కడప కార్పొరేషన్: మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలో ఇళ్ల నిర్మాణం చేసే వారికి 24 గంటల్లోపే ప్లాన్ అప్రూవల్స్ ఇస్తామని టౌన్‌ప్లానింగ్ ఆర్‌డీడీ టి.విజయ్ భాస్కర్ అన్నారు. బుధవారం నగరపాలక సంస్థ కార్యాలయంలో పుర, నగరపాలక సంస్థ పరిధిలో చేపట్టే భవన నిర్మాణాలకు ప్రభుత్వం జారీ చేసిన నూతన ఉత్తర్వులపై వైఎస్సార్ కడప జిల్లా, అన్నమయ్య జిల్లా ఎల్‌టీపీ, ప్రణాళిక సిబ్బందికి అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా భవన నిర్మాణ రంగంలో నిబంధనలను సరళీకరిస్తూ రాష్ట్ర పురపాలక శాఖ జీవో జారీ చేసిందని తెలిపారు. ఈ నిబంధనల ప్రకారం భవన నిర్మాణాలు చేపట్టేవారు స్వీయ ధ్రువీకరణతో ఎల్టీపీల ద్వారా 24 గంటల్లోపే ప్లాన్ అప్రూవల్ పొందవచ్చన్నారు. ప్రణాళికా సిబ్బంది భవన నిర్మాణ కార్యక్రమాలను పర్యవేక్షిస్తారని చెప్పారు. 300 చదరపు మీటర్ల లోపు భవనాలకు యజమానులే ప్లాన్ ధ్రువీకరించి దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ఆర్కిటెక్చర్లు, ఇంజినీర్లు, టౌన్ ప్లానర్లు కూడా దరఖాస్తు చేసుకునే అవకాశం ఉందని తెలిపారు. లేఅవుట్ కు తప్పకుండా అనుమతులు ఉండాలన్నారు. సెల్ఫ్ సర్టిఫికేషన్ స్కీం క్రింద భవన నిర్మాణ అనుమతులను అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ జారీ చేస్తూ ఉండేదని, ఇకపై పట్టణ స్థానిక సంస్థలు జారీ చేస్తాయని తెలిపారు. ’కుడా’పీఓ శైలజ, అన్నమయ్య పీఓ సంధ్య, సీపీ రమణ, ఏసీపీలు మునిరత్నం, మునిలక్ష్మి, టీపీఓ రత్నరాజు, టౌన్ ప్లానింగ్, వార్డ్ ప్లానింగ్ సెక్రటరీలు, ఎల్‌టీపీలు పాల్గొన్నారు.