జమ్మలమడుగు : ‘దాల్మియా ప్రజాభిప్రాయ సేకరణలో భాగంగా రైతుల సమస్యలు, బాధలు కలెక్టర్ స్వయంగా విన్నారు. అయితే విస్తరణ పనుల వల్ల గ్రామాలకు ఎటువంటి సమస్యలు ఉన్నాయని ప్రశ్నిస్తే దాల్మియా యాజమాన్యం మాత్రం ఎటువంటి సమస్యలు లేవంటూ దరఖాస్తులో తప్పుడు నివేదిక ఇచ్చిందని.. ఈ కారణం చూపుతూ కలెక్టర్ శ్రీధర్ చెరకూరి దాల్మియా పరిశ్రమ విస్తరణ కోసం పెట్టుకున్న దరఖాస్తును వెంటనే తిరస్కరించాలి’ అని ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి డిమాండ్ చేశారు. శుక్రవారం స్థానిక పార్టీ కార్యాలయంలో విలేకరులతో ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి మాట్లాడారు. ప్రజాభిప్రాయ సేకరణ బాధిత గ్రామాల్లో కాకుండా దాల్మియా ఫ్యాక్టరీలో నిర్వహించడం ఏమిటని ప్రశ్నించారు. అధికారులు దాల్మియా యాజమాన్యంతో లాలూచి పడి ప్రజాభిప్రాయ సేకరణ చేయడం ప్రజలను మోసం చేయడమే అవుతుందన్నారు. నిజంగా దాల్మియా విస్తరణ పనులు చేపట్టాలంటే మొదటి దశలో నిర్మించిన దాల్మియా ఫ్యాక్టరీ వల్ల ఇబ్బందులు పడుతున్న దుగ్గనపల్లి, నవాబుపేట, చిన్నకొమెర్ల, తలమంచిపట్నం గ్రామాల సమస్యలను పూర్తిగా పరిష్కారం చూపించాలన్నారు. దాదాపు 400 ఎకరాల భూమి ప్రతి ఏడాది వరదల వల్ల నాశనం అవుతుందని.. అసలు వ్యవసాయానికి పనికిరాకుండా పోయిందని రైతులు కలెక్టర్ ముందు ఫోటోలతో సహా వివరించారు. అయితే కలెక్టర్ నుంచి ఎటువంటి సమాధానం రాలేదన్నారు. రైతులకు సంబంధించిన భూములకు పరిహారం ఇస్తామన్న మాట ఎక్కడా పలుకలేదన్నారు. బుధవారం రాత్రే అధికారులు, దాల్మియా యాజమాన్యం గ్రామాల్లోకి వెళ్లి ప్రజాభిప్రాయ సేకరణపై తప్పుడు సమాచారం ఇచ్చారన్నారు. ఉదయం 9 గంటలకు సమావేశాన్ని నిర్వహిస్తామని పర్యావరణ శాఖ చెబితే అధికారులు, దాల్మియా యాజమాన్యం మాత్రం కలెక్టర్ వచ్చే సరికి 12 గంటలు అవుతుంది.. ఆ సమయానికి రావాలంటూ చెప్పడం చూస్తుంటే అధికారు లు ఎవరికి కొమ్ముకాస్తున్నారో తెలుస్తోందన్నా రు. ప్రజలు ఇబ్బందులు పడుతున్నామని లోకయుక్తకు వెళితే దుగ్గనపల్లి గ్రామాన్ని మార్చటానికి దాల్మియా విధిలేని పరిస్థితుల్లో ఒప్పుకుందన్నారు. అయితే వారి కి పరిహారం ఇచ్చి వారికి ఇష్టమైన ప్రాంతంలో గ్రామా న్ని నిర్మించేవరకు స్థానిక ప్రజలకు నమ్మకం లేకుండా పోతోందన్నారు. బాధిత గ్రామాలకు కలెక్టర్ న్యాయం చేయాలనుకుంటే విస్తరణ కోసం దాల్మియా పెట్టుకున్న దరఖాస్తును వెంటనే రిజక్టు చేసి ప్రజల సమస్యలు పరిష్కారం చేసి రెండో ఫ్లాంట్ విస్తరణ పనులు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో చిన్న కొమెర్ల సర్పంచ్ జగదీశ్వరరెడ్డి, వినయ్‌రెడ్డి, భాస్కర్ రెడ్డి , మాజీ సర్పంచ్ శివశంకర్ రెడ్డి పాల్గొన్నారు.
ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి