విజయీభవ | - | Sakshi
Sakshi News home page

విజయీభవ

Published Sat, Mar 1 2025 8:43 AM | Last Updated on Sat, Mar 1 2025 8:38 AM

విజయీ

విజయీభవ

నేటి నుంచి ఇంటర్‌ పరీక్షలు

ఏర్పాట్లు సర్వం సిద్ధం

నిఘా నీడలో నిర్వహణ

కేంద్రాల వద్ద బందోబస్తు

కడప ఎడ్యుకేషన్‌: ఇంటర్మీడియెట్‌ పబ్లిక్‌ పరీక్షలకు సర్వం సిద్ధమైంది. నేటి నుంచి ప్రారంభం కానున్న థియరీ పరీక్షలకు ఇంటర్మీడియెట్‌ బోర్డు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. శనివారం ప్రథమ సంవత్సర విద్యార్థులకు పరీక్షలు మొదలు కానున్నాయి. ప్రతి రోజు ఉదయం 9 నుంచి 12 గంటల వరకు జరగనున్నాయి. విద్యార్థులు ఉదయం 8.30 గంటలకే పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలి. 9 గంటలు దాటిన తరువాత ఒక్కరిని కూడా కేంద్రంలోకి అనుమతించబోమని ఇంటర్‌ అధికారులు స్పష్టం చేశారు. అలాగే పరీక్ష విధులకు హాజరయ్యే సిబ్బంది ఎవరు కూడా కేంద్రాల్లోకి సెల్‌ఫోన్‌ తీసుకురాకూడదని ఇంటర్‌బోర్డు ఆదేశించింది. పరీక్షా కేంద్రంలో ఒక చీఫ్‌ సూపరిండెంటెంట్‌ మాత్రమే సమాచారం తెలిపేందుకు బటన్‌ ఫోన్‌ను అనుమతించారు. అది కూడా సమాచారం పంపగానే పరీక్షా కేంద్రం ఆఫీసు రూములో పెట్టాల్సి ఉంటుంది.

కేంద్రాలకు చేరిన సామగ్రి

● పరీక్షలకు సంబంధించిన సామగ్రి పోలీసు పహారాలో స్టోరేజ్‌ పాయింట్లకు చేరవేశారు. అలాగే పరీక్ష కేంద్రాలకు ఆన్సర్‌ బుక్‌లెట్స్‌, ఓఎంఆర్‌ సీట్లు, ఇతర సామగ్రి అధికారులు చేరవేశారు.

● పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్‌తోపాటు పోలీసు బందోబస్తు కల్పించనున్నారు. అలాగే మెడికల్‌ సిబ్బందితో ప్రాథమిక చికిత్స సేవలు అందుబాటులో ఉంచుతున్నారు.

● పరీక్షా కేంద్రాల్లో 950 సీసీ కెమెరాలతో నిఘా పెట్టారు. వాటిని ఇంటర్‌బోర్డు, జిల్లా ఆర్‌ఐఓ కార్యాలయానికి స్ట్రీమింగ్‌ ద్వారా అనుసంధానం చేశారు.

● బస్సు సౌకర్యం ఉన్న విద్యార్థులు తమ హాల్‌టికెట్‌ను చూపి ఉచితంగా బస్సు ప్రయాణం చేసేలా ప్రభుత్వం ఆదేశాలను జారీ చేసింది. ఇందుకోసం ఆర్టీసీ పలు రూట్లకు ప్రత్యేక బస్సు సర్వీసులు నడుపుతోంది.

● పరీక్షా కేంద్రాల పరిసరాల్లో ఎక్కడా జిరాక్స్‌ సెంటర్లు ఓపెన్‌లో లేకుండా మూసి వేస్తారు. అలాగే పరీక్షా కేంద్రాలలో ఎక్కడ కూడా నేల బారు రాతలకు లేకుండా అధికారులు అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. దీంతోపాటు పరీక్షా కేంద్రాలలో నిరంతర విద్యుత్తు, ఫ్యాన్లు, లైటింట్‌, తాగునీరు, మరుగుగొడ్ల సౌకర్యం కల్పించనున్నారు.

