
ప్రజల జీవితాల్లో కాంతి నింపాలి
కడప సెవెన్‌రోడ్స్ : శ్రీ విశ్వావసు నామ తెలుగు నూతన సంవత్సరం జిల్లా ప్రజల జీవితాల్లో ఉషస్సు నింపాలని కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి ఆకాంక్షించారు. ఆదివారం కలెక్టరేట్ సభా భవనంలో దేవదాయ ధర్మాదాయశాఖ, పర్యాటక శాఖ సంయుక్తాధ్వర్యంలో నిర్వహించిన ఉగాది వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. కొత్త సంవత్సరంలో అందరికీ పరిపూర్ణమైన ఆరోగ్యం సిద్ధించాలన్నారు. వర్షాలు సంవృద్ధిగా కురిసి పల్లె సీమలు పాడి పంటలతో సుభిక్షంగా కళకళలాడాలని అభిలషించారు.
అన్ని రంగాలకు శుభసూచికం :
విద్వాన్ సొట్టు
జ్యోతిష్య శాస్త్ర ప్రకారం శ్రీ విశ్వావసు నామ సంవత్సరం అన్ని రంగాల వారికి శుభసూచికమని సంస్కృతాంధ్ర సాహితీ పురాణ పండిట్ విద్వాన్ సొట్టు సాంబమూర్తి అన్నారు. ఆయన పంచాగ పఠనం చేస్తూ విశ్వావసు నామ సంవత్సరం అంటే విశ్వానికి సంబంధించిందన్నారు. ఈ ఏడాది కరువు కాటకాలు ఉండవని... పంటలు బాగా పండేలా వాతావరణం అనుకూలిస్తుందన్నారు. ఉగాది పచ్చడిలోని షడ్రుచులు జీవితంలో ఎదురయ్యే వివిధ అనుభవాలకు సంకేతాలన్నారు. కొత్త ఏడాదిలో అడుగు పెట్టిన వారంతా మంచి, చెడు ప్రతి అనుభవాన్ని సమానంగా స్వీకరిస్తూ ముందుకు వెళ్లాలన్నదే ఉగాది పచ్చడి తినడం వెనుక ఉన్న పరమార్థమని వివరించారు. అనంతరం రాశిఫలాల గురించి చదివి వినిపించారు.
నలుగురు పండితులకు
ఉగాది పురస్కారాలు
రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఏడాది వేద పండితులు, అర్చకులు, కవులకు అందించే ఉగాది పురస్కారాలు ఈ యేడు జిల్లాకు చెందిన నలుగురికి వచ్చాయి. ప్రొద్దుటూరుకు చెందిన శ్రీనివాసాచార్యులు, పులివెందులకు చెందిన కలుబండి రామకుమార్‌శర్మ, కడపకు చెందిన గోపాలకృష్ణశర్మ, సొట్టుసాంబమూర్తిలకు దేవాదాయశాఖ ద్వారా ఒక్కొక్కరికి రూ. 10,116 పారితోషికం, ప్రశంసాపత్రం అందజేసి కలెక్టర్ శ్రీధర్ ఘనంగా సత్కరించారు. అనంతరం ఉత్తమ అర్చకులు ఎస్.నరసింహా భట్టార్, బి.చంద్రమౌళిశర్మ, ఎన్.శశిధర్‌లకు కలెక్టర్ ప్రశంసాపత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రొద్దుటూరు ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డి, మైదుకూరు ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్, డీఆర్వో విశ్వేశ్వరనాయుడు, దేవదాయశాఖ సహాయ కమిషనర్ మల్లికార్జున ప్రసాద్, పర్యాటకశాఖ అధికారి సురేష్ పాల్గొన్నారు.
అలరించిన నృత్య ప్రదర్శనలు
ఉగాది వేడుకల సందర్భంగా ముద్ర అకాడమి లహరి బృందం చిన్నారులు ప్రదర్శించిన శాసీ్త్రయ నృత్య ప్రదర్శనలు ఆహుతులను అలరించాయి. అనంతరం వారిని కలెక్టర్ సత్కరించారు. పర్యాటకశాఖ ఆధ్వర్యంలో ఆచార్య మూల మల్లికార్జునరెడ్డి అధ్యక్షతన కవి సమ్మేళనం జరిగింది.
చిన్నారి
నృత్య ప్రదర్శన
కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి
కలెక్టరేట్‌లో ఘనంగా
ఉగాది వేడుకలు

ప్రజల జీవితాల్లో కాంతి నింపాలి

ప్రజల జీవితాల్లో కాంతి నింపాలి