జూనియర్ అసిస్టెంట్ సస్పెన్షన్
కడప కార్పొరేషన్: కడప నగరపాలక సంస్థలోని ఇంజనీరింగ్ విభాగంలో జూనియర్ అసిస్టెంట్‌గా పని చేస్తున్న విష్ణువర్ధన్ రెడ్డిని కమిషనర్ మనోజ్ రెడ్డి సస్పెండ్ చేశారు. ఔట్ సోర్సింగ్ కార్పొరేషన్ లో పనిచేస్తున్న ఉద్యోగుల సర్వీస్ మేటర్స్‌లో లంచం అడిగారనే అభియోగాలపై ఆయనను సస్పెండ్ చేసినట్లు తెలిసింది. నగరపాలక సంస్థలో ఎవరు అవినీతికి పాల్పడిన ఇదే తరహా చర్యలు ఉంటాయని కమిషనర్ హెచ్చరించారు.
మార్చి 8న
జాతీయ లోక్ అదాలత్
కడప అర్బన్: జిల్లా న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో మార్చి 8న జాతీయలోక్ అదాలత్ నిర్వహించనున్నట్లు జిల్లా న్యాయసేవాధికారసంస్థ చైర్మన్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి.శ్రీదేవి, జిల్లా న్యాయసేవాధికారసంస్థ సెక్రటరీ, జడ్జి కె. ప్రత్యూషకుమారి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. పూర్తి వివరాలకు 08562– 258622 ఫోన్ నంబర్లో, ఈ మెయిల్ అడ్రస్:కడప.డికోర్ట్స్.జీవోవి.ఇన్, డీఎల్‌ఎస్‌ఏకేడీపీ అట్‌ది రేటాఫ్ జీమెయిల్‌డాట్‌కాంలలో సంప్రదించాలని పేర్కొన్నారు.
పొలతలలో తాత్కాలిక హుండీ కానుకలు లెక్కింపు
పెండ్లిమర్రి: మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని పొలతల క్షేత్రంలో తాత్కాలికంగా ఏర్పాటు చేసిన హుండీలను గురువారం గండి దేవస్థానం ఈఓ వెంకటసుబ్బయ్య, ఆలయ ఈఓ కృష్ణానాయక్ ఆధ్వర్యంలో లెక్కించారు. ఉత్సవాల మూడు రోజులకు గానూ మల్లేశ్వరస్వామి, పార్వతిదేవి, అక్కదేవతలు, పులిబండెన్న స్వాములవారి వద్ద ఉన్న తాత్కాలిక హుండీలు, లడ్డు ప్రసాదం, సేవా టిక్కెట్లు, తాత్కాలిక దుకాణాలకు రూ.27,01,718 లక్షలు ఆదాయం వచ్చిందన్నారు. కార్యక్రమంలో ఆలయ సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు.
జర్నలిస్టుల అక్రిడిటేషన్ కార్డుల గడువు పొడిగింపు
కడప సెవెన్‌రోడ్స్: జిల్లాలో జర్నలిస్టుల అక్రిడిటేషన్ కార్డుల గడువును మూడు నెలలు పొడిగిస్తున్నట్లు డీఐపీఆర్‌ఓ వేణుగోపాల్‌రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. మార్చి 1 నుంచి మే 31వ తేదీ వరకు పొడగించామన్నారు. ఈ లోపు కొత్త అక్రిడేషన్ కార్డుల జారీ చేపడితే అప్పటి వరకు ఈ పొడగింపు వర్తిస్తుందని పేర్కొన్నారు. జిల్లాలో ఈ నెల 28వ తేదీ నాటికి అక్రిడిటేషన్ కార్డుల వ్యాలిడిటి కలిగి పనిచేస్తున్న పాత్రికేయులకు మాత్రమే పొడగింపు సౌకర్యం ఉంటుందని తెలిపారు. సంబంధిత మీడియా యాజమాన్యం తమ సంస్థల్లో పనిచేస్తున్న, తొలగించిన జర్నలిస్టుల వివరాలను తమకు అందించాలని తెలిపారు.
నేడు జానమద్ది వర్ధంతి
కడప కల్చరల్: సీపీ బ్రౌన్ గ్రంథాలయ నిర్మాత, ప్రముఖ సాహితీవేత్త డాక్టర్ జానమద్ది హనుమచ్ఛాస్త్రి 11వ వర్ధంతిని శుక్రవారం నిర్వహించనున్నారు. యోగి వేమన విశ్వవిద్యాలయం పరిధిలోని సీపీ బ్రౌన్ భాషా పరిశోధన కేంద్రంలో మధ్యాహ్నం 2.30 గంటలకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని ఆ కేంద్రం సంచాలకులు ఆచార్య జి.పార్వతి తెలిపారు. ఈ సందర్భంగా రీజినల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ అధ్యాపకులు ఆచార్య పి.ఆర్. హరినాథ్ (మైసూరు) ’తెలుగు పద్య వైభవం – శబ్ద సౌందర్యం’ అనే అంశంపై స్మారకోపన్యాసం చేస్తారని తెలిపారు. ముఖ్య అతిథిగా వైవీయూ వైస్‌ఛాన్సలర్ ఆచార్య ఫణితిప్రకాష్ బాబు హాజరుకానున్నట్లు తెలిపారు. సభాధ్యక్షులుగా యోగి వేమన విశ్వవిద్యాలయ కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య ఎస్.రఘునాథరెడ్డి, విశిష్ట అతిథిగా వైవీయూ ఇన్‌ఛార్జ్ రిజిస్ట్రార్ ఆచార్య పి.పద్మ, గౌరవ అతిథిగా బ్రౌన్ భాషా పరిశోధన కేంద్రం సలహామండలి సభ్యులు జానమద్ది విజయభాస్కర్ పాల్గొంటారని తెలిపారు.
25వ రోజుకు
పశువైద్య విద్యార్థుల దీక్ష
ప్రొద్దుటూరు రూరల్: మండల పరిధి గోపవరం గ్రామ సమీపంలోని పశువైద్య కళాశాల విద్యార్థులు స్టైఫండ్ పెంచాలని చేస్తున్న దీక్షలు గురువారం నాటికి 25వ రోజుకు చేరుకున్నాయి. ఎంబీబీఎస్ మెడికల్ విద్యార్థులతో సమానంగా తమకు స్టైఫండ్ పెంచాలని పశువైద్య విద్యార్థులు నినాదాలు చేశారు. 25 రోజులుగా తాము దీక్షలు చేస్తున్నా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని మండిపడ్డారు. స్టైఫండ్ పెంపు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించాలని కోరారు.
జూనియర్ అసిస్టెంట్ సస్పెన్షన్
Comments
Please login to add a commentAdd a comment