కడప అర్బన్: పోలీసు సిబ్బంది సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని జిల్లా ఎస్పీ ఈజీ అశోక్‌కుమార్ తెలిపారు. జిల్లా పోలీసు కార్యాలయంలో శుక్రవారం పోలీసు ‘గ్రీవియన్స్‌డే’ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాలోని వివిధ పోలీసు స్టేషన్‌లు, ఆయా విభాగాలలో విధులు నిర్వర్తిస్తున్న పోలీసు సిబ్బంది బదిలీలు, వ్యక్తిగత, స్పౌస్, చిల్డ్రన్స్ మెడికల్ సమస్యల గురించి ఎస్పీకి విన్నవించుకున్నారు. వారి నుంచి ఆయన వినతిపత్రాలు స్వీకరించారు.
సైన్స్‌తోనే సమాజ, దేశాభివృద్ధి
కడప ఎడ్యుకేషన్: సైన్స్‌తోనే సమాజ, దేశా భివృద్ధి సాధ్యమని జిల్లా విద్యాశాఖ అధికారి డాక్టర్ షేక్ షంషుద్దీన్ అన్నారు. శుక్రవారం జాతీయ సైన్సు దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాస్త్ర సాంకేతిక మండలి(ఆప్ కాస్టు) ఆధ్వర్యంలో కడప మున్సిపల్ హైస్కూల్ (మెయిన్)లో సైన్సు ఎగ్జిబిషన్ నిర్వహించి విద్యార్థులకు వివిధ రకాల పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా సైన్స్ మ్యూజియం క్యూరేటర్ రెహమాన్, ఆప్‌కాస్టు జిల్లా కో ఆర్డినేటర్ శ్రీనివాసులరెడ్డి, ప్రధానోపాధ్యాయురాలు నాగమణి పాల్గొన్నారు.
గాంధీనగర్ హైస్కూల్‌లో..
కడపలోని గాంధీనగర్ హైస్కూల్‌లో వికసిత్ భారత్ కోసం సైన్స్, ఆవిష్కరణలో ప్రపంచ నాయకత్వం– భారతీయ యువతకు సాధకారత అనే అంశంపై స్కూల్‌ఎడ్యుకేషన్ డిపార్ట్‌మెంట్, సమగ్రశిక్ష సంయుక్తంగా జిల్లా స్థాయి క్విజ్ పోటీలు నిర్వహించారు. ప్రతిభ చాటిన విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో డీఈఓ డాక్టర్ షంషుద్దీన్, డిప్యూటీ డీఈఓ రాజగోపాల్‌రెడ్డి పాల్గొన్నారు.
ఒంటిమిట్ట సాక్షి విలేకరిపై దాడి
సాక్షి, టాస్క్‌ఫోర్స్: ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన ఒంటిమిట్ట కోదండ రామస్వామి ఆలయంలో జీర్ణోద్ధరణ అభివృద్ధి పనులు జరుగుతున్న నేపథ్యంలో ఫొటోలు తీసేందుకు వెళ్లిన ఒంటిమిట్ట మండల సాక్షి రిపోర్టర్ వెంకటకృష్ణపై పురావస్తు శాఖ కాంట్రాక్టర్ కృష్ణమూర్తి దాడికి పాల్పడ్డాడు. వివరాలు ఇలా ఉన్నాయి. శుక్రవారం ఆలయంలో టీటీడీ ఆధ్వర్యంలో జరుగుతున్న ఆలయ జీర్ణోద్ధరణ పనుల ఫొటోలు తీసేందుకు వెంకటకృష్ణ వెళ్లగా అడ్డుకున్న పురావస్తు శాఖ కాంట్రాక్టర్ కృష్ణమూర్తి ఎలా ఫొటోలను చిత్రీకరిస్తున్నావ్ అంటూ బెదిరించడమే కాక దుర్భాషలాడారు. అలానే విలేకరిని చొక్కా పట్టుకొని బయటికి గెంటివేశాడు. విషయం తెలుసుకున్న పాత్రికేయులు సంఘటనపై ఫిర్యాదు చేసేందుకు పోలీసు స్టేషన్‌కు చేరుకోగా ఒంటిమిట్ట సీఐ బాబు విలేకరులను అరగంటకు పైగా నిరీక్షింపజేశారు. ఓపిక నశించిన పాత్రికేయుల బృందం సీఐ చాంబర్‌కు వెళ్లి ఘటనను వివరించిన స్పందన లేదని పాత్రికేయులు వాపోయారు. అంతకుముందు ఎస్‌ఐ శివప్రసాద్‌కు పాత్రికేయుల బృందం ఫిర్యాదు చేసింది.
సాక్షి పాత్రికేయుడిపై దాడి తగదు
కడప కోటిరెడ్డిసర్కిల్: సాక్షి దినపత్రిక ఒంటిమిట్ట కంట్రిబ్యూటర్‌గా పని చేస్తున్న వెంకటకృష్ణపై దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర కార్యదర్శి రామసుబ్బారెడ్డి, జిల్లా అధ్యక్ష, ఉపాధ్యక్షులు ఎం.బాలకృష్ణారెడ్డి, శ్రీనివాసులు తెలిపారు. దాడి చేసిన వ్యక్తిపై తక్షణమే చట్టపరమైన చర్యలు చేపట్టి భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా చూడాలని వారు కోరారు.
Comments
Please login to add a commentAdd a comment