రాజంపేట: ఒంటిమిట్ట కోదండరామస్వామి బ్రహ్మోత్సవాలకు జిల్లా విభజనసెగ వెంటాడుతోంది.అన్నమయ్య జిల్లా రాజంపేట నియోజకవర్గం ఒంటిమిట్టలోని కోదండరామాలయం వైఎస్సార్‌జిల్లాలో ఉన్న తరుణంలో అన్నమయ్య జిల్లా పరంగా తిరుమల తిరుపతి దేవస్ధానం(టీటీడీ) చిన్నచూపు చూస్తోందన్న విమర్శలు ఉన్నాయి.పేరుకే రాజంపేట నియోజకవర్గం అని, బ్రహ్మోత్సవాల్లో వైఎస్సార్ జిల్లా యంత్రాంగానికి టీటీడీ పెద్దపీట వేస్తోందని ఇక్కడి వారి భావన. వైఎస్సార్ జిల్లా కలెక్టర్, ఎస్పీతోపాటు అన్నమయ్య జిల్లా కలెక్టర్, ఎస్పీని భాగస్వాములను చేయకుండా టీటీడీ వ్యవహరిస్తున్న తీరుపై జిల్లా వాసులు పెదవి విరుస్తున్నారు.
టీటీడీలో విలీనం కాకముందునుంచి..
ఒంటిమిట్ట కోదండరామాలయం టీటీడీలో విలీనం కాకముందు నుంచి బ్రహ్మోత్సవాలను రాజంపేట నియోజకవర్గ యంత్రాంగమే విజయవంతంగా నిర్వహిస్తోంది. కొత్త జిల్లా ఏర్పాటు క్రమంలో నందలూరు ఒంటిమిట్ట మండలాలు వైఎస్సార్ జిల్లాలో విలీనమయ్యాయి.దీంతో టీటీడీ కూడా తన దిశను మార్చుకుందన్న అపవాదును మూటకట్టుకుంది. స్థానికులతో పాటు రాజంపేట నియోజకవర్గంలోని ఆరుమండలాల ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులకు బ్రహ్మోత్సవాల్లో చోటు లేకుండా చేశారు. ఉభయ వైఎస్సార్ జిల్లాకు చెందిన వారి భాగస్వామ్యంతో చేస్తే ఎలాంటి బేధాభిప్రాయాలు రావన్న వాదన బలంగా వినిపిస్తోంది. రాములోరి కల్యాణోత్సవం సమయంలో పాసులు, ఇతర అనుమతులు విషయంలో అన్నమయ్య జిల్లాకు టీటీడీ మొండిచెయ్యి చూపిస్తోంది. ఇది సరైన విధానం కాదని, రామాలయం మాది.. పెత్తనం వారిదా అన్న అభిప్రాయం అధికారులు, భక్తులలో కూడా వ్యక్తమవుతోంది. ఇప్పటికైనా టీటీడీ ఒంటిమిట్ట రామాలయం ఉత్సవాల నిర్వహణ విషయంలో వైఎస్సార్, అన్నమయ్య జిల్లాలకు సమాన ప్రాధాన్యత ఇవ్వాలని భక్తులు కోరుతున్నారు. ఏప్రిల్ 6 నుంచి 14 వరకు జరిగే శ్రీ కోదంరామస్వామి బ్రహ్మోత్సవాల నిర్వహణలో లా అండ్ అర్డర్ పగ్గాలు కడప పోలీసులకే టీటీడీ , ప్రభుత్వం అప్పగిస్తోంది. ఉభయ వైఎస్సార్ జిల్లాలకు ఒంటిమిట్ట రామాలయం ప్రధానమైనప్పటికీ లా అండ్ ఆర్డర్ విషయంలో అన్నమయ్య జిల్లా ఖాకీ పెద్దల భాగస్వామ్యం ఉండకపోవడం గమనార్హం. టీటీడీ కడప పోలీసువ్యవస్ధకే ప్రాధాన్యత ఇవ్వడంపై జిల్లా పోలీసువర్గాలు అసంతృప్తి వ్యక్తంచేస్తున్నాయి.
పేరుకే రాజంపేట నియోజకవర్గం
రామయ్య బ్రహ్మోత్సవాల్లో వైఎస్సార్ జిల్లా యంత్రాగానికి పెద్దపీట
ఈసారైనా టీటీడీ తన వైఖరి మార్చుకోవాలంటున్న రాజంపేట వాసులు
జిల్లా యంత్రాంగానికి భాగస్వామ్యం కల్పించాలి
ఒంటిమిట్ట కోదండరామస్వామి బ్రహ్మోత్సవాల్లో టీటీడీ అన్నమయ్య జిల్లాపై చిన్నచూపు చూపుతోంది. రాములోరి కల్యాణోత్సవంలో అన్నమయ్య జిల్లా యంత్రాంగానికి భాగస్వామ్యం కల్పించాలి. ఆలయం రాజంపేట నియోజకవర్గంలో ఉంటే, ఉత్సవాల నిర్వహణ విషయంలో జిల్లాకు ప్రాధాన్యం ఇవ్వకపోవడం సరికాదు. – కెఎంఎల్ నరసింహా, కన్వీనర్,
ఆల్ ఇండియానేషనల్ బీసీ ఫ్రంట్
పూర్వ సంప్రదాయాన్ని
కొనసాగించాలి
పూర్వం నుంచి ఒంటిమిట్ట కోదండ రాముని బ్రహ్మోత్సవాల్లో రాజంపేటకు చోటు కల్పించేవారు. ప్రస్తుతం వైఎస్సార్ జిల్లా యంత్రాంగానికి కల్యాణోత్సవం నిర్వహణ బాధ్యతలు అప్పగించింది. స్థానికులనే పదం లేకుండా చేయడం సరికాదు. ఈ సారి జరిగే కల్యాణోత్సవంలో పూర్వ సంప్రదాయాన్ని టీటీడీ కొనసాగించాలి.
– మర్రి కళ్యాణ్, ఎన్‌ఆర్‌ఐ, రాజంపేట
అన్నమయ్యపై టీటీడీ చిన్నచూపు!
అన్నమయ్యపై టీటీడీ చిన్నచూపు!
అన్నమయ్యపై టీటీడీ చిన్నచూపు!