కడప కల్చరల్: పవిత్ర రంజాన్ మాసం చివరి ఘట్టానికి చేరుకుంది. ఈ మాసాన్ని మూడు భాగాలు విభజిస్తారు. ఇందులో మొదటి పది రోజులు అల్లాహ్ కరుణ కోసం ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తే...రెండవ పది రోజుల్లో తమ తప్పులను క్షమించాలని ప్రార్థిస్తారు. ఇక మూడవదైన ముఖ్యమైన చివరి పదిరోజులు కొంచెం భిన్నమైనవిగా భావిస్తారు. నరకం నుంచి బయట పడేయాలని అల్లాహ్‌ను శరుణు కోరుకునేందుకు ఈ పదిరోజులను ప్రత్యేకమైనవిగా భావిస్తారు.
పుణ్యాల కోసం..
రంజాన్‌మాస చివరి పది రోజుల్లో పవిత్ర బడీరాత్ కూడా ఉంటుంది. దీన్నే షబ్ ఏ ఖదర్ లేదా లైలతుల్ ఖద్ర్ అనికూడా అంటారు. ఈ పవిత్ర రాత్రి చివరి పది రోజుల్లో బేసి రాత్రుల్లో ఉంటుందన్న నమ్మకంతో ముస్లింలు తాఖ్ రాత్‌గా నిర్వహిస్తారు. మరీ ముఖ్యంగా 27వ రోజు రాత్రే లైలతుల్ ఖద్ర్ ఉంటుందని భక్తుల విశ్వాసం. లైలతుల్ ఖద్ర్ రాత్రి జాగరణ చేసి ప్రార్థనలు చేయడంతో వెయ్యి నెలలపాటు ఉపవాస దీక్షలు చేసినంత ఫలం లభిస్తుందని పెద్దలు పేర్కొంటున్నారు. ప్రజల పాపాలను క్షమించాలని కోరుతూ మహమ్మద్ ప్రవక్త ప్రార్థించారని పవిత్ర ఖురాన్ గ్రంథంలో ఉండడంతో ముస్లింలు జాగరణ చేసి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తారు.
నేటి నుంచి పవిత్ర తాఖ్ రాత్రులు
పవిత్ర రంజాన్ మాసంలో అత్యంత ముఖ్యమైనవిగా, అధిక పుణ్యాన్ని ఇచ్చే తాఖ్ రాత్‌లు శుక్రవారం నుంచి ప్రారంభం కానున్నాయి. కడప నగరంలోని పలు మసీదులలో నిర్వాహకులు ఇందుకు సంబంధించి ఏర్పాట్లు చేశారు. అందులో భాగంగా దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన ప్రముఖ ఆధ్యాత్మిక వక్తలు, గురువులు తాఖ్ రాత్‌లలో అల్లాహ్ సందేశాన్ని అందజేసేందుకు రానున్నారు. శుక్రవారం రాత్రి 11.30 గంటల నుంచి మొదటి తాఖ్ రాత్‌ను ఆచరించనున్నారు. ఆ తర్వాత రోజు విడిచి అంటే ఈనెల 23, 25, 27, 29 తేదీలలో తాఖ్‌రాత్‌లను ఆచరిస్తారు. ఈ సందర్భంగా ఐదు రోజులపాటు తరావీ నమాజు అనంతరం పవిత్ర ఖురాన్ పఠనంతోపాటు సామూహికంగా జిక్ర్‌ను చేయించనున్నారు. అలాగే తహజూద్ ప్రార్థనలకు విశేష ఏర్పాట్లు చేశారు. ప్రార్థనల అనంతరం ఐదు రోజులపాటు ఉపవాస దీక్ష చేపట్టే వారికి సెహరి సౌకర్యం కల్పించనున్నారు. దీంతోపాటు శుక్రవారం నాటి ముస్లిం భక్తులు మసీదులలో ఎత్తేకాఫ్ (తపోనిష్ట) దీక్షలు పాటించడం జరుగుతుంది. వీరు రోజంతా పూర్తిగా ఇతర విషయాల జోలికి వెళ్లకుండా కేవలం ఆధ్యాత్మిక చింతనతో గడుపుతారు. రంజాన్ పండుగ నిర్వహణకు సూచనగా నెలవంక కనిపించిన తర్వాతనే వారు దీక్ష విరమిస్తారు.
నేటి నుంచి తాఖ్ రాత్రులు
ప్రత్యేక ఏర్పాట్లలో మసీదు నిర్వాహకులు
బగ్దాదియా మసీదులో తాఖ్‌రాత్ ప్రార్థనలు
నగరంలోని షాహీపేటలోగల బగ్దాదియా మసీదులో తాఖ్ రాత్ నిర్వహణకు ఏర్పాట్లు చేశామని హజరత్ మహమ్మద్ అలీ బగ్దాది సాహెబ్ తెలిపారు. ఇందులో భాగంగా మొదటి తాఖ్ రాత్ అయిన ఈనెల 21న పామిడికి చెందిన హజరత్ ఫజులర్ రెహ్మాన్ సాహెబ్, ఖలీలుల్లా సాహెబ్, అబ్దుల్ రహీం బగ్దాది సాహెబ్ ఆధ్యాత్మిక సందేశాన్ని అందజేయనున్నారు. 22న నగరానికి చెందిన ప్రముఖ ఆధ్యాత్మికవేత్తలు హజరత్ మహమ్మద్ బగ్దాది సాహెబ్, అక్మల్‌పీరాన్ సాహెబ్, అమీనుద్దీన్ సాహెబ్‌లు దైవ సందేశం అందజేయనున్నారు. 25న అబ్దుర్ రెహ్మాన్ బగ్దాది సాహెబ్, ఖలీలుల్లా సాహెబ్, 27న మహమ్మద్ వలీవుల్లా సాహెబ్, బిలాల్ అహ్మద్ సాహెబ్, మోహసిన్‌బేగ్ సాహెబ్, 29న మహమ్మద్ అలీ బగ్దాది సాహెబ్, మహమ్మద్ అహ్మద్ అష్రఫీ సాహెబ్, అబ్దుల్ ఖదీర్ జిలానీ సాహెబ్‌లు పాల్గొని పవిత్ర రంజాన్ విశిష్ఠత, మహమ్మద్ ప్రవక్త సూచనలు తెలియజేయనున్నారు.
శుభాల రేయి ఘడియలు షురూ!
శుభాల రేయి ఘడియలు షురూ!