
సెంట్రల్ ల్యాబ్ వద్ద రిజిస్ట్రేషన్ క్యూలో వున్న రోగులు, వారి సహాయకులు
రిమ్స్‌లో ఓపి, ఐపీ విభాగాల్లో నిర్లక్ష్యం
డాక్టర్ల పర్యవేక్షణ అంతంతమాత్రమే
కొన్ని వార్డులలో వైద్య సేవలు అందిస్తే ‘కాసులు’కురిపించాల్సిందే
ఐపీ, ఓపీ విభాగాల్లో కుక్కల బెడద, దొంగల బెడద షరామామూలే!
కడప అర్బన్: కడపలోని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి (రిమ్స్)లో నిర్లక్ష్యం, అవినీతి, అభద్రతలాంటి అంశాలు ‘అన్నీ’సాధ్యమేననే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొందరు అధికారులు ఔనంటే అవుననీ, కాదంటే కాదనే వ్యవహారం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. రిమ్స్ ఓపి విభాగంలో రోగులను పరీక్షించేందుకు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు, మధ్యాహ్నం 3 గంటల నుంచి 4 గంటల వరకు వైద్యులు తమ దగ్గరికి వచ్చిన రోగులకు వైద్య పరీక్షలు చేసి తగిన వైద్య సహాయం అందించాల్సి ఉంది.
ఈ మధ్య కాలంలో కొన్ని విభాగాల్లో ఆయా విభాగాల హెచ్‌ఓడీలు, అసోసియేట్, అసిస్టెంట్ ప్రొఫెసర్లకు వదిలేస్తే, వారు సీఎస్‌లకు, సీనియర్ రెసిడెంట్‌లకు, పీజీలకు గానీ వారి బాధ్యతలను అప్పగించి ఎంచక్కా తమ అధికారిక పర్యటనలకు, సమీక్షల పేరుతో విధులకు డుమ్మా కొడుతున్నారు. పీజీలు, సీనియర్ రెసిడెంట్‌లలో కొందరు మాత్రం చిత్తశుద్ధితో విధులను నిర్వర్తిస్తే, మరికొందరు మాత్రం ‘ఏముందిలే’అని తమదారిన తాము వెళ్లిపోతున్నారు.
విధులను హౌస్ సర్జన్‌లకు, వైద్య విద్యార్థులకు వదిలేసి వెళుతున్నారు ఒకరిద్దరు డాక్టర్‌లు తమ పనివేళల్లోనే ‘మహిళా ఉద్యోగిని’లను తమ ఛాంబర్‌లోకి పిలిపించుకోవడం, వారితో వెకిలిచేష్టలకు పాల్పడుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. వివిధ ధ్రువీకరణ పత్రాలకోసం వచ్చిన ప్రజల గురించి ఆలోచించకుండానే తాము మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉన్న వైఖరిని గమనిస్తున్న ఉద్యోగులు కూడా విస్తుపోతున్నారు.
● సెంట్రల్‌ల్యాబ్‌లోని కొన్ని విభాగాలలో కొందరు ఉద్యోగులు మాత్రం ల్యాబ్ కోర్సును అభ్యసిస్తున్న విద్యార్థులకు తమ విధులను వదిలేసి తాము ‘సెల్‌ఫోన్’లలో ఇన్‌స్టా, వాట్సాప్‌లను చూసుకుంటూ, లేదంటే ఫోన్ వచ్చిందని పక్కకు జారుకుంటూ రోగులను గంటల తరబడి ఎదురుచూసేలా చేస్తున్నారు. దీనివల్ల రోగులు, వారి సహాయకులు ఇబ్బందులకు గురవుతున్నారు.
● ఓపీ, ఐపీ విభాగాలలో కొందరు డాక్టర్లకు తమ ఛాంబర్లను వదిలి బయటకు వెళ్లేటపుడు తప్పనిసరిగా లైట్, ఫ్యాన్ ‘ఆఫ్’చేసి వెళ్లాలన్న ధ్యాసకూడా ఉండదు. తమపాటికి తాము వెళ్లిపోతే క్రింది స్థాయి సిబ్బంది కూడా ‘లైట్లు’‘ఫ్యాన్’లు తిరుగుతున్నా, వెలుగుతున్నా పట్టించుకోకపోవడం గమనార్హం.
● రోగుల సౌకర్యార్థం 2007–08 సమయంలో పాత రిమ్స్ నుంచి– కొత్త రిమ్స్ వరకు అప్పటి కార్పొరేట్ స్థాయి సంస్థల విరాళంతో నాలుగు బస్సులను ఏర్పాటు చేశారు. ఆసుపత్రి అభివృద్ధి నిధులనుంచి ఆయా బస్సుల నిర్వహణ కోసం డబ్బులను ఖర్చుపెట్టి ‘ఉచితం’గా రోగులను పంపించేవారు. తర్వాత రవాణా సౌకర్యాలు మెరుగుపడటం, ఆటోలు, కార్లు, మోటార్ సైకిళ్లలో ప్రయాణాలు సాగిస్తున్నారు. బస్సులు కాలం చెల్లిపోయాయని మూలన పడేశారు. సూపరింటెండెంట్ వాహనాన్ని ఇటీవలనే పక్కన పెట్టారు. రోగులకు మాత్రం జేబులు చిల్లులు పడుతున్నాయి. సూపరింటెండెంట్‌కు గత ఏడాది నుంచి వాహనాన్ని సమకూర్చారు. కాన్పుల వార్డులో ‘ప్రసవవేదన’తో వచ్చే మహిళల నుంచి కొందరు వారి కాన్పులు, శస్త్రచికిత్సల అనంతరం ఒక్కొక్కరి నుంచి రూ. 1000 నుంచి 2000 వరకు డబ్బులను ముక్కుపిండి వసూలు చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. జిల్లా, ఇతర జిల్లాల నుంచి కడప రిమ్స్‌కు ‘కాన్పుల’కోసం వస్తే ఇక్కడ మాత్రం డబ్బులను వసూలు చేస్తూ పరిపాలన యంత్రాంగానికి ‘చెడ్డపేరు’తీసుకువస్తున్నారు. క్రింది స్థాయిలో పనిచేస్తున్న కొందరు ఉద్యోగులే ఈ చర్యలకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి.
● కొన్ని వైద్య విభాగాలలో రోగులకు వైద్య సేవలను అందించాలంటే ‘నిర్లక్ష్యం’కనిపిస్తోంది. వీల్‌ఛెయిర్స్, స్ట్రక్చర్స్ లేక చాలా సందర్భాల్లో రోగులు ఇబ్బందులు పడుతున్నారు. నడవలేని, నిస్సహాయ స్థితిలో వున్న రోగులను తరలించాలంటే వారి సహాయకులు, బంధువులు చేతులమీదుగా, భుజాల మీదనే తీసుకు రావాల్సి వస్తోంది. దాతలు ఇచ్చిన కొన్ని వీల్‌ఛెయిర్స్‌ను ‘భద్రం’గా దాచిపెట్టుకుంటున్నట్లు సమాచారం. వైద్యంలో భాగంగా ఆపరేషన్లను నిర్వహించిన తర్వాత రోగుల బాగోగులను పట్టించుకునే విషయంలో కొందరు వైద్యులు, వైద్య సిబ్బంది ‘బాధ్యత’గా వ్యవహరించకపోవడం గమనార్హం.
● ఓపిలోని రేడియాలజీ విభాగంలో ‘ఎక్స్‌రే’యూనిట్‌ల విషయానికి వస్తే మొత్తం ఆరు యూనిట్లు ఉండాల్సి ఉండగా వీటిల్లో ఓ యూనిట్ గదిని మూసివేశారు. మిగతా యూనిట్లలో ఉన్న ఎక్స్‌రే పరికరాలన్నీ ‘మొబైల్’ఎక్స్‌రే యంత్రాలే కావడం గమనార్హం. ఎక్స్‌రే ఫిల్మ్‌లు లేకపోవడం, ఎక్స్‌రే తీశాక సంబంధిత డాక్టర్స్ మొబైల్‌ఫోన్‌లకు ఆన్‌లైన్‌లో పంపిస్తున్నారు. అత్యవసరంగా ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సి వచ్చినా, రెఫర్ చేసినా ఇబ్బందులు ‘తప్పవు. ఐపీ విభాగంలో వైద్య సేవలకు వచ్చిన వారిలో ఎక్కువ మందిని ‘ఆరోగ్యశ్రీ’వైద్య సేవలకే ప్రాధాన్యత ఇస్తూ నమోదు చేసి వైద్య సేవలను అందిస్తున్నారు. రోగులకు నమోదు చేసి వార్డులలో అడ్మిట్ చేసే ఉన్న ‘శ్రద్ధ’మళ్లీ డిశ్చార్జ్ అయ్యేవరకు వారికి అందించాల్సిన వైద్య సేవలపై ‘పర్యవేక్షణ లేకపోవడం కొందరి వైద్యుల, వైద్య సిబ్బంది నిర్లక్ష్యవైఖరికి పరాకాష్ట.
Comments
Please login to add a commentAdd a comment