఈనెల 15వ తేదీ శనివారం విద్యుత్ స్తంభం పడింది. ఈ ప్రమాదంలో మహిళ కాలు పూర్తిగా రెండు ముక్కలై తలకు బలమైన గాయాలయ్యాయి. దీంతో ఆమె చికిత్స పొందుతూ గురువారం ఉదయం మృతి చెందింది. వివరాలిలా.. గత శనివారం తన పొలంలోని బుడ్డశనగ పంటను భారీ మిషన్‌తో నూర్పిడి చేశారు. తర్వాత పక్క పొలంలో బుడ్డశనగ పంట నూర్పిడికి కూలీలు తక్కువగా ఉన్నారని కొద్దిసేపు పంట నూర్పిడి మిషన్ వద్దకు రావాలని కూలీల మేసీ్త్ర పిలవడంతో శోభ వెళ్లింది. బుడ్డశనగ పంట కుప్పలను మిషన్‌లోకి వేయడానికి వెళ్లగా భారీ మిషన్‌కు అడ్డంగా పైన ఉన్న విద్యుత్ తీగలను మిషన్ తగలగా.. సమీపంలోని విద్యుత్ స్తంభం విరిగి బుడ్డశనగ కుప్పను ఎత్తుతున్న శోభపై పడింది. దీన్ని తప్పించుకునే ప్రయత్నం చేయగా కాలిపై పడి రెండు ముక్కలైంది. విద్యుత్ స్తంభానికున్న కడ్డీ తలకు తగిలి బలమైన గాయమైంది. వెంటనే ఆమెను కడపలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ గురువారం మృతి చెందిందని ఆమె కుటుంబ సభ్యులు తెలిపారు. మృతురాలు శోభకు భర్త బాల శేఖరరెడ్డి, ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు.
ఇరువర్గాల గొడవ
పులివెందుల రూరల్ : పులివెందుల పట్టణంలోని ఫైర్ స్టేషన్ సమీపంలో గాంధీనగర్ వద్ద గురువారం రాత్రి కొంతమంది యువకులు గొడవపడ్డారు. గాంధీ నగర్‌కు చెందిన కుమార్, పుష్పంత్.. అదే కాలనీకి చెందిన ప్రతాప్, ప్రదీప్, హరిలు రెండు వర్గాలుగా ఏర్పడి ఘర్షణకు దిగారు. ఈ సంఘటనలో కుమార్, పుష్పంత్‌లతోపాటు ప్రదీప్‌కు తీవ్ర గాయాలయ్యాయి. పోలీసుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. పూలంగళ్ల సమీపంలోని రంగనాథ స్వామి తిరుణాలలో ఇరువర్గాలకు చెందిన వీరు మాటా, మాటా మాట్లాడి గొడవపడ్డారు. గురువారం ఇరువర్గాలు ఫైర్ స్టేషన్‌లో రాడ్లతో కొట్టుకోవడంతో వీరికి తీవ్ర గాయాలైనట్లు పోలీసులు తెలిపారు. ఇరువర్గాల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
హంస వాహనంపై
ఊరేగిన వీరభద్రస్వామి
చాపాడు : ప్రముఖ పుణ్యక్షేత్రమైన మండలంలోని అల్లాడుపల్లె శ్రీ వీరభద్రస్వామి దేవస్థానం సన్నిధిలో మహా శివరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నారు. రెండో రోజైన గురువారం రాత్రి వీరభద్రస్వామి, భద్రకాళీమాత హంస వాహనంపై ఊరేగారు. ఆలయ ప్రాంగణంలో గణపతి, వల్లీ దేవసేన, సుబ్రమణ్యేశ్వరస్వామి, చండీశ్వర స్వామి, శ్రీ భద్రకాళి సమేత శ్రీ వీరభద్రస్వామి, త్రిశూలేశ్వరస్వామి పంచమూర్తి ఉత్సవం వైభవంగా నిర్వహించారు. ప్రత్యేక అలంకరణంలో ఊరేగిన వీరభద్రస్వామికి వేలాది మంది భక్తులు పూజలు చేశారు.
దాల్మియా యాజమాన్యం వైఖరి దారుణం
దాల్మియా యాజమాన్యం వైఖరి దారుణం
Comments
Please login to add a commentAdd a comment