● సెల్‌ఫోన్లు, క్యాలిక్యులేటర్లు, బ్లూటూత్‌, డిజిటల్‌ వాచ్‌లు వంటి ఎలక్ట్రానిక్‌ పరికరాలు అనుమతించరు.

13 సమస్యాత్మక కేంద్రాలు గుర్తింపు

జిల్లాలో 13 పరీక్షా కేంద్రాలను సమస్యాత్మక కేంద్రాలుగా గుర్తించారు. సంబంధిత పరీక్షా కేంద్రాలలో సిట్టింగ్‌ స్క్వాడ్‌ను ఏర్పాటు చేశారు. ఇందులో గండిలోని ఏపీఎస్‌డబ్లూఆర్‌ జూనియర్‌ కళాశాల, దువ్వూరు, ముద్దనూరు, ఖాజీపేట, లింగాల, ఎర్రగుంట్ల, తొండూరు, సింహాద్రిపు రం ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలతోపాటు బి.మఠం ఏపీఎస్‌డబ్లూఆర్‌ జూనియర్‌ కళాశాల, కమలాపురం సోషల్‌ వెల్ఫేర్‌ స్కూల్స్‌, వేముల, చక్రాయపేట, కొండాపురం ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలను సమస్యాత్మక కేంద్రాలుగా గుర్తించారు.

టోల్‌ ఫ్రీ నంబర్‌ ఏర్పాటు

పరీక్షా కేంద్రాలలో విద్యార్థులకు ఏవైనా సమస్యలంటే ఫిర్యాదు చేసేందుకు అనువుగా కడప ఆర్‌ఐవో కార్యాలయంలో కంట్రోల్‌ రూం ఏర్పాటు చేశారు. విద్యార్థులకు ఏవైనా సమస్యలుంటే ఈ కంట్రోల్‌ రూములో ఏర్పాటు చేసిన 08562–244171 నంబర్‌కు ఫోన్‌ చేసి ఫిర్యాదు చేయవచ్చు. తక్షణం సమస్యకు పరిష్కారం దొరుకుతుంది.

జిల్లాలో 64 పరీక్షా కేంద్రాలు

జిల్లాలో 64 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. ప్రథమ సంవత్సరం విద్యార్థులు 17114 మంది ఉన్నారు. వీరిలో జనరల్‌ 15781, ఒకేషనల్‌ 1333 మంది ఉన్నారు. ద్వితీయ సంవత్సర విద్యార్థులు 15771 మంది ఉన్నారు. వీరిలో ఒనరల్‌ 14598, ఒకేషనల్‌ 1182 మంది ఉన్నారు. మొత్తం 32885 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. వీటి నిర్వహణ కోసం 700 మంది ఇన్విజిలేటర్లను ఏర్పాటు చేశారు. 64 చీఫ్‌ సూపరింటెండెంట్లు, 64 మంది డిపార్ట్‌మెంట్‌ అధికారులతోపాటు 3 ఫ్లయింగ్‌ స్క్వాడ్‌, 10 సిట్టింగ్‌ స్క్వాడ్‌ బృందాలు పర్యవేక్షించనున్నారు.

పక్కాగా నిర్వహణ

జిల్లా వ్యాప్తంగా శనివారం నుంచి మొదలు కానున్న ఇంటర్‌ పరీక్షలకు పక్కాగా ఏర్పాట్లు చేశాం. ఎక్కడ కూడా నేలబారు పరీక్షలు లేకుండా అన్ని ఏర్పాట్లు సిద్ధం చేశాం. ఇంటర్‌ పరీక్షలకు సంబంధించి సెల్‌ఫోన్స్‌ ద్వారా వచ్చే వదంతులను తల్లిదండ్రులు ఎవరూ నమ్మవద్దు.

– బండి వెంకటసుబ్బయ్య,

ఆర్‌ఐవో, ఇంటర్‌ విద్య

No comments yet. Be the first to comment!
Add a comment
విజయీభవ1
1/1

విజయీభవ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement