బీఈడీ పరీక్షలు ప్రారంభం
కడప ఎడ్యుకేషన్: యోగి వేమన విశ్వవిద్యాలయ పరిధిలోని బీఈడీ కళాశాలల్లో 1,3 సెమిస్టర్ పరీక్షలు జిల్లా వ్యాప్తంగా 15 కేంద్రాల్లో గురువారం ప్రారంభమయ్యాయి. విశ్వవిద్యాలయ కులసచివులు ఆచార్య పుత్తా పద్మ, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఆచార్య కె. ఎస్.వి. కృష్ణారావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. కడపలో ఎస్వీ డిగ్రీ కళాశాలలో ఏర్పటు చేసిన పరీక్షా కేంద్రాన్ని పరిశీలించారు. విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా చూడాలని కళాశాల యాజమాన్యానికి సూచించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లాలోని 10 కేంద్రాల్లో, అన్నమయ్య జిల్లాలోని ఐదు కేంద్రాల్లో తొలి రోజు 4,713 మంది పరీక్షలు రాశారని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా రెండు ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు తనిఖీలు చేస్తున్నట్లు చెప్పారు.
డబ్ల్యూడీసీ ద్వారా జిల్లాలో సాగులోకి లక్ష ఎకరాలు
కడప సెవెన్‌రోడ్స్: వాటర్ షెడ్ డెవలప్మెంట్ కమిటీల (డబ్ల్యూడీసీ)ను సమర్థవంతంగా నిర్వహిస్తూ అనుబంధ శాఖల సమన్వయంతో వచ్చే ఏడాదికి జిల్లాలో లక్ష ఎకరాలను సాగుబడిలోకి తీసుకురావాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి డ్వామా అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌లో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ వాటర్ షెడ్లు, ఫారం పాండ్లు, ఇంకుడు గుంతలు, స్టార్మ్, రైన్ వాటర్ హార్వెస్టింగ్ నిర్మాణాల ద్వారా సమీప నీటి వనరులను సద్వినియోగం చేసుకుంటూ వ్యవసాయ, ఉద్యాన పంటల సాగుతో మెట్ట భూములను సాగులోకి తీసుకురావాలన్నారు. వ్యవసాయంలో అంతర్భాగమైన ఉద్యాన, ప్రకృతి సాగు, పాడి, మత్స్య సంపదను గ్రామాల్లో అభివృద్ధి చేసే లక్ష్యంగా ప్రణాళికలు రూపొందించాలన్నారు. అనంతరం సీఎన్‌ఎఫ్ జిల్లా ప్రాజెక్టు మేనేజర్ ఎస్వీ ప్రవీణ్ కుమార్ సహజ పద్ధతుల ద్వారా వ్యవసాయ సాగును ప్రోత్సహించేందుకు ఖరీఫ్ యాక్షన్ ప్లాన్ ను పీపీటీ ద్వారా వివరించారు. డ్వామా పీడీ అదిశేషారెడ్డి, సీఎన్‌ఎఫ్ జిల్లా ప్రాజెక్టు మేనేజర్ ఎస్వీ ప్రవీణ్ కుమార్, వ్యవసాయశాఖ జిల్లా అధికారి నాగేశ్వరరావు, ఉద్యాన శాఖ డీడీ సుభాషిణి, డీఆర్డీఏ పీడీ ఆనంద్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.
పీపుల్ సర్వేను
సమర్థవంతంగా నిర్వహించాలి
కడప సెవెన్‌రోడ్స్: ప్రగతి పథంలో నడిపించి అందరి జీవితాల్లో వెలుగులు నింపాలనే ఉద్దేశ్యంతో చేపట్టిన పీపుల్ సర్వేని జిల్లాలో సమర్థవంతంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి అధికారులను ఆదేశించారు. గురువారం జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుంచి పి–4 విధానం (పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్ షిప్) ద్వారా పేదలకు ఆర్థిక సాధికారత చేకూర్చడానికి జీవన ప్రమాణాలలో అట్టడుగు స్థాయిలో గల 20 శాతం మంది నిరుపేదలను గుర్తించడానికి నిర్వహించనున్న సర్వే పై జిల్లా కలెక్టర్.. జెడ్పి సీఈఓ, డీపీఓ, మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీఓలు, నియోజకవర్గ, మండల ప్రత్యేక అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా దిశా నిర్దేశం చేసి తగు సూచనలు, ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ, ప్రయివేట్, ప్రజల భాగస్వామ్యంతో ప్రతి ఇల్లు పేదరికాన్ని అధిగమించి ఆర్థికంగా, సామాజికంగా బలోపేతం చేసే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం పి–4 పాలసీని అమలు చేస్తోందన్నారు.
సిసోడియాను కలిసిన కలెక్టర్: మదనపల్లె నుంచి విజయవాడకు వెళుతూ కడపలోని స్టేట్ గెస్ట్‌హౌస్‌లో బస చేసిన రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి (రెవిన్యూ) ఆర్‌పీ సిసోడియాను జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకరి మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్బంగా రెవెన్యూ పరమైన అంశాలను కలెక్టర్ ఆయనకు తెలియజేశారు.
త్వరితగతిన లక్ష్యం
పూర్తి చేయాలి
కడప అగ్రికల్చర్: 2024–25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి బిందు, తుంపర సేద్యం లక్ష్యాన్ని త్వరితిగతిన పూర్తి చేయాలని ఆంధ్రప్రదేశ్ సూక్ష్మనీటి సాగు పథకం(ఏపీఎంఐపీ) ఓఎస్డీ రమేష్ పేర్కొన్నారు. గురువారం కడప కలెక్టరేట్‌లోని ఏపీఎంఐపీ జిల్లా కార్యాలయంలో ప్రాజెక్టు డైరెక్టర్ వెంకటేశ్వరెడ్డి అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2024–25 సంవత్సరానికి తుంపర, బిందు సేద్యానికి సంబంధించి జిల్లాకు 15000 హెక్టార్లు లక్ష్యంగా నిర్దేశించినట్లు చెప్పారు. ఇప్పటి వరకు 8666 హెక్టార్ల లక్ష్యాన్ని చేరుకున్నామన్నారు. అలాగే క్షేత్రస్థాయిలో సూక్ష్మ సేద్య పరికరాలు అవసరం ఉన్న రైతు లను గుర్తించి ప్రాథమిక తనిఖీలు చేపట్టి డ్రిప్పు పరికరాలను సరఫరా చేయాలన్నారు. జిల్లా ప్రాజెక్టు డైరెక్టర్ వెంకటేశ్వరెడ్డి, ఏపీడీ మురళీమోహన్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment