రైల్వేకోడూరు అర్బన్: రైల్వేకోడూరులో ఈనెల 23వ తేదీన జరగాల్సిన మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పర్యటన రద్దయింది. ఈ విషయాన్ని వైస్ ఎంపీపీ రామిరెడ్డి ధ్వజారెడ్డి శుక్రవారం పేర్కొన్నారు. మళ్లీ పర్యటన ఎప్పుడు ఉంటుందో త్వరలో తెలియజేస్తామన్నారు.
హుండీ ఆదాయం లెక్కింపు
ఒంటిమిట్ట: ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయ హుండీ ఆదాయాన్ని శుక్రవారం ఆలయ టీటీడీ అధికారులు లెక్కించారు.నెలరోజులకు రూ.4,55,140 ఆదాయం వచ్చినట్లు అధికారులు వెల్లడించారు.
ప్రశాంతంగా పది పరీక్ష
కడప ఎడ్యుకేషన్: జిల్లావ్యాప్తంగా శుక్రవారం నిర్వహించిన పదో తరగతి ఇంగ్లిష్ పరీక్ష ప్రశాంతంగా జరిగింది. జిల్లాలో 161 సెంటర్స్‌లో రెగ్యులర్‌కు సంబంధించి 27924 మంది విద్యార్థులకుగాను 27786 మంది హాజరుకాగా 138 మంది గైర్హాజయ్యారు. అలాగే ప్రైవేటు విద్యార్థులకు 13 మందికిగాను 10 మంది హాజరుకాగా ముగ్గురు గైర్హారయ్యారు. జిల్లా విద్యాశాఖ అధికారి షంషుద్దీన్ మూడు పరీక్షా కేంద్రాలను తనిఖీ చేయగా 13 మంది ప్‌లైయింగ్ స్క్వాడ్ బృందాలు 90 పరీక్షా కేంద్రాలను తనిఖీ చేశారు.
ఏకగ్రీవ ఎన్నిక
రాజంపేట: రాజంపేట బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా సీనియర్ న్యాయవాది పచ్చా హనుమంతునాయుడు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈమేరకు ఎన్నికల సీఈవో సురేష్‌కుమార్, సహాయ ఎన్నికల అధికారి గోవర్ధన్‌రెడ్డి శుక్రవారం ధ్రు వీకరణపత్రాన్ని అందచేశారు. బార్ అసోసియేషన్ ప్రధానకార్యదర్శిగా జాఫర్‌బాషా ఎన్నికయ్యారు. కార్యక్రమంలో బార్‌అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు కొండూరు శరత్‌కుమార్‌రాజు, న్యాయవాదులు నాసరుద్దీన్, గడికోట రామచంద్రయ్య, రామచంద్రరాజు, నలికిరిరెడ్డయ్య పాల్గొన్నారు.
బాధ్యతల స్వీకరణ
కడప ఎడ్యుకేషన్: యోగివేమన విశ్వ విద్యాలయాన్ని అందరి సహకారంతో అత్యున్నత విద్యాసంస్థగా తీర్చిదిద్దుతామని ఆచార్య ఆల్లం శ్రీనివాసులు పేర్కొన్నారు. నెల్లూరు విక్రం సింహపురి విశ్వవిద్యాలయం ఉపకులపతిగా పనిచేస్తున్న ఆయన వైవీయూ ఇన్ఛార్జీ వీసీగా శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా విశ్వవిద్యాలయ ఆచార్యులు ఆయనకు అభినందనలు తెలిపారు. అనంతరం ఆయన విశ్వవిద్యాలయ పాలకమండలి సభ్యులతో భేటీ అయ్యారు.
డ్రైవర్లతోనే సంస్థ పురోభివృద్ధి
కడప కోటిరెడ్డిసర్కిల్: డ్రైవర్ల కారణంగానే ఏపీఎస్ ఆర్టీసీ సంస్థ పురోభివృద్ధిలో పయనించగలదని జిల్లా ప్రజా రవాణాధికారి పొలిమేర గోపాల్‌రెడ్డి పిలుపునిచ్చారు. శుక్రవారం స్థానిక డీపీటీఓ కార్యాలయంలో ప్రమాదాలు చేసిన డ్రైవర్లకు శిక్షణ ఇచ్చారు. తొలుత ఓం శాంతి ఈశ్వరీయ విశ్వవిద్యాలయంకు చెందిన అక్కయ్యలు మానసిక ప్రశాంతత కోసం యోగా, ధ్యానం ప్రక్రియలు నిర్వహించారు. ఈ సందర్బంగా గోపాల్‌రెడ్డి మాట్లాడుతూ ఏపీఎస్‌ఆర్టీసీకి ప్రమాద రహిత సంస్థగా గుర్తింపు ఉందన్నారు. ఆ గుర్తింపును అలాగే కొనసాగించేందుకు డ్రైవర్లు ప్రధానపాత్ర పోషించాలన్నారు. ప్రయాణీకులను క్షేమకరంగా సకాలంలో గమ్యస్థానాలకు చేర్చాల్సిన బాధ్యత డ్రైవర్లపై ఉందన్నారు. అనంతరం కడప డిపో మేనేజర్ డిల్లీశ్వరరావు డ్రైవర్లకు సేఫ్టీ డ్రైవింగ్ పై సూచనలు సలహాలు ఇచ్చారు. అలాగే బ్లాక్ స్పాట్ పై డ్రైవర్లకు అవగాహన కల్పించారు.
వైఎస్ జగన్ పర్యటన రద్దు
వైఎస్ జగన్ పర్యటన రద్దు