అవినీతి మచ్చ లేని జీవితం మాది | - | Sakshi
Sakshi News home page

అవినీతి మచ్చ లేని జీవితం మాది

Published Sun, Mar 30 2025 12:39 PM | Last Updated on Sun, Mar 30 2025 2:21 PM

అవినీతి మచ్చ లేని జీవితం మాది

అవినీతి మచ్చ లేని జీవితం మాది

కాంట్రాక్టు వర్కులు చేసిన చరిత్ర

మా కుటుంబానికి లేదు

నా ప్రమేయం లేకుండానే

వర్థిని కన్‌స్ట్రక్షన్‌ రిజిస్ట్రేషన్‌

వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో

ఐఏఎస్‌ను కమిషనర్‌గా తెచ్చాం....

మీరు మీ బంధువును కమిషనర్‌గా తెచ్చుకొని ఆటలాడుతున్నారు

వాసు, మాధవిరెడ్డిపై తీవ్రస్థాయిలో విరుచుకుపడిన మేయర్‌ సురేష్‌ బాబు

కడప కార్పొరేషన్‌ : కాంట్రాక్టు వర్కులు చేసిన చరిత్ర తమ కుటుంబానికి లేదని కడప మేయర్‌ కె. సురేష్‌ బాబు అన్నారు. విజిలెన్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ఇచ్చిన నోటీసులపై శనివారం కార్పొరేషన్‌ కార్యాలయంలోని తన ఛాంబర్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు. తన కుమారుడిది అని చెప్తున్న వర్థిని కాంట్రాక్టు సంస్థను తనకు తెలియకుండానే రిజిస్ట్రేషన్‌ చేశారని, అది చేసిన మొత్తం వర్కులు కూడా రూ.30లక్షలలోపే అన్నారు. పనుల్లో ఎక్కడా అవినీ తి జరిగినట్లుగానీ, నాణ్యతలో లోపాలున్నాయనిగా నీ నోటీసుల్లో చెప్పలేదన్నారు. పనులు చేయకుండా బిల్లు లు చేసుకున్నట్లు కూడా ఎక్కడా లేదన్నారు. వర్క్‌ చేసే విధానంలో, కాంట్రాక్టర్‌ రిజిస్టర్‌ చేసే విధానంలో తప్పులున్నాయని చెప్పారన్నారు. రూ.10లక్షలు పైబడిన వర్కులు మాత్రమే తన దృష్టికి వస్తాయని, ఆలోపు వర్కులు కమిషనర్‌ స్థాయిలోనే జరుగుతాయని అందువల్ల ఈ కాంట్రాక్టు పనుల విషయం తనకు తెలియలేదన్నారు.

40 ఏళ్ల నుంచి తన పెదనాన్న, తాను, తన భార్య చిన్నచౌకు సర్పంచులుగా ఉన్నామని, 2001లో జెడ్పీ చైర్మన్‌గా, రెండు పర్యాయాలు మేయర్‌గా, కాంగ్రెస్‌, వైఎస్సార్‌సీపీల్లో 15 ఏళ్లు జిల్లా అధ్యక్షుడిగా పనిచేశానని, ఎక్కడా చిన్న అవినీతి మచ్చ లేదన్నారు. వైఎస్సార్‌, వైఎస్‌ జగన్‌ ముఖ్యమంత్రులుగా ఉన్న సమయంలో జిల్లాల్లో రూ.20 వేలకోట్ల అభివృద్ధి పనులు జరిగాయని, తాను చేయాలని అనుకుంటే వందలకోట్ల కాంట్రాక్టు పనులు చేసేవాడినన్నారు. రాజకీయాల్లోకి వచ్చాక తాము ఆస్తులు అమ్ముకున్నామే తప్పా, ఎక్కడా సంపాదించుకోలేదని స్పష్టం చేశారు. నిత్యం ప్రజాసేవలో ఉన్న తనపై నిందలు వేయడం బాధాకరమన్నారు.

ట్రెజరీలో భద్రపరచాల్సిన డాక్యుమెంట్లు వారి చేతికి ఎలా వచ్చాయి

2019లో ఎన్నికల్లో నామినేషన్‌ వేసిన డాక్యుమెంట్లను ట్రెజరీలో భద్రపరచాల్సి ఉండగా, వాటిని అధికారులతో బయటికి తీయించి, ఒరిజినల్స్‌ లేకపోయినా ఒక డీఈతో అటెస్టేషన్‌ చేయించి అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారన్నారు. ఈనెల 28వ తేది సాయంత్రం నోటీసు తనకు అందిందని, ఐదు రోజుల ముందే ఆ నోటీసును ఎమ్మెల్యే మాధవి, శ్రీనివాసులరెడ్డి బహిర్గత పరచడం అధికార దుర్వినియోగానికి పరాకాష్ట అన్నారు. 2019లో అఫిడవిట్‌లో చూపినప్పుడు తన కుమారుడు ఒక మైనర్‌ అని, ఇప్పుడతను మేజర్‌ అని తెలిపారు. ఎలక్షన్‌ కమిషన్‌ దాచిన డాక్యుమెంట్లు వారి చేతికి ఎలా వచ్చాయో చెప్పాలని ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వం రాగానే అందరినీ భయపెట్టి రెండు బార్లను స్వాధీనం చేసుకున్నారని, అడ్డూ అదుపూ లేకుండా ఇసుక, మట్టి దోపిడీ చేస్తున్నారని ధ్వజమెత్తారు. మట్కా సైతం ఆడిస్తున్నారని విమర్శించారు.

వాసు అవినీతి ఎవరికి తెలీదు...

అధికారంలోకి వచ్చాక మాధవిరెడ్డి అక్రమాలకు లెక్కేలేదు

సంధ్యా సర్కిల్‌లో ఉన్న ఆర్‌ఎస్‌ఆర్‌ స్క్వైర్‌ మాల్‌లో 0.04 సెంట్లు ప్రభుత్వ భూమిని వాసు ఆక్రమణ చేశారని, దీనిపై కమిషనర్‌ నోటీసు ఇస్తే కోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకున్నారన్నారు. మధుసూదన్‌రెడ్డి అనే వ్యక్తి తన చెల్లికి పసుపు, కుంకుమ కింద ఇచ్చిన స్థలాన్ని కూడా ఆక్రమించేందుకు వారిని స్టేషన్‌కు పిలిపించి బెదిరించారన్నారు. ఈ 9 నెలల్లోనే ఎమ్మెల్యే మాధవి, శ్రీనివాసులరెడ్డి ఎన్నో అక్రమాలు చేశారని, 15వ ఆర్థిక సంఘం కింద చేపట్టే పనుల టెండర్లలో ఎవరూ పాల్గొనకుండా కాంట్రాక్టర్లను బెదిరిస్తున్నారన్నారు. నగరాన్ని అభివృద్ధి చేసేందుకు మాత్రం ప్రభుత్వం నుంచి ఒక్క పైసా నిధులు తేలేదని ఎద్దేవా చేశారు. తనకిచ్చిన నోటీసుపై ప్రభుత్వానికి వివరణ ఇస్తానని, అవసరమైతే న్యాయపోరాటం చేస్తానని తెలిపారు. ఈ సమావేశంలో డిప్యూటీ మేయర్‌ నిత్యానందరెడ్డి, కార్పొరేటర్లు పాకా సురేష్‌, మగ్బూల్‌ బాషా, కె. బాబు, మల్లికార్జున, చంద్రహాసరెడ్డి, బాలస్వామిరెడ్డి, రామలక్ష్మన్‌రెడ్డి, శ్రీరంజన్‌రెడ్డి, బసవరాజు పాల్గొన్నారు.

1995లో శ్రీ సాయి కన్‌స్ట్రక్షన్‌లో పార్టనర్‌గా ప్రవేశించిన టీడీపీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులరెడ్డి అవతవకలకు పాల్పడితే 2004లో ఈఎన్‌సీ శివారెడ్డి ఆ సంస్థను బ్లాక్‌లిస్టులో పెట్టారని గుర్తు చేశారు. ఆ తర్వాత ఆర్‌కే ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ అనే ఇంజినీరింగ్‌ కాంట్రాక్టు సంస్థను కొని దొంగ సర్టిఫికెట్లు పెట్టి కాంట్రాక్టు సంస్థను ఎలా ప్రమోట్‌ చేసుకున్నారో, ఎంత నల్లధనం వెనకేశారో అందరికీ తెలుసన్నారు. 2014–19లో టీడీపీ ప్రభుత్వంలో గ్రామీణ ప్రాంతాల్లో చేయాల్సిన నీరు–చెట్టు పనులను కడప నగరంలో చేసి...9 ఏళ్ల తర్వాత ఇప్పుడు ఆ బిల్లులను చేసుకునేందుకు ఇరిగేషన్‌ అధికారులపై ఒత్తిడి తెస్తున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు. శ్రీనివాసులరెడ్డి కుమారుడిని జిల్లా క్రికెట్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడిని చేయాలని మెజార్టీ లేకపోయినా 8 మంది క్రికెట్‌ అసోసియేషన్‌ సభ్యులను బ్లాక్‌మెయిల్‌ చేసి 6 గంటలు ఇంట్లో నిర్భంధించి సంతకాలు చేయించుకున్నారని...ఇంత దౌర్జన్యం ఎక్కడా చూడలేదని విమర్శించారు. కడపను అభివృద్ధి చేయాలనే సంకల్పంతో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో ఒక ఐఏఎస్‌ అధికారిని తెచ్చి పాలన చేశామని, కూటమి ప్రభు త్వం అధికారంలోకి వచ్చాక కార్పొరేషన్‌ స్థాయిని తగ్గించి ఓ కేసులో ఉన్న వాళ్ల బంధువైన గ్రూప్‌–1 అఽధికారిని కమిషనర్‌గా తెచ్చుకొని ఆటలాడుతున్నారని ధ్వజమెత్తారు. వీళ్లా అవినీతి గురించి మాట్లాడేదని మండిపడ్డారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement